రైతులకు ఉచిత విద్యుత్... ప్రత్యేక బడ్జెట్: జగన్

2 Feb, 2014 15:06 IST|Sakshi
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2వ ప్లీనరీ సమావేశం ప్రసంగిస్తున్న వైఎస్ జగన్

రైతు సౌఖ్యంగా ఉన్నప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వ్యవసాయానికి పెద్ద పీట వేస్తామన్నారు. ప్రతి రైతుకు 7 గంటలపాట ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. రైతులకు వడ్డీలేని రుణాలు కూడా అందిస్తామన్నారు. వ్యవసాయ శాఖను ఇద్దరు మంత్రులకు కేటాయిస్తామని చెప్పారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ను ఏర్పాటు చేస్తామన్నారు.

 

ఆదివారం వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలో జరిగిన ఆ పార్టీ రెండు ప్లీనరీ సమావేశంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు. రైతు సమస్యల కోసం 101, పశువు సమస్యల కోసం 101 ఉచితంగా పోన్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో 104, 108 సేవలు దాదాపుగా కనుమరుగైన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సేవలను పునరుద్దరిస్తామన్నారు. ఎన్నివేల కోట్లు ఖర్చు అయిన పిల్లలకు ఉచిత విద్యను అందిస్తామన్నారు.

 

రైతు సంతోషంగా ఉన్ననాడే దేశం సౌఖ్యంగా ఉంటుందన్నారు. బెల్ట్ షాపుల నిర్మూలిస్తామన్నారు. ప్రతి ఒక్కరికి సాంఘిక భద్రత, వృద్ధులు భద్రత తనదేనని స్పష్టం చేశారు. మహిళల పురోగతి కోసం ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. మద్య నియంత్రణ కోసం మహిళ పోలీసులు ఏర్పాటు చేస్తామన్నారు.



దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి జులై 8న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి ప్లీనరీ సమావేశం జరిగిందని జగన్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. అనాటి నుంచి జరిగిన పరిణామాలను వైఎస్ జగన్ సోదాహరణగా వివరించారు. గత రెండున్నర ఏళ్లులో ఎన్నో కష్టాలు పడ్డామన్నారు. ఓట్లు, సీట్లు కోసం చేసిన కుట్రలు కుతంత్రాలు చూశామన్నారు. ఎన్నికుట్రలు కుంత్రాలు చేసిన వెంట్రుక కూడా పీకలేకపోయారని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాజకీయాలు ఇంత అన్యాయంగా ఉంటాయో అప్పుడే తెలిసిందన్నారు. తన ప్రసంగంలో చంద్రబాబు, కిరణ్ పాలనలపై వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు.

 

దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం కనుమరుగుచేసిందని ఆరోపించారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పరిపాలన చేసింది ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డి అని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కిరణ్ పాలనలో అనారోగ్యశ్రీగా మారిందని ఎద్దేవా చేశారు.

 

ఆ పథకంలోని 129 సేవలను కిరణ్ సర్కార్ తొలగించిందని చెప్పారు. రాష్ట్ర విభజన చేస్తున్న యూపీఏ అధ్యక్షురాలు సోనియాపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని సమైక్యం ఉంచే క్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏనాడైన జాతీయస్థాయిలో ఏ నేతనైనా కలిశారా అని ప్రశ్నించారు. కనీసం ఏనాడు నిరాహారదీక్ష కూడ చేయలేదని జగన్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు