రోజురోజుకు పెరిగే యాగంటి బసవయ్య 

27 Aug, 2019 08:11 IST|Sakshi

ప్రకృతి రమణీయత మధ్య వెలసిన యాగంటి క్షేత్రం

శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు 

చుట్టూ అడవి..ఎర్రటి కొండలు..పచ్చటి పరిసరాలు..రణగొణులు లేని ప్రశాంత క్షేత్రం యాగంటి. బనగానపల్లెకు 13 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ క్షేత్రానికి ఎంతో ప్రాశస్థ్యం ఉంది. నిత్యం ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఆహ్లాదాన్ని, ఆధ్యాత్మికతను పంచే యాగంటి క్షేత్రంపై ప్రత్యేక కథనం. 

సాక్షి, బనగానపల్లె(కర్నూలు): యాగంటి క్షేత్ర ఉనికి పురాణకాలం నుంచి ఉందని భక్తుల నమ్మకం. అపర శివభక్తుడైన భృగుమహర్షి ఇక్కడ శివ సాక్షాత్కారం కోసం తపస్సు చేశారని, ఫలితంగా భార్యా సమేతంగా ఇక్కడ శివుడు కొలువైయ్యాడని ఒక కథనం. మరో జానపద కథ కూడా ఉంది. ఇక్కడ పూర్వం చిట్టెప్ప అనే శివభక్తుడు శివుడి కోసం తపస్సు చేశాడట. కొన్ని రోజులకు అతడికి పెద్ద పులి కనిపించిందట.  ఆ పెద్దపులినే శివుడని భావించిన చిట్టెప్ప సంతోషంతో ‘‘నేకంటి నేకంటì ’’ అని కేరింతలు కొట్టడంతో అదే కాలక్రమంలో యాగంటి అయ్యిందని అంటారు. ఎర్రమల కొండల్లో ఏకాంతంగా స్వచ్ఛంగా ఉండే ఈ క్షేత్రం నిరాడంబరంగా తన ఆధ్యాత్మిక కిరణాలను వెదజల్లుతూ ఉంటుంది. ఏకశిలపై నందిని  ఉమామహేశ్వరులు వెలిసిన క్షేత్రం దేశంలో ఇది ఒక్కటే. కాలజ్ఞానం చెప్పిన బ్రహ్మంగారు కలియుగాంతానికి ఒక సూచనగా ఈ క్షేత్ర ప్రస్థావన చేశారు.  

అగస్త్యుని ఆలయం 
యాగంటి క్షేత్రానికి అగస్త్యుడు వచ్చాడని ఒక కథనం. ఆయన ఇక్కడ విష్ణువు ఆలయాన్ని నెలకొల్పాలని భావించడనీ, అయితే అందుకు సిద్ధం చేసిన శ్రీవిష్ణువు మూలవిరాట్టు చివరి నిమిషంలో భగ్నం కావడం వల్ల ఆ పని నెరవేరలేదని కథనం. యాగంటి క్షేత్రం వైష్ణవాలయానికి తగినట్టుగా గాలి గోపురంతో ఉంటుంది. అయితే దీనిని నిర్మించదలిచినప్పుడు అప్పటి రాజు కలలో కనిపించిన ఈశ్వరుడు ఇది శేవ క్షేత్రానికే  సముచితమని చెప్పడంతో శివాలయంగా మారిందని అంటారు. ఈ వివరాలు ఎలా ఉన్నా యాగంటి ప్రధానాలయానికి చుట్టూ ఉన్న గుహలయాల్లో ఒక దానిలో శ్రీ వెంకటేశ్వరుడి గుడి ఉంది. ఆ మూర్తికి కూడా ఎడమకాలి బొటనవేలు భగ్నం అయి ఉండటానికి భక్తులు దర్శించవచ్చు. 

హరిహరరాయల కాలం నాటి క్షేత్రం 
ఈ క్షేత్రం ఎప్పుడు ఏర్పడిందనేది ఖచ్చితంగా తెలియకపోయినా హరిహరాయిలు, బుక్కరాయల కాలంలో (14వ శతాబ్దం) ఈ ఆలయం అభివృద్ధి చెందిందని ఆధారాల ద్వారా తెలుస్తోంది. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించినట్టు దాఖలాలు ఉన్నాయి. ఈ గుడి నిర్మాణంలో, విస్తృతిలో విజయనగర కాలం నాటి ధోరణి కనిపిస్తుంది. ఈ ఆలయంలో ఉన్న కోనేరు స్వచ్ఛమైన నీటితో కనిపిస్తుంది. (అలాంటిదే మహానంది క్షేత్రంలో చూడవచ్చు). అజ్ఞాత కొండధారతో నిండే ఈ కోనేరులో స్నాం చేస్తే సమస్త రుగ్మతలు పోతాయని ఒక నమ్మకం. మరో అజ్ఞాత కొండధారతో వచ్చే నీటిని ‘‘అగస్త్య పుష్కరిణి’’గా చెప్తారు. ఈ పుష్కరిణిలో ఉన్న నీటిని కేవలం స్వామి అభిషేకానికి వాడతారు.
 

శని దోషం లేదు... కాకి ప్రవేశం లేదు 
ఈ క్షేత్రంలో శనీశ్వరుని వాహనమైన కాకికి ప్రవేశం లేకపోవడం ఒక వింత. ఒకానొక సమయంలో అగస్త్య మహాముని ఇక్కడ తపస్సు చేస్తేంటే కాకాసురడనే కాకుల నాయకుడు అనేక కాకుల సమూహంతో వచ్చి తపస్సుకు ఆటంకం కలిగించిన్నట్లు ప్రతీతి. ఆగ్రహించిన ఆగస్త్యముని ఈక్షేత్ర ప్రాంతంలో కాకులు సంచరించరాదని శపించాడు. అప్పటి నుంచి నేటి వరకు ఈ దివ్యక్షేత్రంలో కాకులు మచ్చుకైనా కానరావు. కాగా కాకి శనిదేవుని వాహనం కనుక తన వాహనానికి స్థానం లేని ఈ క్షేత్రంలో తాను ఉండనని శనీశ్వరుడు ప్రతిన బూనాడు. కనుక ఇక్కడ నవగ్రహాలు ఉండవు. ఫలితంగా శని ప్రభావం లేని ప్రభావవంతమైన క్షేత్రంగా విలసిల్లుతోంది.
 

దర్శన వేళలు 
ప్రతిరోజు ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 8గంటల వరకు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 1గంట నుంచి 3గంటల వరకు కూడా భక్తులకు దర్శనం ఉంటుంది. 

రోజురోజుకు పెరిగే యాగంటి బసవయ్య 
యాగంటి క్షేత్రం బసవయ్య పేరుతో ఉన్న నందీశ్వరుడి విగ్రహం విశేషమైనది. సాధారణంగా నంది కొమ్ముల నుంచి చూస్తే శివాలయాల్లో శివలింగ దర్శనం అవుతుంది. అయితే ఈ క్షేత్రంలో అయ్యవారు అమ్మవారితో కొలువైన్నారు. కాబట్టి వారికి కాస్త చాటు కల్పించడానికి నందీశ్వరుణ్ణి ఈశాన్యంలో ప్రతిష్టించారని అంటారు. ఈ నంది రోజు రోజుకూ పెరుగుతోందని భావిస్తున్నారు. తొంభై ఏళ్ల క్రితం ఈ నంది చుట్టూ ప్రదక్షిణలు చేసే వీలు ఉండేదనీ, ఇప్పుడు నంది పెరగడంతో మంటపం స్తంభాలకూ నందికీ మధ్య ఉన్న స్థలం పూర్తిగా తగ్గిపోవడం గమనించవచ్చు. పురావస్తుశాఖ అంచనా ప్రకారం ఈ నంది ప్రతి 20 సంవత్సరాలకు అంగుళం మేర పెరుగుతోంది. కలియుగాంతానికి ఇది లేని రంకె వేస్తుందని బ్రహ్మంగారు చెప్పారు. 

ఒకే శిలపై ఉమామహేశ్వరులు
వసతి  
ఇక్కడ బస చేసేందుకు ఏపీ టూరిజం, శ్రీ ఉమామహేశ్వర నిత్యాన్నదానం, బ్రహ్మణి రెసిడెన్సీ, టూరిజం,  రెడ్ల, వాసవి ఆర్యవైశ్య, వేదగాయత్రి బ్రాహ్మణ తదితర వసతి గృహాలు ఉన్నాయి. నిత్యాన్నదాన సౌకర్యం ఉంది.    

మరిన్ని వార్తలు