‘ఇంగ్లీష్ మీడియాన్ని బూచిగా చూపడం సరికాదు’

18 Apr, 2020 13:41 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఇంగ్లీష్ మీడియంపై కోర్టు కేసును కొట్టేసినంత మాత్రాన ప్రతిపక్షాలు జబ్బలు చరుచుకోవల్సిన అవసరం లేదని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ..  ప్రజా సంకల్పయాత్రలో బడుగు, బలహీన వర్గాలు తమ పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో బోధన జరిగితే బతుకులు బాగుంటాయని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారని గుర్తు చేశారు. నేను విన్నాను, నేను ఉన్నాను, నేను చేస్తాను.. అన్న మాటకు సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అసెంబ్లీలో ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు. 

ఇంగ్లీష్ మీడియంపై రెండు జీవోలు జారీ చేశామని చెప్పారు. ఒకటి నుంచి 10వ తరగతి వరకు తెలుగు సబ్జెక్టును తప్పని సరి చేస్తూ ఒక జీవో, ఇంగ్లీష్ మీడియాన్ని అన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టాలన్నది మరో జీవో అని ఆయన పేర్కొన్నారు. ప్రతి పక్షాలు ఆంగ్ల మధ్యమాన్ని బూచిగా చూపించి జబ్బలు చరుచుకుంటున్నారని ఇది సరైంది కాదని లక్ష్మీ ప్రసాద్‌ మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియంపై సీఎం చిత్తశుద్ధితో ఉన్నారని వ్యాఖ్యానించారు. న్యాయ పోరాటం ద్వారా ఇంగ్లీష్ మీడియాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం తగిన ప్రణాళిక సిద్ధం చేస్తోందని లక్ష్మీ ప్రసాద్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు