ముగిసిన యానాం ప్రజా ఉత్సవాలు

9 Jan, 2015 00:11 IST|Sakshi
ముగిసిన యానాం ప్రజా ఉత్సవాలు

 యానాం టౌన్ :స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడామైదానంలో పుదుచ్చేరి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మూడురోజుల నుంచి జరుగుతున్న యానాం ప్రజా ఉత్సవాలు గురువారం రాత్రితో ముగిశాయి. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 16వ  ఫల పుష్ప ప్రదర్శన  కూడా ముగిసింది. ముగింపు సభలో స్థానిక ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించడానికి ఈ ఉత్సవాలను నిర్వహించినట్టు స్పష్టం చేశారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సభలో యానాం పరిపాలనాధికారిఎస్.గణేశన్, ఎస్పీ దాట్ల వంశీధరరెడ్డి, మున్సిపల్ కమిషనర్ లంక రామారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి కామిశెట్టి వేణుగోపాలరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యభాస్కర్ పాల్గొన్నారు. అనంతరం ఉత్సవాల్లో నిర్వహించిన వివిధ పోటీల్లోని విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు ప్రదానం చేశారు.  
 
 అలరించిన సినీ ఆర్కెస్ట్రా
 ముగింపు కార్యక్రమంలో సినీ సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ బృందం నిర్వహించిన సినీ ఆర్కెస్ట్రా, జబర్దస్త్ బృందం ప్రదర్శించిన వివిధ స్కిట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆర్కెస్ట్రాలో శ్రీలేఖ, గీతామాధురి, శ్రీకృష్ణ, దీపు, అంజనా సౌమ్య, సాయిశిల్ప తదితరులు హుషారైన సినిమా పాటలు పాడి సందడి చేశారు. అలాగే జబర్దస్త్ బృంద సభ్యులు  షేకింగ్ శేషుకుమార్, అవతార్ చిట్టిబాబు, ఫణి, రాకేష్, కార్తీక్, ఆర్పీ వివిధ హాస్య స్కిట్లు ప్రదర్శించి అందరినీ నవ్వించారు. స్థానిక కళాకారులు ప్రదర్శించిన నృత్యాలూ ఆకట్టుకున్నాయి. కార్యక్రమాలను యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు పర్యవేక్షించారు. వేలాది మంది ప్రదర్శనలను తిలకించారు.
 

మరిన్ని వార్తలు