యండపల్లికే పట్టం

22 Mar, 2017 15:38 IST|Sakshi
► వరుసగా రెండోసారి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నిక 
►  వైఎస్సార్‌సీపీ మద్దతుతో జయకేతనం 
►  పట్టాభిని ఓడించిన పట్టభధ్రులు
►  పని చేయని నారాయణ మంత్రాంగం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగించి ఎమ్మెల్సీ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ  సాధించిన విజయానందం 24 గంటలు కూడా గడవక ముందే ఆవిరైంది. తూర్పు రాయలసీమ పరిధిలోని ఉపాధ్యాయుల బాటలోనే పట్టభద్రులు కూడా టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని మట్టి కరిపించారు. పీడీఎఫ్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి  3,232 ఓట్ల మెజారిటీతో రెండోసారి శాసన మండలికి ఎన్నికయ్యారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలు గెలవడానికి మంత్రి నారాయణ చేసిన మంత్రాంగం ఫలించలేదు.
అభ్యర్థి ఎంపికే మైనస్‌
తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తన విద్యా సంస్థల మాజీ ఉద్యోగి, తనకు అత్యంత సన్నిహితుడైన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని మంత్రి నారాయణ బరిలోకి దించారు. సీఎం చంద్రబాబుతో తనకున్న సన్నిహిత సంబంధాల కారణంగా ఆయన పట్టాభిని అభ్యర్థిగా ప్రకటింప చేశారు.  వ్యవహార తీరు, ప్రజల్లో మంచి పేరు లేకపోవడం పట్టాభికి వ్యతిరేక వాతావరణం సృష్టించాయి. దీనికి తోడు జిల్లా పార్టీ ముఖ్య నేతలెవరితో సంప్రదించకుండా, వారి అభిప్రాయం తెలుసుకోకుండా పట్టాభిని ఎంపిక చేయడంపై టీడీపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి, అసహనం వెల్లడయ్యాయి. మూడు జిల్లాల్లో టీడీపీ ముఖ్య నేతలే ఆయన అభ్యర్థిత్వాన్ని జీర్ణించుకోలేక ఈ ఎన్నికల వ్యవహారానికి దూరంగా వ్యవహరించారు.
సీఎం జోక్యంతో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పార్టీ నేతలు అయిష్టంగా పట్టాభి కోసం పనిచేశారు. పట్టాభిని అభ్యర్థిగా ప్రకటించిన రోజే పీడీఎఫ్‌ అభ్యర్థి శ్రీనివాసులురెడ్డి విజయం ఖాయమైందని టీడీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తూ వచ్చారు. పార్టీ నేతల సహాయ నిరాకరణ గమనించిన మంత్రి నారాయణ పట్టాభిని గెలిపించుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగారు. ఒక వైపు పార్టీ నేతలను బుజ్జగిస్తూనే మరో వైపు ఎన్నికల నిర్వహణ కోసం తాను చేయాల్సిన పనులు చేశారు. తన విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు పరిచయం ఉన్న వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించడంలో సఫలమయ్యారు. ఈ ఓట్లతో విజయం సాధించగలమని ధీమాతో వ్యవహరించారు.
నెల్లూరు జిల్లాలోని 67,547 ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టగలిగితే విజయం కోసం ఎవరి మీద ఆధారపడాల్సిన పనిలేదనే వ్యూహం అమలు చేశారు. ఇందుకోసం తీవ్రంగా కసరత్తు చేశారు. మూడు జిల్లాల్లో పట్టభద్రుల ఓటర్ల జాబితాలు దగ్గర పెట్టుకుని తన విద్యా సంస్థలు, తనకు నమ్మకమైన పార్టీ నేతల ద్వారా వారందరినీ కలిసి ఓటు అభ్యర్థించే ఏర్పాటు చేశారు. ఓటర్లకు తాయిలాలు కూడా అందించే ఏర్పాట్లు చేశారు. ‘‘ అభ్యర్థి పట్టాభి కాదు నేనే అనుకోండి’’ అనేలా అన్నీ తానై వ్యవహరించారు. ఇంత చేసినా మంత్రి తన మనిషి పట్టాభిని గెలిపించుకోలేక పోయారు. పీడీఎఫ్‌ అభ్యర్థి యండపల్లి శ్రీనివాసులురెడ్డి విజయం కోసం సీపీఎం, దాని అనుబంధ ఉపాధ్యాయ, ఇతర సంఘాల నాయకులు, కార్యకర్తలు మూడు నెలల పాటు తీవ్రంగా పనిచేసి పట్టాభిని ఓడించగలిగారు.
 సొంత జిల్లాలోనే దక్కని దన్ను
టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డికి సొంత జిల్లా అయిన నెల్లూరులోనే ఓటర్లలో పట్టు దక్కలేదు. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ కోసం టీడీపీ శ్రేణులు, నారాయణ సంస్థల ఉద్యోగులు ప్రచార ఆర్భాటం చేశారు తప్ప ఓటర్లను ఆకర్షించలేక పోయారు. పీడీఎఫ్‌ అభ్యర్థి, ఆయన మద్దతుదారులు మూడు నెలల పాటు ఎలాంటి హడావుడి లేకుండా ఓటర్లందరినీ కలిసి ఓటు అభ్యర్థించడం కలిసి వచ్చింది. పైగా యండపల్లికి తన సొంత జిల్లా చిత్తూరులో సౌమ్యుడు, మృదు స్వభావి, నిగర్వి అనే మంచి పేరు ఉంది.  పార్టీలకు అతీతంగా ఆ జిల్లాలోని వారంతా సొంత మనిషిగా భావించారు. ప్రకాశం జిల్లాలో సీపీఎం బలం యండపల్లిని విజయబావుటా ఎగురవేయడానికి దోహదం చేసింది.
యండపల్లికి  మెజార్టీ 3,232
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 1,47,907 ఓట్లు పోలయ్యాయి. ఇందులో చెల్లని ఓట్లు 14,551 కాగా మిగిలిన 1,33,202 ఓట్లను అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. ఈ ఓట్ల లెక్కింపులో మొదటి ప్రాధాన్యత కింద 50 శాతానికి పైబడి ఒక్క ఓటుతో మెజారిటీ సాధించాలంటే 66,602 కోటా ఓట్లు ఒకే అభ్యర్థికి రావాల్సి ఉంది. అయితే మొదటి ప్రాధాన్యత రౌండ్‌లో యండపల్లి శ్రీనివాసులురెడ్డికి 64,089 ఓట్లు రాగా, పట్టాభిరామిరెడ్డికి 60,898 ఓట్లు వచ్చాయి.
దీంతో మొదటి ప్రాధాన్యత కోటా ఓట్ల మెజారిటీకి గాను యండపల్లికి 2,513 ఓట్లు తక్కువగా వచ్చాయి. దీంతో అధికారులు ఎలిమినేషన్‌ పద్ధతిలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును చేపట్టారు. ఈ ప్రక్రియలో మొత్తం 13 మంది అభ్యర్థులు ఎలిమినేషన్‌ తరువాత యండపల్లి శ్రీనివాసులు రెడ్డికి మెజారిటీ దక్కింది. దీంతో సమీప ప్రత్యర్థి పట్టాభిరామిరెడ్డిపై 3,232 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 
మరిన్ని వార్తలు