ఉన్నోళ్లకే ఓడలు!

22 Mar, 2018 11:07 IST|Sakshi
చార్టర్డ్‌ బోటు

యాటింగ్‌ ఫెస్టివల్‌ సంపన్నులకు మాత్రమే!

28 నుంచి 31 వరకు సాగరతీరంలో హైక్లాస్‌ సందడి

అందనంత ఎత్తులో టిక్కెట్ల ధరలు

రూ.14,500 నుంచి 2.5 లక్షల వరకు..

విదేశాల నుంచి రానున్న10 కేబిన్‌ బోట్లు

రూ.3 కోట్లు వెచ్చించనున్నపర్యాటకశాఖ

ఉన్నోడికే పండుగ.. అని పెద్దలు ఉత్తనే అనలేదు. పండుగైనా, పబ్బమైనా చేతిలో కాసులు లేకపోతే పని జరగదు. ఆ సూత్రాన్నే మన పర్యాటక శాఖ పెద్దలు అందిపుచ్చుకున్నట్టు ఉంది. సాగరతీరంలో ఈ నెలాఖరులో జరగనున్న ‘ఓడల పండుగ’ (యాటింగ్‌ ఫెస్టివల్‌) అంతా సొమ్ములున్నోళ్ల సందడిగా సాగనుంది. విదేశాల నుంచి యాట్స్‌ (విలాసవంతమైన ఓ మోస్తరు ఓడలు) తెచ్చి విశాఖలో తొలిసారి నిర్వహించనున్న వేడుకలో పాల్గొనాలంటే చేతి చమురు గట్టిగానే వదలనుంది. ఓడెక్కాలంటే నిర్దేశించిన రేట్లు చూస్తే కాస్త క్యాష్‌ కలవారు కూడా వెనకడుగు వేయాల్సి వస్తోంది. ఇక సామాన్యులు దూరం నుంచి ఓడలు చూసి ఓహో అనుకునే సదుపాయాన్ని మాత్రం పర్యాటక శాఖ ‘ఉచితంగా’ కల్పిస్తోంది.

సాక్షి, విశాఖపట్నం: పర్యాటక స్వర్గధామంగా పేరొందిన విశాఖ మరో పండగకు ఆతిథ్యమిస్తోంది. అయితే ఇది సామాన్య, మధ్య తరగతి వారికి కాదండోయ్‌.. కేవలం ధనవంతుల కోసమే! వారిని విదేశీ బోట్లలో సువిశాల సాగరంలో షికారు చేయించడానికి పర్యాటకశాఖ సన్నద్ధమవుతోంది. దానికి యాటింగ్‌ ఫెస్టివల్‌ అనే పేరు పెట్టింది. ఈ నెల 28 నుంచి 31 వరకు దేశంలోనే తొలిసారిగా విశాఖ సాగరతీరంలో ఈ ఫెస్టివల్‌ జరపనుంది. విమానాల్లో విహరించే ధరలకంటే ఈ యాటింగ్‌ బోట్లలో షికారు చేసేందుకు వసూలు చేసే టిక్కెట్ల ధరలే అధికం కావడం ఈ ఫెస్టివల్‌ విశేషం!

ఇప్పటిదాకా రాష్ట్రంలో సరస్సులు, నదుల్లో సాధారణ బోట్లలో పర్యాటకులు, సందర్శకులను తీసుకెళ్లి తీసుకొస్తున్నారు. సరికొత్తగా విశాఖలో పర్యాటకాభివృద్ధి లక్ష్యంగా దేశ, విదేశీ పర్యాటకులను మరింతగా ఆకట్టుకోవడానికి ప్రభుత్వం ఈ యాటింగ్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. ఈ యాటింగ్‌ ఫెస్టివల్‌ నిర్వహణ బాధ్యతను ఈ–ఫ్యాక్టర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు అప్పగించింది. ఈ ఫెస్టివల్‌కు ప్రభుత్వం రూ.3 కోట్లు వెచ్చించనుంది. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌కు ఆనుకుని ఉన్న ప్రత్యేక జెట్టీని ఫెస్టివల్‌కు వేదికగా నిర్ణయించారు. ఇందుకోసం థాయ్‌లాండ్, సింగపూర్, మలేసియా దేశాల నుంచి కేబిన్‌లు కలిగిన 10 ప్రత్యేక యాటింగ్‌ బోట్లను తీసుకొస్తున్నారు. వీటిలో ఒక కేబిన్, రెండు కేబిన్‌లున్న బోట్లు కూడా ఉంటాయి. ఒక కేబిన్‌ బోటులో 20 సీట్లు, రెండు కేబిన్‌ల బోటులో 20 నుంచి 30 సీట్లు ఉంటాయి. రోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు.

చార్టర్డ్‌ బోటు కూడా..
ఇక కుటుంబ సభ్యులు, స్నేహితులు, కార్పొరేట్‌ సంస్థల వారు ప్రత్యేకంగా ఒక చార్టర్డ్‌ యాటింగ్‌ బోటును తీసుకోవచ్చు. 20 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఈ బోటు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ బోట్‌ను ఒక రోజు బుక్‌ చేసుకోవడానికి రూ.2.5 లక్షలు వసూలు చేస్తారు. వీరికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి విందు వంటివి అందజేస్తారు.

ఎక్కడెక్కడకు తీసుకెళ్తారు..?
రెండేళ్ల క్రితం విశాఖలో అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌) జరిగిన సమయంలో ఫిషింగ్‌ హార్బర్‌కు ఆనుకుని పాసింజర్‌ జెట్టీని నిర్మించారు. ఇప్పుడు ఈ యాట్‌ ఫెస్టివల్‌కు కూడా దానినే వేదికగా చేశారు. బోట్లు అక్కడి నుంచి రాకపోకలు సాగిస్తాయి. తొట్లకొండ, యారాడ, భీమిలి, రుషికొండ (ప్రతిపాదిత విమాన వాహక యుద్ధనౌక మ్యూజియం ప్రాంతం), కైలాసగిరిలకు రోజుకొక ప్రాంతానికి ఈ పర్యాటకులను తీసుకెళ్తారు. అక్కడ స్టార్‌ హోటల్‌ స్థాయిలో మధ్యాహ్న భోజనం అందజేస్తారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం రాత్రికి వేదిక వద్దకు తీసుకొస్తారు. ఈ యాటింగ్‌ బోట్ల వెంట గజ ఈతగాళ్లతో కూడిన నేవీ, విశాఖ పోర్టు పడవలు తోడుగా వెళ్తాయి.

ఇంకా ఏం చేస్తారంటే?
ఈ ఫెస్టివల్‌లో ఆసక్తి ఉన్న వారి కోసం స్నార్కెలింగ్‌ (సముద్ర అడుగున డైవింగ్‌ తరహా విన్యాసం), ట్రజర్‌ హంట్, సర్కులర్‌ సీ స్విమ్మింగ్‌ (డాల్ఫిన్‌ నోస్‌ వద్ద), సెయిలింగ్‌ పోటీలు వంటివి కూడా నిర్వహించనున్నారు. రాత్రి వేళ తీరంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు.

వెయ్యి మందికే అవకాశం!
తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ యాటింగ్‌ ఫెస్టివల్‌కు వెయ్యి మంది వరకు పర్యాటకులకు అవకాశం కల్పించనున్నారు. ఆయా బోట్లలో రోజుకు 300–350 మంది షికారు చేసేలా ఏర్పాట్లు చేశారు.

పాపికొండల్లో అలా..యాటింగ్‌ ఫెస్టివల్‌లో ఇలా..
రాజమండ్రి నుంచి పాపికొండలు పర్యటనకు గోదావరి నదిలో బోటు (ఏసీ)లో వెళ్లి రావడానికి ఒకరికి ఒకరోజు ప్యాకేజీ గరిష్టంగా రూ.వెయ్యి, రెండ్రోజుల ప్యాకేజీకి రూ.2500 వసూలు చేస్తున్నారు. వీరికి బోటులోనే అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు సమకూరుస్తారు. మార్గమధ్యలో దేవాలయాల సందర్శనకు తీసుకెళ్తారు. దీనిని బట్టి చూస్తే యాటింగ్‌ ఫెస్టివల్‌ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది.

నిధులు చారిటీకే..
యాటింగ్‌ ఫెస్టివల్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని చారిటీకే వినియోగించాలని నిర్ణయించారు. ఫెస్టివల్‌ నిర్వహించే ఈ–ఫ్యాక్టర్‌ సంస్థకు ఇవ్వబోమని పర్యాటకశాఖ అధికారులు చెబుతున్నారు.


పర్యాటకాభివృద్ధికే..
యాటింగ్‌ ఫెస్టివల్‌ ద్వారా విశాఖలో పర్యాటకరంగం మరింత అభివృద్ధి చెందనుంది. ఫెస్టివల్‌ నిర్వహణ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో విశాఖ ఖ్యాతి మళ్లీ ఇనుమడిస్తుంది. స్పందన బాగుంది. ఇందులో పాల్గొనే వారికోసం రక్షణ, భద్రత పరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
– డి.శ్రీనివాసన్, రీజనల్‌ డైరెక్టర్, ఏపీటీడీసీ

రేట్లు.. హడలు
యాటింగ్‌ బోటులో ఒక రోజు షికారు చేయడానికి ఒక్కొక్కరికి రూ.14,500, ఒక జంట విహారానికి రూ.27,500, నాలుగు రోజులకు రూ.47,500, చార్టర్‌ యాట్‌ పేరుతో ఒక రోజు పడవలో పర్యటించడానికి రూ.2.50 లక్షలు చొప్పున ధరలు నిర్ణయించారు.  అంతేకాదు.. ఒక పడవను నాలుగు రోజులు పాటు ప్రచారానికి వినియోగించు కోవాలంటే రూ.17.5 లక్షలు వసూలు చేయనున్నారు. దీంతో సామాన్యులు ఈ యాటింగ్‌ ఫెస్టివల్‌ దరికి చేరే అవకాశం కూడా లేదు. దీనిని విశాఖ ఆర్కే బీచ్‌ నుంచి వీక్షించే అవకాశం కల్పిస్తామని పర్యాటకశాఖ అధికారులు చెబుతున్నారు. తొలిరోజు ఆర్కే బీచ్‌ నుంచి గౌరవ వందనం స్వీకరించే కార్యక్రమం ఉంటుంది. మరోవైపు టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సదుపాయం కల్పించారు.

మరిన్ని వార్తలు