వైఎస్ఆర్ పాలన.. విశ్వసనీయత పాలన

6 Mar, 2014 20:41 IST|Sakshi
వైఎస్ఆర్ పాలన.. విశ్వసనీయత పాలన

నరసారావుపేట: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతో నరసారావు పేట జనసంద్రమైంది. గురువారం రాత్రి జరిగిన వైఎస్ఆర్ జనభేరీకి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. సభ కాస్త ఆలస్యంగా ప్రారంభమైనా జగన్ రాక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు.

వైఎస్ఆర్ చిరునామా ఎక్కడని అడిగితే ప్రజల గుండెల్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి బతికేఉన్నారని చూపిస్తున్నారని జగన్ అన్నారు. మనం రామరాజ్యం అయితే చూడలేదు కానీ, రాజశేఖర రెడ్డి పాలనలో సువర్ణయుగం చూశామని గర్వంగా చెప్పవచ్చని వాఖ్యానించారు. పేదవాడి కుటుంబం నుంచి ఒక్కరైనా పెద్ద చదువులు చదవాలని ఫీజు రీయింబర్స్ మెంట్ ప్రవేశపెట్టారని జగన్ చెప్పారు. పేదల ఆరోగ్యం కోసం వైఎస్ఆర్ 108 ఏర్పాటు చేశారని, వైద్యుడిలా ముందుకొచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుత రాజకీయాలు చదరంగంలా తయారయ్యాయని, ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించారని విమర్శించారు. ప్రస్తుత నాయకులు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా తయారు చేశారని జగన్ మండిపడ్డారు.
 

పదవి కోసం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్ని అబద్ధాలు అయినా చెబుతారని జగన్ విమర్శించారు. చంద్రబాబు పాతతరం మనిషి అయితే, తాను యువతరం ప్రతినిధి అని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎన్నాళ్లు బతికామన్నది ముఖ్యం కాదని, ఎలా బతికామన్నది ముఖ్యమని అన్నారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ గర్వపడేలా నాలుగు సంక్షేమ పథకాలపై సంతకాలు చేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికలు ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతాయని, రాష్ట్రాన్ని ముక్కులు చేసినవారికి బుద్ధి చెప్పాలని జగన్ పిలుపునిచ్చారు. జగన్ ప్రసంగానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.

>
మరిన్ని వార్తలు