హామీలకు బాబు మంగళం

16 Mar, 2017 04:43 IST|Sakshi
హామీలకు బాబు మంగళం

నిప్పులు చెరిగిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
కీలక రంగాలకు బడ్జెట్‌లో అరకొర కేటాయింపులేనా?
రైతులకు రుణమాఫీ ఏదీ? కొత్త రుణాల జాడెక్కడ?
డ్వాక్రా మహిళలను మోసం చేశారు
చంద్రబాబు హయాంలో బడ్జెట్‌ కేటాయింపులకు అర్థమే లేదు

సాక్షి, అమరావతి : ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు లెక్కలేనన్ని హామీలిచ్చారని, గద్దెనెక్కాక వాటి అమలు సంగతి మరచిపోయి, ప్రజలను దగా చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణ మాఫీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకం, ఇళ్ల నిర్మాణం, ఎస్టీ, ఎస్టీల సంక్షేమం, నిరుద్యోగ భృతి వంటి కీలక అంశాలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. బుధవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఆయా రంగాలకు నిధుల కేటాయింపు తీరు దారుణంగా ఉందని విమర్శించారు. జగన్‌ బుధవారం సాయంత్రం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రంగాల వారీగా బడ్జెట్‌ కేటాయింపుల తీరును వివరించారు. అరకొర నిధులతో అభివృద్ధి ఎలా సాధ్యమో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆయన ఏం చెప్పారంటే...

బాబు వచ్చారు.. బంగారం వేలం వేస్తున్నారు   
రుణమాఫీ కోసం ఈ బడ్జెట్‌ రూ.3,600 కోట్లు కేటాయించామని గొప్పగా చెప్పారు. ఇప్పటివరకూ మూడేళ్లలో రుణ మాఫీ పథకానికి రూ.10,600 కోట్లు ఇచ్చారు. సంవత్సరానికి సగటున రూ.3,500 కోట్లు ఇచ్చారని అనుకోవచ్చు. రైతుల వ్యవసాయ రుణాలు మొత్తం రూ.87,612 కోట్లు ఉంటే చంద్రబాబు ఏడాదికి ముష్టివేసినట్లు రూ.3,500 కోట్లు ఇచ్చి రుణమాఫీ చేసినట్లు చెబుతూ రైతుల చెవుల్లో క్యాలీఫ్లవర్‌ పెడుతున్నారు. రైతులు ప్రతి సంవత్సరం వడ్డీ కింద రూ.16,000 కోట్లు చెల్లిస్తున్నారు. వడ్డీలో పావలా వంతు భాగం కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. మరోవైపు రైతులకు పంట రుణాలు అందడం లేదు. బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నారు. కానీ, బాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో బ్యాంకులు బంగారాన్ని వేలం వేస్తూ నోటీసులు ఇచ్చాయి. గతంలో వడ్డీ లేకుండా రూ.లక్ష వరకూ, పావలా వడ్డీతో రూ.3 లక్షల వరకూ రుణం లభించేది. ఇవాళ వడ్డీలేని రుణ పథకానికి కేవలం రూ.172 కోట్లు కేటాయించారు. పావలా వడ్డీ కింద ఇచ్చే రుణాలకు రూ.5 కోట్లు మాత్రమే కేటాయించారు.

డ్వాక్రా మహిళలపై తొలగని రుణ భారం
డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు మైకులు పట్టుకుని చెప్పాడు. ఇప్పుడు దాని గురించి నోరెత్తడం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి డ్వాక్రా రుణాలు రూ.14,200 కోట్లు ఉండేవి. వాటిని చెల్లించవద్దని ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పారు కాబట్టి మహిళలు చెల్లించలేదు. ఇవాళ బ్యాంకులు ఆ అప్పులపై 18 నుంచి 20 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఆ వడ్డీ సంవత్సరానికి రూ.2,600 కోట్లు. మూడేళ్లలో రూ.7,500 కోట్లు ఇప్పటికే దాటిపోయింది.

నాలుగో సంవత్సరం వచ్చింది కాబట్టి డ్వాక్రా మహిళలపై వడ్డీ భారమే రూ.10 వేల కోట్లు. పైగా వారికి రూ.4,900 కోట్లు అప్పు ఇచ్చినట్టు చెప్పుకున్నాడు. మళ్లీ రూ.1,600 కోట్లు క్యాపిటల్‌ ఇన్‌ఫ్యూజన్‌(పెట్టుబడి నిధి) కింద ఇస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఆయన ఇచ్చింది వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. 2015–16 సంవత్సరానికి రూ.575 కోట్లు వడ్డీలేని రుణాలకు ఇవ్వాల్సిన వడ్డీని చంద్రబాబు ఇవ్వలేదు. 2016–17కు సంబంధించి మరో రూ.996 కోట్లు ఇవ్వలేదు. కేవలం రూ.110 కోట్లు ఖర్చుపెట్టారు. 2015 సెప్టెంబర్‌ నుంచి ఇంతవరకూ వడ్డీలేని రుణాలకు సంబంధించిన డబ్బులు ఇవ్వలేదు.

చదువులకు మంగళం పాడాల్సిందేనా?
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు బడ్జెట్‌లో రూ.1,300 కోట్లు మాత్రమే కేటాయించారు. 2015–16లో 15,13,883 మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం దరఖాస్తు చేస్తే, ఇందులో భారీగా కోతలు విధించారు. వీరికి రూ.2,578 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో ప్రభుత్వం విడుదల చేసింది రూ.1,579 కోట్లు మాత్రమే. అంటే ఈ సంవత్సరంలో బకాయిలే రూ.999 కోట్లు ఉన్నాయి. 2016–17లో 15,80191 మంది దరఖాస్తు చేస్తే ఇందులో కోతలు కోసి 14.42 లక్షల మందికి తగ్గించారు. వారికి ఇవ్వాల్సింది రూ.2,481 కోట్లయితే ఇచ్చింది మాత్రం రూ.527 కోట్లే. అంటే ఇంకా రూ.1,954 కోట్లు ఇవ్వాలి.

ముగ్గులేనా.. ఇళ్లు నిర్మిస్తారా?
రెండేళ్లలో 10 లక్షల ఇళ్లు కడతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది 4 లక్షల ఇళ్ల కోసం నిధులు కేటాయిస్తున్నామన్నారు. ఒకసారి గమనిస్తే 2014–15లో రెండు లక్షల ఇళ్లు కడతామన్నారు. కొత్తగా ఒక్క ఇల్లయినా నిర్మించలేదు. గతంలో అర్ధాంతరంగా ఆగిపోయిన 5.3 లక్షల ఇళ్లకు బిల్లులు కూడా చెల్లించలేదు. ఇళ్లు కట్టిస్తామని మూడేళ్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం 48 వేల ఇళ్లకు ముగ్గులు (మార్కింగ్‌) వేశామంటున్నారు. గతేడాది బడ్జెట్‌లో గృహాల కోసం రూ.1,321 కోట్లు కేటాయిస్తే అందులో రూ.490 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ సొమ్ములోనూ రూ.132 కోట్లు వేతనాలకే ఖర్చయ్యింది. ఈ ఏడాది 4 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.1,455 కోట్లు కేటాయించగా, కేపిటల్‌ కింద రూ.129 కోట్లు పెట్టారు. అంటే ఇళ్లు ఎప్పుడు పూర్తవుతాయో బాబుకే తెలియాలి.

ఎస్సీ, ఎస్టీలపై ముఖ్యమంత్రి డాంబికాలు
ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబుకు ఎంత ప్రేమ ఉందో ఈ బడ్జెట్‌లో కేటాయించిన నిధులు చూస్తే తెలుస్తుంది. 2016–17లో రూ.9,457 కోట్లతో ఉప ప్రణాళికను అమలు చేశామన్నారు. అయితే, ఖర్చు చేసింది మాత్రం రూ.5,673 కోట్లే. అంటే ఖర్చు 59 శాతానికి మించలేదు. ఎస్టీలకు సంబంధించి రూ.3,435 కోట్లకుగానూ రూ.2,187 కోట్లు ఖర్చు చేశారు. అయినా వారి అభివృద్ధి కోసం పాటుపడుతున్నట్లు చంద్రబాబు డాంబికాలు పలుకుతున్నారు.

ఖర్చు పెట్టకపోయినా జనం పడి ఉంటారులే!
చంద్రబాబు హయాంలో బడ్జెట్‌ కేటాయింపులకు అర్థమే లేకుండాపోయింది. ముందుగా మాటలు చెబితే పనైపోతుంది, ఆ తరువాత ఖర్చు పెట్టినా.. పెట్టకపోయినా çప్రజలు పడి ఉంటారులే అన్నది చంద్రబాబు నైజం. పార్టీలో ఎమ్మెల్యేలను చేర్చుకునేటప్పుడు కూడా మంత్రి పదవులిస్తామంటూ  తొలుత ఆశలు చూపారు, ఆ తరువాత వారు ఇంకెక్కడికి పోతారు, పడి ఉంటారులే అనే ఉద్దేశంతో మాటను దాటవేస్తారు.

బీసీలకు బాబు దగా  
బీసీల సంక్షేమం కోసం గత మూడేళ్లలో కేటాయింపుల మేరకు ఖర్చు పెట్టలేదు. 2014–15లో రూ.2,665 కోట్లు కేటాయించగా.. కేవలం రూ.2,242 కోట్లు ఖర్చు చేశారు. 2015–16లో రూ.3,195 కోట్లకుగాను రూ.2,573 కోట్లు ఖర్చు పెట్టారు. 2016–17లో రూ.5,103 కోట్లుగాను కేవలం రూ.4,338 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు చూపారు. ఇలా ప్రతి అంశంలోనూ మోసమే కనిపిస్తోంది.

ముష్టి వేసినట్లుగా నిరుద్యోగ భృతి
జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని.. జాబు వచ్చేంత వరకూ ప్రతి ఇంటికి నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు గొప్పగా చెప్పారు. ఈ అంశాన్ని టీడీపీ మెనిఫెస్టోలో కూడా పెట్టారు. రాష్ట్రంలో 1.75 లక్షల ఇళ్లు ఉన్నాయి. ఇలా ఇంటికి రూ.2 వేల చొప్పున నెలకు రూ.3,500 కోట్లు.. ఏడాదికి రూ.40 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ, చంద్రబాబు మాత్రం బడ్జెట్‌లో ముష్టి వేసినట్లుగా కేవలం రూ.500 కోట్లు విదిల్చారు. ఆ సొమ్మును కూడా టీడీపీ కార్యకర్తలు, జన్మభూమి కమిటీల సభ్యుల పిల్లలకే ఇస్తారు.

రూ.100 కోట్లతో 7.50 లక్షల మరుగుదొడ్లు నిర్మిస్తారట!
రాష్ట్రంలో 7.50 లక్షల మరుగుదొడ్లు నిర్మించబోతున్నామని, ఏపీ బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రమని చంద్రబాబు ప్రకటించుకున్నాడు. రంపచోడవరం నియోజకవర్గంలో పర్యటిస్తూ ఒక హాస్టల్‌కు వెళ్ళాను. అక్కడ మరుగుదొడ్లలోకి వెళ్లే పరిస్థితి లేదు. నీళ్లు లేవు. పొద్దున్నే ఎక్కడికి వెళ్తారని పిల్లలను అడిగితే చెంబులు, బాటిళ్లు పట్టుకుని కొండలు ఎక్కుతున్నామని చెప్పారు. 7.50 లక్షల మరుగుదొడ్లు కడతానని చెప్పిన చంద్రబాబు దానికి బడ్జెట్‌లో కేటాయించిన నిధులు కేవలం రూ.100 కోట్లు. 7.50 లక్షల మరుగుదొడ్లు కట్టాలంటే ఒక్కొక్కటీ రూ.15 వేలు వేసుకున్నా రూ.1,050 కోట్లు కావాలి. ప్రభుత్వం ఇస్తానన్నది రూ.వంద కోట్లు. ఈ సొమ్ము ఏమూలకు సరిపోతుంది? ఎవరిని మోసం చేస్తారు?

ఆరోగ్యశ్రీకి అరకొర నిధులే
ఆరోగ్యశ్రీకి రాష్ట్ర బడ్జెట్‌లో అరకొరగా రూ.1,000 కోట్లే కేటాయించారు. గతేడాది 910 కోట్లు అడిగితే బడ్జెట్‌లో రూ.500 కోట్లే కేటాయించారు. ప్రకాశం జిల్లాలో మేము ధర్నాలు చేస్తే మరో రూ.262 కోట్లు ఇచ్చారు. 2015–16 కింద రూ.280 కోట్ల బకాయిలు ఉన్నాయి. 2016–17 కింద ఇంకా రూ.488 కోట్లు చెల్లించాల్సి ఉంది. ‘108’ కోసం అధికారులు రూ.75 కోట్లకు ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వం ఇచ్చింది రూ.60 కోట్లు. బకాయిలు రూ.15 కోట్లు ఉన్నాయి. ‘104’కు రూ.80 కోట్లు అడిగితే రూ.37.5 కోట్లు కేటాయించారు. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు 8 నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో.. ఆరోగ్యశ్రీ కింద రోగులకు వైద్యం అందించేందుకు నిరాకరిస్తున్నారు. కిడ్నీ వ్యాధి గ్రస్తులు, క్యాన్సర్‌ బాధితుల పరిస్థితి దారుణంగా మారింది.

మరిన్ని వార్తలు