అన్నీ మంచి శకునాలే

22 Feb, 2018 09:55 IST|Sakshi

ప్రారంభమైన పెళ్లిళ్ల సీజన్‌

మే వరకు 23 ముహూర్తాలు

కల్యాణమండపాలకు, పురోహితులకు గిరాకీ

ఏడాదంతా శుభముహూర్తాలే!

అన్ని వర్గాలకు చేతినిండా పని  

చాలా అరుదైన శుభ ఏడాదంటున్న అర్చకులు

జిల్లాలో పెళ్లిసందడి మొదలైంది. పలకరించే పచ్చనిపందిళ్లు.. ఆహ్వానం పలుకుతున్న మామిడాకుల తోరణాలు...కళ్లు చెదిరే అలంకరణతోవేదిక...పట్టుపావళ్ల యువతులూ...జరీ చీరెల గలగలలూ....చిన్నారులతుళ్లింతలూ...రంగురంగుల విద్యుద్దీపకాంతులు..సన్నాయి మేళాలసుస్వరాలు...ఆత్మీయతల పరిమళాలు...అనుబంధాలకమ్మదనంతో కల్యాణ వేదిక కళకళలాడుతోంది.మూడుముళ్ల బంధంతో ఇద్దరు ఒక్కటయ్యే శుభవేళ,రెండు కుటుంబాల మధ్య అనుబంధాలు పెనవేసుకొనేఘట్టం. జీవితంలో మరుపురాని, మధురమైన జ్ఞాపకంకానున్న ఘడియలు. ఇక ఏడాదంతా శుభముహూర్తాలే.. తల్లిదండ్రులకు మంచి శకునాలే..

కడప కల్చరల్‌ : ఇక ముహూర్తాలకు కొదువ లేదు. నాలుగు నెలల మూడం తర్వాత శుభఘడియాలు మొదలయ్యాయి. బాజాభజంత్రీలు మొగుతున్నాయి. మూడేళ్ల సుదీర్ఘ సమయం తర్వాత ఆ కరువు తీరేలా సంవత్సరం పాటు వరుస ముహూర్తాలు వచ్చాయి. ఈ బుధవారం తొలి ముహూర్తంతో ప్రారంభమైన ముహూర్తాలు 2019 వరకు ప్రతినెలా వరుసగా ఉన్నాయి. ఎలాంటి తొందర, హడావుడి, గందరగోళం లేకుండా ముహూర్తాలు, జాతకాలు, జన్మ నక్షత్రాలు సరిచూసుకుని తీరిగ్గా పెళ్లిళ్లు చేసుకొనే మంచి అవకాశం చాలా ఏళ్ల తర్వాత వచ్చింది.

ముందుగానే బుకింగ్‌లు
ఈ ముహూర్తాలలో వివాహాల కోసం జిల్లాలోని 500కుపైగా గల చిన్న, పెద్ద కల్యాణ మండపాలను నవంబరులోనే బుక్‌ చేసుకున్నారు. పెళ్లి పత్రికల హడావుడి ఫిబ్రవరి మొదటివారం నుంచి మొదలైంది. పురోహితులకు డిమాండ్‌ ఏర్పడడంతో ముందే వారికి అడ్వాన్సులు ఇచ్చారు. డిమాండ్‌ను బట్టి ఒక్కో అర్చకునికి కనీసం రూ.వెయ్యి  ఇవ్వాల్సి వస్తోంది. స్థాయినిబట్టి ఒక్కొ పెళ్లికి ఇద్దరు నుంచి ఐదుగురు పురోహితులను మాట్లాడుకున్నారు. వచ్చే మార్చి వరకు అద్దె వాహనాలకు డిమాండ్‌ ఉంటుంది. పెట్రోలు, డీజల్‌ విక్రయాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

రూ. 200 కోట్ల పైమాటే..
ఈ సీజన్‌లో వివాహాల కోసం జిల్లా అంతటా రూ.150 నుంచి 200 కోట్ల వ్యాపారాలు జరిగే అవకాశం ఉంది. పెళ్లంటే పారిశుద్ధ్య కార్మికుల నుంచి పసిడి వ్యాపారుల వరకు దాదాపు 150 అనుబంధ రంగాల వ్యాపారాలు జరుగుతాయి. కడపలో 10 వేల నుంచి రూ. 2లక్షల అద్దెగల కల్యాణ మండపాలు 70దాకా ఉండగా, ప్రొద్దుటూరులో 50కి పైగాఉన్నాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 500కు పైగా ఉండగా మే వరకు రూ.7కోట్ల నుంచి రూ.10 కోట్ల ఖర్చయ్యే అవకాశం ఉంది. భోజనాలకు ప్లేటు ఒక్కింటికి కనీసం రూ.150 నుంచి రూ.300 ఖర్చుచేయాల్సి వస్తోంది. మే  వరకు జరగనున్న వివాహ భోజనాలకు రూ.2కోట్లకు పైగా ఖర్చు కానుండగా, మండపాల అలంకారాలకు రూ.10 వేల నుంచి రూ.3లక్షలు చొప్పున ఈ సీజన్‌లో రూ.3కోట్లు వెచ్చించాల్సి వస్తోంది.

వ్యాపారం...బంగారం..
మే వరకు జిల్లావ్యాప్తంగా 500కు పైగా వివాహాలు జరగనున్నాయి. ఎంత చిన్న వివాహామైనా అమ్మాయికి కనీసం 10తులాల నుంచి కిలో దాక బంగారం పెడతారు. ఈ లెక్కన ఈ సీజన్‌లో రూ.70 కోట్ల మేరకు బంగారం వ్యాపారం జరిగే అవకాశం ఉంది. పెళ్లి వస్త్రాల కోసం మధ్యతరగతి కుటుంబం దాదాపు లక్ష రూపాయలు, పెద్ద కుటుంబాలైతే రూ.3 లక్షలు  చొప్పున ఖర్చుచేస్తారు. దీంతో ఈ సీజన్‌లో రూ.6–10 కోట్ల మేరకు వస్త్ర వ్యాపారం జరిగే అవకాశం ఉంది. సంవత్సర కాలంగా నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావంతో గణనీయంగా తగ్గిన ఈ రంగాల వ్యాపారాలు ఈ ముహూర్తాల కారణంగా లాభాలు చూసే అవకాశం ఉంది.

అందరికీ శుభమే..
ఇవిగాక బస్సులు, రైళ్లు, ప్రైవేటు వాహనాలు, శుభలేఖలు, కిరణా సరుకులు, కూరగాయల వ్యాపారాలు ఈ సంవత్సరమంతా బాగా జరగనున్నాయి. ఈ వేడుకల్లో ఒక్కొ వివాహానికి ఫొటోలు, వీడియోలకు రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చవుతుంది. డ్రోన్‌ లాంటి పరికరాలతో కొత్తరకం షూటవుట్‌లకు బాగా ఖర్చు చేయనున్నారు. పూలు, కొబ్బరికాయల వ్యాపారాలు పెరిగి రైతు, వ్యాపారులతోపాటు ఆయా రంగాల శ్రామికులకు కూడా సంవత్సరంపాటు డబ్బు అందే అవకాశం లభిస్తుంది. అటు ప్రభుత్వ రవాణా రంగాలు, పెట్రోలు, డీజల్‌ వ్యాపారాలు నష్టాల నుంచి కోలుకొని లాభాలు పొందే అవకాశం ఉంది. మొత్తంపై దాదాపు సంవత్సరంపాటు గల ఈ ముహూర్తాలు, పెళ్లిళ్లు ఆయా కుటుంబాలకే కాకుండా పలు ఇతర రంగాల ప్రజలకు కూడా ఆనందాన్ని కలిగించనుండడం విశేషం.

కల్యాణదాయకం..శుభం
ఇలా దాదాపు సంవత్సరం పాటు వరుసగా ముహూర్తాలు ఉండడం అరుదైన విషయం. అందరికీ సంతోషదాయకం. అన్నిరంగాల వారికి పెళ్లిళ్ల సమయంలో పని లభిస్తుంది. ఈ ముహూర్తాలన్నీ మంచివే కావడంతో తొందర లేకుండా పెళ్లిళ్లు చేసుకోవచ్చు.    – చక్రవర్తుల నాగాంజనేయశర్మ, వేద పండితులు, కడప

కోలుకునే అవకాశం
నోట్లరద్దు, జీఎస్టీతోపాటు ముహూర్తాలు లేకపోవడంతో సంవత్సర కాలంగా పనిలేక నష్టాలకు గురవుతున్నాం. ఈ వరుస ముహూర్తాలతో వ్యాపారాలు పుంజుకోగలవన్న ఆశ ఉంది.
– ఎలిశెట్టి శివకుమార్, డెకరేషన్, కేటరింగ్‌ కాంట్రాక్టర్‌

నెలవారీగా ముహూర్తాలు
ఫిబ్రవరి:  24, 25
మార్చి:  1, 3, 4, 8, 10, 23, 29, 30
ఏప్రిల్‌:  1, 5, 11, 12, 20, 22, 25, 28, 29
మే:  2, 6, 10
మే 16 నుంచి జూన్‌ 13 వరకు నిజ జేష్ఠమాసం, అధిక జేష్ఠమాసం ఉండడంతో ఈ సమయంలో వివాహాలు చేసుకోరు. ఆ తర్వాత 2019 మార్చి వరకు ముహూర్తాలకు కొదవ లేదు.

మరిన్ని వార్తలు