‘దేశం’ నేతలు దోచుకుతింటున్నారు...

22 Jul, 2018 08:33 IST|Sakshi

పంచభూతాలనూ వదలడం లేదు.. 

బూత్‌ కమిటీలు సైనికుల్లా పని చేయాలి

టీడీపీ అవినీతిపై గ్రామాల్లో చర్చ జరపాలి

నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

పార్లమెంటులో నోరు విప్పని అశోక్‌గజపతిరాజు

24న రాష్ట్ర బంద్‌ 

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర నాయకుడు బొత్స  

చీపురుపల్లి: తెలుగుదేశం నాయకులు గాలి, నీరు, భూమి ఇలా పంచభూతాలనూ వదలడం లేదని వారి అవినీతిపై ప్రజలకు వివరించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. పట్టణంలోని రాధామాధవ ఫంక్షన్‌ హాలులో గరివిడి మండల బూత్‌ కమిటీల కన్వీనర్లు, సభ్యులకు శిక్షణా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.  కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ బూత్‌ కమిటీ కన్వీనర్లు, సభ్యులు క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. గ్రామ స్థాయిలో టిడీపీ నేతలు చేపడుతున్న అవినీతిపై ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.

 వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న నవరత్నాలపై ప్రతీ ఇంటికి వెళ్లి వివరించాలన్నారు.  ఈ రోజు నుంచే ఎన్నికలు అనుకుని పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. బూత్‌ కమిటీ పరిధిలో ఉండే ప్రజలు వారికి ఏ అవసరం వచ్చినా, కష్టమొచ్చినా మీకే చెప్పే విధంగా ఉండాలన్నారు. పార్లమెంటు సాక్షిగా మరోసారి టీడీపీ, బీజేపీలు రాష్ట్రాన్ని మోసం చేసాయని విమర్శించారు. రాష్ట్రం కోసం పార్లమెంటులో గందరగోళం జరుగుతున్నా మన జిల్లా ఎంపీ అశోక్‌గజపతిరాజు కనీసం నోరు మెదపలేదని దుయ్యబట్టారు.

 మూడున్నర సంవత్సరాలు కేంద్ర కేబినేట్‌లో ఉండి కూడా నోరు విప్పకపోవడం దారుణమన్నారు. అశోక్‌గజపతిరాజుకు జిల్లాలో భాష తెలియకపోయినా ఢిల్లీ భాష తెలిసినప్పటికీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రైల్వేజోన్‌ కోసమో, మొండెంఖల్‌ ప్యాకేజీ, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ఇలా ఎన్నో అంశాలు ఉన్నప్పటికీ ఏ ఒక్కదాని కోసం అడగకపోవడం దారుణమన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టులో చంద్రబాబునాయుడు, అశోక్‌గజపతిరాజు అనే ఇద్దరు దొంగలు పడ్డారని అందుకే దాని పరిస్థితి అలా తయారైందని దుయ్యబట్టారు. 

24న రాష్ట్ర బంద్‌ 
పార్లమెంట్‌లో శుక్రవారం జరిగిన తీరుకు నిరసనగా, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 24న రాష్ట్ర బంద్‌కు పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపిచ్చారని బొత్స సత్యనారాయణ తెలిపారు. టీడీపీ ఎంపీలకు చిత్తశుద్ది ఉంటే రాజీనామాలు చేసి తమ ఎంపీలతో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు రావాలని సవాల్‌ విసిరారు. ఈ నెల 24న జరగనున్న రాష్ట్ర బంద్‌ ఏ ఒక్కరి కోసమో కాదని ప్రతీ వ్యక్తి కోసమని అందుకనే ప్రతీ ఒక్కరూ బంద్‌లో పాల్గొని నిరసన తెలిపాలని కోరారు. 

కార్యక్రమంలో జిల్లా పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ కుళ్లు, కుతంత్రాలతో కూడుకున్న తెలుగుదేశం పార్టీని రాబోయే ఎన్నికల్లో తిప్పికొట్టాలన్నారు. అందుకోసం క్షేత్ర స్థాయిలో బూత్‌ కమిటీలు కష్టపడి పని చేయాలని సూచించారు. అన్ని గ్రామాలకు సంబంధించి ఓటర్లు ఎక్కడున్నా ఎమ్మెల్యే, ఎంపీలకు జరిగే ఎన్నికల్లో ఓట్లు వేసే విధంగా చూడాలన్నారు. టీడీపీ చేస్తున్న అవినీతిపై గ్రామాల్లో టీ దుకాణాలు, పాన్‌ షాపుల వద్ద చర్చలు నిర్వహించాలని సూచించారు.  2019 ఎన్నికల్లో గెలుపు తప్ప ప్రత్యామ్నాయం లేదని తెలుసుకోవాలన్నారు.  నవరత్నాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించి ఓటు అడగాలని సూచించారు.  కార్యక్రమంలో విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ మాట్లాడుతూ బూత్‌ కమిటీలపై ప్రత్యేక బాధ్యత ఉందన్నారు. 

ఆ బాధ్యతను శ్రమించి నెరవేర్చాలన్నారు. బూత్‌ కమిటీలు కష్టపడి పని చేస్తే రాబోయే ప్రభుత్వంలో చక్కని గుర్తింపు లభిస్తుందని చెప్పారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తే బూత్‌ కమిటీలకు ఎంతో గుర్తింపు ఉంటుందని తెలిపారు.  ఎస్‌.కోట నియోజకవర్గ ఇన్‌చార్జి అల్లు జోగినాయుడు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శులు అంబల్ల శ్రీరాములు, కెవి.సూర్యనారాయణరాజు, నారాయణమూర్తిరాజు, గరివిడి మండల పార్టీ అధ్యక్షుడు వాకాడ శ్రీనివాసరావు, మండల పార్టీ నాయకులు మీసాల విశ్వేశ్వరరావు, పొన్నాడ వెంకటరమణ, కొణిశ కృష్ణంనాయుడు, వాకాడ గోపి, వలిరెడ్డి లక్ష్మణ, లెంక శ్రీరాములు, యడ్ల అప్పారావు, గుడివాడ నీలకంఠం, యలకల రామునాయుడు, రాల్లపూడి గణపతి, బమ్మిడి అప్పలస్వామి, ముల్లు రాంబాబు, రామ్మూర్తినాయుడు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు