అన్న క్యాంటీన్‌ అవినీతిపై దర్యాప్తు

23 Aug, 2019 13:06 IST|Sakshi
జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న వైసీపీ నాయకుడు యడ్ల తాతాజీ

సాక్షి, పశ్చిమగోదావరి(ఏలూరు) : గత ప్రభుత్వ హయాంలో పేదలకు భోజనం పెట్టే పేరుతో అన్న క్యాంటీన్‌లను ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో దోచేశారని, జిల్లాలో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేయాలంటూ వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్‌ ప్రధాన కార్యదర్శి యడ్ల తాతాజీ జేసీ ఎం.వేణుగోపాలరెడ్డిని కోరారు. దీనిపై స్థానిక కలెక్టరేట్‌లో గురువారం ఆయన జేసీకి వినతిపత్రం అందజేశారు. టీడీపీ హయాంలో జిల్లాలో మొత్తం 16 అన్న క్యాంటీన్లను నిర్మించారన్నారు. వీటి కొరకు ప్రభుత్వం నుంచి రూ.36 లక్షలు, స్థానిక మున్సిపాలిటీల నుండి రూ.6 లక్షలు చొప్పున మొత్తం రూ.42 లక్షలు ఖర్చు చేశారన్నారు. ఎక్కడైనా ఒక బిల్డింగ్‌ కట్టాలంటే స్థలం కొని దాని నిర్మాణం చేస్తే స్థలం, నిర్మాణము కలిపి ఒక చదరపు అడుగుకి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకూ ఖర్చవుతుందన్నారు.

అయితే అన్న క్యాంటీన్‌లు కట్టడానికి స్థలాలు మున్సిపాలిటీ, ప్రభుత్వ స్థలాలు కావడం వల్ల నిర్మాణానికి ఒక చదరపు అడుక్కి రూ.1,500 చొప్పున మాత్రమే ఖర్చవుతుందన్నారు. అయితే గత పాలకులు ఒక చదరపు అడుక్కి రూ.5,532 చొప్పున వసూలు చేశారన్నారు. ఒక్కో అన్న క్యాంటీన్‌లో రూ.30 లక్షల వరకూ అవినీతి చోటు చేసుకుందని ఆయన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ లెక్కన జిల్లాలోని 16 అన్న క్యాంటీన్లలో సుమారు రూ.4.80 కోట్లు అవినీతి చోటు చేసుకుందని తెలిపారు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అవినీతిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహాన్‌రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. జిల్లాలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ నిర్వహించి ప్రజాధనాన్ని కాపాడాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చినమిల్లి గణపతిరావు, రేలంగి శ్రీనివాసరావు, కాపిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు