సమైక్యమన్నమాటే అనరేం?

30 Dec, 2013 02:14 IST|Sakshi
సమైక్యమన్నమాటే అనరేం?

సమైక్య శంఖారావం యాత్రలో చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
 
    ప్రణబ్‌ను కలసినప్పుడు రాష్ట్రాన్ని విడదీయొద్దని ఎందుకు కోరలేదు?
     ఎంతసేపూ జగన్‌పై బురదచల్లడమేనా?
     ఓట్లు, సీట్ల కోసం, కొడుకును ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టడం కోసం
     సోనియాగాంధీ రాష్ట్రాన్ని విడదీస్తున్నారు
     రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా మంచినీరు ఎక్కడుంటుంది?
     వెయ్యి అడుగుల మేర బోరు వేసినా నీళ్లు రావడం లేదని రైతులు అంటున్నారు
     హైదరాబాద్‌ను దూరం చేస్తే యువత ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలి?
     సమైక్యం అంటూ మోసం చేస్తున్న కిరణ్ అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదు?
 
 సమైక్య శంఖారావం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి:
 ‘‘తిరుపతిలో చంద్రబాబు గారు ప్రజాగర్జన అనే పేరుతో మీటింగు పెట్టారు. ఇందులో ఆయన నోటి నుంచి ‘జై సమైక్యాంధ్ర’ అన్న మాట వచ్చి ఉంటే నిజంగా నేను చాలా సంతోష పడేవాడిని. కానీ సమైక్యం అన్న మాటే రానీయరు. ఎంతసేపూ జగన్‌మోహన్‌రెడ్డి మీద ఎలా బురద చల్లాలనే ఆలోచనతోనే ఆయన మాట్లాడతారు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఇటీవల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసినప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఎందుకు కోరలేదంటూ చంద్రబాబును నిలదీశారు. రాష్ట్రాన్ని సోనియాగాంధీ అడ్డగోలుగా విభజిస్తున్నా కళ్లున్న కబోదుల్లా ఎందుకు ఉండిపోయారని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని, చంద్రబాబును ప్రశ్నించారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించటాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్ కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా తలపెట్టిన సమైక్య శంఖారావం మలిదశ యాత్ర రెండోరోజు ఆదివారం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో కొనసాగింది. రాయలపేట, పెద్ద పంజాణి గ్రామాల్లో జరిగిన బహిరంగ సభలకు భారీఎత్తున ప్రజలు తరలివచ్చారు. వారిని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..
 
 వీళ్లా నాయకులు..?
 సోనియాగాంధీ గారు.. ఓట్ల కోసం, సీట్ల కోసం, తన కొడుకును ప్రధానమంత్రి కుర్చీలో కూర్చో బెట్టుకోవడం కోసం మన పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొడుతున్నారు. ఆమె రాష్ట్రాన్ని విభజిస్తుంటే చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి తందానా అంటున్నారు. కళ్లున్న కబోదుల్లా మారారు. వీళ్లా నాయకులు అనిపిస్తుంది నాకు. ఇక్కడికి వస్తున్నప్పుడు కొందరు రైతన్నలను మీ పరిస్థితి ఏమిటని అడిగా.. ‘వెయ్యి అడుగుల బోరు వేసినా నీళ్లు పడతాయో.. పడవో తెలియని అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాం’ అని వారు చెప్పారు. రైతుల దుస్థితి ఇలా ఉంటే.. గాలేరి నగరి, సుజల స్రవంతి, హంద్రీనీవా ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు కనిపిస్తున్నాయి. రాష్ట్రం ఐక్యంగా ఉన్నప్పుడే కృష్ణా నది నీళ్లు మహారాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత, కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ డ్యాంలు నిండితేనే గాని కిందికి చుక్కనీరు రాని పరిస్థితి ఉంది. ట్రిబ్యునళ్లు, బోర్డులు ఉన్నప్పుడే ఇలా ఉంటే.. మధ్యలో మరో రాష్ట్రాన్ని తీసుకొచ్చి పెడితే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రపు నీరు తప్ప మంచినీరు ఎక్కడుంటుందని సోనియాను, కిరణ్‌ను, ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబును అడుగుతున్నా. 60 ఏళ్లుగా కలసికట్టుగా నిర్మించుకున్న హైదరాబాద్‌ను పదేళ్లలో వదిలి వెళ్లిపోవాలని చెబుతున్నారు. రేపొద్దున చదువుకున్న ప్రతి పేద పిల్లాడు ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్లాలని మీ కాలర్ పట్టుకొని అడిగితే సోనియాగాంధీ, ముఖ్యమంత్రి, చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు. రాష్ట్ర ఆదాయంలో ఒక్క హైదరాబాద్ నుంచే 55 శాతం వస్తుంది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తే సంక్షేమ పథకాలకు, ఉద్యోగుల జీతాలకు డబ్బులు ఎక్కడ్నుంచి తెచ్చిస్తారు?
 
 కర్ణాటక లేదా..? చెన్నై లేదా అన్నారట..!
 చంద్రబాబు మొన్న రాష్ట్రపతిని కలిశారు. కలసినప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని అడుగుతారేమో అని వెయ్యి కళ్లతో ఎదురు చూశా.. కానీ రాష్ట్రపతి వద్ద ఆయన నోట సమైక్యం అన్న మాటే రాని పరిస్థితి చూశాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చంద్రబాబు రాష్ట్రపతిని ఎందుకు అడగలేదు? అలాగే మొన్న చంద్రబాబు గారి వద్దకు ఎన్జీవోలు వెళ్లారు. రాష్ట్రాన్ని విడగొట్టాలంటూ ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకోండి, సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా లేఖ ఇవ్వండని వారంతా చంద్రబాబును అడిగారు.. ‘నేను లేఖ వెనక్కితీసుకోను, విభజన జరగాలి’ అని నిర్దయగా చంద్రబాబు వారితో అన్నారు. పైగా.. ‘ఏం పక్కన కర్ణాటక లేదా? చైన్నై లేదా? మన పిల్లలు అక్కడికి వెళ్లి ఉద్యోగాలు చేసుకోలేరా..?’ అని అన్నాడట. చంద్రబాబూ.. మీ నియోజకవర్గం పక్కనే ఉన్న చెన్నైకి ఒక్కసారి సామాన్యుడిలా వెళ్లండి. అక్కడ ఏపీ రిజిస్ట్రేషన్ నెంబర్ కనిపిస్తే వాళ్లు మనలను ఎలా చూస్తారో  చూడండి. కర్ణాటక వెళ్లి కన్నడం కాకుండా తెలుగులో మాట్లాడి చూడండి.. అక్కడి వాళ్లు ఎలా చూస్తారో! ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తున్నా. మన రాష్ర్టం మనకు ఉండాలి. మన హైదరాబాద్ మనకు ఉండాలి. మన పిల్లలు.. ఇది నా మహానగరం.. ఇది నా కేపిటల్ సిటీ అని ఉద్యోగం కోసం గర్వంగా తలెత్తుకొని అక్కడికి వెళ్లే విధంగా ఉండాలి. కానీ చదువుకున్న పిల్లలు ఎటు పోయినా ఫర్వాలేదు అని ఈ నాయకులు అనుకుంటున్నారు. రైతన్నలు అవస్థలపాలైనా మాకేంలే అని అనుకుంటున్నారు.
 
 కిరణ్.. సమైక్య తీర్మానం ఎందుకు చేయలేదు?
 ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రాన్ని విభజించాల్సిందిగా  ప్రతి అధికారికి కూడా ఆదేశాలు ఇస్తూ యుద్ధ ప్రాతిపదిక ఫైళ్లు మూవ్ చేస్తున్నారు. జూలై 30న రాష్ట్రాన్ని విడగొట్టాలని సోనియా నిర్ణయం తీసుకున్నప్పుడు మొత్తుకొని చెప్పాం.. బిల్లు రాకముందే అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయండని చెప్పాం. సమైక్య తీర్మానం చేసి పంపితే.. దేశం మొత్తం చూస్తుందని, అప్పుడు కాంగ్రెస్ వెనకడుగు వేస్తుందన్నాం. కానీ కిరణ్ పట్టించుకోలేదు. మోసం చేస్తూనే ముందడుగు వేశారు. ఇప్పుడు ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని, మహా నగరాన్ని నాశనం చేస్తున్నారు. ఈరోజు ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి యుద్ధం జరుగుతోంది. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో మనందరం ఒక్కటవుదాం. 30 ఎంపీ స్థానాలను తెచ్చుకుందాం. ఢిల్లీ కోటను బద్దలు కొడదాం. ఆ కోటను మనమే పునర్నిర్మిద్దాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధాని కుర్చీలో కూర్చోబెడదాం.
 
 ఆ ముగ్గురి గుండెలు అదిరి పడాలి..
 నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఢిల్లీ పీఠం దద్దరిల్లేలా.. సోనియాగాంధీ, చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి గుండెలు అదిరేలా సమాధానాలు చెప్పండి. వాళ్లు రాష్ట్రాన్ని విభజిస్తామంటే ఒప్పుకుందామా? (‘ఒప్పుకోం..ఒప్పుకోం’ అంటూ జన స్పందన). తెలుగుజాతిని విడగొడతామంటే ఒప్పుకుందామా? (ప్రజలు: ఒప్పుకోం.. ఒప్పుకోం). ఢిల్లీ వాళ్లకు తెలుగు సరిగా అర్థం కాదు. సోనియాకు, కాంగ్రెస్ వాళ్లకు కాస్త చెవుడు కూడా ఉంది.. కాబట్టి ఇంగ్లిష్‌లో ‘నో’ అని గట్టిగా చెప్పండి.. మన నీటి కోసం మనమే తన్నుకొని చావాలా? (జనం: నో..నో..) మన హైదరాబాద్ కోసం మనమే తన్నుకొని చావాలా? ( ‘నో...నో’ అంటూ ప్రజల ప్రతిధ్వని) రాష్ట్రాన్ని విడగొడుతున్న సోనియాగాంధీని, ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబును, మోసం చేస్తున్న కిరణ్‌ను ఈ ముగ్గురిని క్షమించాలా? (క్షమించొద్దు.. క్షమించొద్దు అని ప్రజల స్పందన). ఇప్పటికైనా మన ఆక్రందన వీళ్లకు తెలుస్తుందని ఆశిద్దాం. ఇంకొక స్లోగన్ కూడా చెప్పాలి. జై సమైక్యాంధ్ర... జై తెలుగుతల్లి... జై వైఎస్సార్. సమైక్య శంఖారావ ం యాత్రలో ముఖ్యమైన అంశం ఏమిటంటే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ప్రజలు సమైక్యాంధ్రప్రదేశ్‌నే కోరుకుంటున్నారని ఈ ముగ్గురికి అర్థం కావాలి. జై వైఎస్సార్ అని చెప్పమని ఎందుకు చెబుతున్నానంటే.. ఆయన బతికి ఉన్నప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టాలని ఎవ్వరూ ఆలోచన కూడా చేయలేదు. ఒక నాయకుడంటే తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఇలా ఏ ప్రాంతానికి వెళ్లినా  ఆ ప్రాంతం వారికి భరోసా ఇచ్చేవాడు. అన్ని ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి కొట్టుకొని చావండీ అని చెప్పే వీళ్లు కాదు నాయకులు. అందుకే ఆ దివంగత నేత వైఎస్సారే నిజమైన నాయకుడు’’.
 
 యాత్ర సాగిందిలా..
 ఆదివారం ఉదయం పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాణి మండలం కేళవాతి నుంచి వైఎస్ జగన్ సమైక్య శంఖారావం యాత్రను ప్రారంభించారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన ముగ్గురి కుటుంబాలను ఓదార్చారు. తొలుత పుంగనూరు మండలం బత్తులాపురంలో పితాంబరం కల్పన కుటుంబాన్ని ఓదార్చారు. అక్కడ్నుంచి నేలపల్లి, దిన్నిపల్లి, పంజాణి మీదుగా పెద్ద పంజాణి చేరుకొని వైఎస్ అవిష్కరించారు. అక్కడ్నుంచి బసవరాజు కండ్రిక, కోగిలేరు. గుడిపల్లి మీదుగా రాయలపేట చేరుకొని బహిరంగ సభలో ప్రసంగించారు. తర్వాత కమ్మపాళ్యెంలో డోలు నాగరాజు కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం చెన్నారెడ్డిపల్లి, సుద్దగుండ్లపల్లిల మీదుగా రాత్రి 8 గంటల సమయంలో దుర్గసముద్రం చేరుకొని తోటి శంకరమ్మ కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం చారాలలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. అక్కడి నుంచి చౌడేపల్లె చేరుకొని రిటైర్డ్ హిందీ పండిట్ లక్ష్మయ్య ఇంటిలో బసచేశారు. జగన్ వెంట యాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణ స్వామి, తాజా మాజీ ఎమ్మెల్యే ఎన్.అమరనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఏఎస్ మనోహర్, గాంధీ, పార్టీ నాయకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డ్డి, ఎం.సుబ్రమణ్యంరెడ్డి, రోజా తదితరులు ఉన్నారు. సోమవారం పుంగనూరు నియోజక వర్గంలో యాత్ర జరుగనుంది.
 
 యాత్రకు 1 నుంచి 3 దాకా విరామం
 చిత్తూరు జిల్లాలో రెండో విడత సమైక్య శంఖారావం యాత్రకు జనవరి 1 నుంచి 3వ తేదీ వరకు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణ స్వామి ఒక ప్రకటన విడుదల చేశారు. నూతన సంవత్సరం పుస్కరించుకొని ఈనెల 31, జనవరి 1 తేదీల్లో యాత్రను నిలిపి వేయాలని పార్టీ కార్యకర్తలు, నాయకులు, భద్రతా సిబ్బంది చేసిన అభ్యర్థన మేరకు జగన్ డిసెంబర్ 31 సాయంత్రమే యాత్ర ముగిస్తున్నారని తెలిపారు. మదనపల్లిలో బహిరంగసభలో ప్రసంగించిన అనంతరం జగన్ హైదరాబాద్‌కు వెళ్లిపోతారని, జనవరి 3న కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నందున తిరిగి 4న తంబళ్లపల్లి నియోజకవర్గం బీ కొత్తకోట నుంచి యాత్ర పునః ప్రారంభిస్తారని తెలిపారు.

>
మరిన్ని వార్తలు