గ్రానైట్‌ అక్రమ రవాణా సూత్రధారి యరపతినేని!

18 Oct, 2019 05:03 IST|Sakshi

ఏడాదిలో నకిలీ బిల్లులతో రూ.300 కోట్ల విలువ చేసే గ్రానైట్‌ అక్రమ రవాణా

రాయల్టీ, జీఎస్టీ రూపంలో ప్రభుత్వ ఖజానాకు రూ.85 కోట్ల మేర గండి

దందా సాగించిన యరపతినేని అనుచరుడు 

గత ఐదేళ్లలో రూ.వెయ్యి కోట్లకు పైగా దోచేసిన గ్రానైట్‌ మాఫియా

‘ప్రకాశం’ పోలీసుల విచారణలో వెలుగులోకి..

అక్రమాలపై సిట్‌ను ఏర్పాటు చేసిన ఎస్పీ

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కనుసన్నల్లో గ్రానైట్‌ మాఫియా గత ఐదేళ్లు యథేచ్ఛగా అక్రమ రవాణాకు పాల్పడినట్లు తేలింది. నకిలీ వే బిల్లులతో వేలాది లారీల గ్రానైట్‌ను రాష్ట్రం దాటించిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. నకిలీ కంపెనీలు సృష్టించి వే బిల్లులు అమ్ముకున్న ముఠా తెలిపిన వివరాలతో ప్రకాశం జిల్లా పోలీసులు నివ్వెరపోయారు. గుంటూరు జిల్లా పల్నాడులో మైనింగ్‌ మాఫియాను నడిపి రూ.వేల కోట్లు దోచుకున్న యరపతినేని తన అనుచరుడు సీఎం (నిక్‌నేమ్‌) అనే వ్యక్తి ద్వారా ప్రకాశం జిల్లాలో సైతం గ్రానైట్‌ మాఫియాను ఏర్పాటు చేశారు. ఈ అక్రమ వ్యవహారంలో ప్రకాశం జిల్లాకు చెందిన కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, రెండు జిల్లాల్లోని కొందరు అధికారులు భాగస్వాములయ్యారు. మార్టూరు ఎస్‌ఐ విచారణలో భారీ కుంభకోణం బయటపడటంతో ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ దీనిపై సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

గ్రానైట్‌ లారీలకు రక్షణ కవచంలా యరపతినేని అనుచరులు
గ్రానైట్‌ ఫ్యాక్టరీల నుంచి బయలుదేరిన గ్రానైట్‌ లారీలకు కిలోమీటర్‌ దూరంలో ముందుగా ఒక కారు వెళ్తుంది. అందులోని యువకులు ఎప్పటికప్పుడు అధికారుల కదలికలను లారీల్లో ఉన్నవారికి చేరవేస్తుంటారు. అధికారులు తారసపడితే వారిని వెంబడిస్తూ నానా హంగామా సృష్టిస్తారు. అప్పటికీ వెళ్లకపోతే యరపతినేనితో ఉన్నతాధికారులకు ఫోన్‌ చేయించి వారిని అక్కడ నుంచి పంపించివేస్తారు. లారీలకు ముందు, వెనుక సుమారు పది మంది యువకులు బైక్‌లపై రక్షణ కవచంలా ఉంటారు. ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు జిల్లాలోకి వెళ్లేందుకు సుమారుగా 20 మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు.

రోజుకో మార్గంలో వెళ్తుంటారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల మధ్య ఈ అక్రమ రవాణా జరుగుతుంది. యరపతినేని ముఖ్య అనుచరుడు సీఎం (నిక్‌నేమ్‌) వీరందరినీ పర్యవేక్షిస్తూ లారీలను సరిహద్దు చెక్‌పోస్టులు దాటిస్తాడు. కాపలాగా వచ్చిన యువకులకు ఒక్కొక్కరికి రోజుకు రూ.వెయ్యి చొప్పున డబ్బు, మద్యం ఎరగా వేస్తాడు. ఇవన్నీ ప్రకాశం జిల్లా పోలీసుల విచారణలో బయటపడ్డాయి. ఇప్పుడు సిట్‌ను కూడా ఏర్పాటు చేయడంతో గ్రానైట్‌ మాఫియా అక్రమాలు మరిన్ని వెలుగుచూసే అవకాశం ఉంది.  

మరిన్ని వార్తలు