మానవతా దృష్టితో ఆదుకోండి

8 Jun, 2014 02:18 IST|Sakshi

 మైలవరం,న్యూస్‌లైన్: నవాబుపేట బాధితులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో కలిసి శనివారం ఆయన నవాబుపేట గ్రామంలో దుర్ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్‌షేడ్ కూలడంతో మృతి చెందిన వారి కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రూ.50 వేలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 20 వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 10 వేలు చొప్పున అందజేయనున్నట్లు తెలిపారు. పార్టీలకతీతంగా  బాధిత కుటుంబాలను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 
 బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో కలిసి వినతిపత్రం అందజేశామన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5లక్షలు, గాయపడినవారికి రూ.60 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ తమ ట్రస్టు తరపున భవననిర్మాణ కార్మికులకు బీమా చేయించామని మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు బీమా వస్తుందన్నారు. గ్రామంలో దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ పేలుడు వల్ల ఇళ్లు, గో డలు పగుళ్లు వారుతున్నాయని ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే దాల్మియాపై పోరాటం చేయాలని సూచించారు.
  ఈ కార్యక్రమంలో తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, కేకే కొం డారెడ్డి, నారాయణరెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 రైతులను రుణ విముక్తులను చేయాలి
 రైతులను రుణ విముక్తులను చేయాలని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల పంటరుణాలు, బంగారు రుణాలే కాకుండా కౌలుదారుని రుణాలను కూడా మాఫీ చేయాలన్నారు. కోల్డ్ స్టోరేజిలు, గోడౌన్లు, దాల్‌మిల్లులు, యంత్ర పరికరాలకు సంబంధించిన నూర్పిడి యంత్రాలు, వర్మి కంపోస్ట్, నర్సరి, ఉద్యానవన మొక్కలు తదితర వ్యవసాయ రంగానికి చెందిన అన్ని రకాల రుణాలను చంద్రబాబునాయుడు ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు టీడీపీ మేనిఫెస్టోలో పొందు పరిచిన డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగభృతి తదితర వాటిని అమలు చేయకపోతే నిరసనలు తప్పవన్నారు. ఈ సమావేశంలో తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, కేకే కొండారెడ్డి, శివనాథరెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు