వామ్మో.. ఇది పులి గాండ్రింపే

2 Feb, 2019 13:17 IST|Sakshi
అరటితోట రైతును విచారిస్తున్న ఎఫ్‌ఎస్‌ఓ

 భయాందోళనలో యాదవాడ గ్రామస్తులు

తనిఖీలు చేస్తున్న అటవీ సిబ్బంది

కర్నూలు, ఆళ్లగడ్డ రూరల్‌: ఉదయం లేవగానే వెంకటేశ్వర్లు అనే రైతు తన అరటి తోటను చూడటానికి వెళ్లాడు. తోట పరిశీలించిన తరువాత పక్కనే ఉన్న మిరప పంటను చూస్తుండగా అరటి తోటలో నుంచి పెద్దగా అరుపు వినిపించింది. వెంటనే మళ్లీ ఇంకా పెద్దగా వినిపించింది. భయాందోళన చెందిన రైతు ఆ అరుపు పులి గాండ్రింపేనని నిర్ధారణకు వచ్చి ఊర్లోకి వెళ్లి చెప్పాడు. మండలంలోని యాదవాడ గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు  పులిని చూద్దామని అరటితోట వద్దకు వచ్చారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు రాణెమ్మ, వెంకటసుబ్బయ్య అరటి తోటకు వద్దకెళ్లి పులి జాడ కోసం పొలమంతా తిరిగి రైతును అడిగి వివరాలు తెలుసుకున్నారు.

రైతు మాట్లాడతూ తాను విన్నది పులి గాండ్రింపేనని చెప్పాడు. అంతేగాక ప్రస్తుతం పొలాల్లో జింకలు మందలు మందలుగా ఉంటున్నాయని, వాటికోసం పులి వచ్చి ఉంటుందని పేర్కొన్నాడు. జింకలు తిరిగిన పాదముద్ర వెంట పులి పాదముద్రలు కూడా ఉన్నాయని వివరించాడు. ఎఫ్‌ఎస్‌ఓలు మాట్లాడుతూ జింక పాదముద్రలు ఉన్నవి వాస్తవమేనని వాటి వెంట పెద్ద పాదముద్రలు కూడా ఉన్నాయి. కానీ పొడిమన్ను కావడంతో స్పష్టంగా కనిపించడం లేదన్నారు. పులిపాదముద్రలుగా తేలితే ఉన్నతాధికారులతో మాట్లాడి బోను ఏర్పాటు చేస్తామన్నారు. ఒకవేళ పులి కనిపిస్తే ప్రాణహాని తలపెట్టొద్దని రైతులకు సూచించారు. వారి వెంట ఏబీఓ బాషా, రామకృష్ణ, గార్డు నాగప్ప తదితరులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు