ఏడాదిగా ఎదురుచూపు

1 Nov, 2014 01:41 IST|Sakshi
ఏడాదిగా ఎదురుచూపు

కర్నూలు(అర్బన్):
 ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ల నుంచి వివిధ రుణాల కోసం లబ్ధిదారులు ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. వెరిఫికేషన్, ఎన్నికలు, కొత్త ప్రభుత్వం తదితర కారణాలతో కాలయూపన జరగుతోంది.

 జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో 5366 మంది లబ్ధిదారులకు రూ.34.34 కోట్ల మేరకు రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. 2027 మందికి రూ.20.82 కోట్లు సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరయ్యాయి. అయితే గత ఏడాది ఆగస్టు నుంచి రాష్ట్రంలో సమైక్యాంధ్ర  ఉద్యమం, ఎన్నికలు రావడంతో ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల నుంచి రుణాలు అందించని పరిస్థితి ఏర్పడింది.   

 జీవో నంబర్ 101తో మొదలైన కాలయూపన..
 అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 2013 డిసెంబర్ 31వ తేదీన జీవో నంబర్ 101ను జారీ చేశారు. ఈ మేరకు 45 సంవత్సరాల లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీలు మాత్రమే రుణాలు పొందేందుకు అర్హులు. దీంతో వందల సంఖ్యలో దరఖాస్తులు బుట్టదాఖాలయ్యాయి. వయస్సు నిర్ధారణకు సంబంధించి ఆయా కార్పొరేషన్లకు అందిన దరఖాస్తులన్నీ తిరిగి మండలాలు, మున్సిపల్ కార్యాలయూలకు తిప్పి పంపారు.

ఆయా కార్యాలయాల్లో దరఖాస్తులను వడపోసి తిరిగి కార్పొరేషన్లకు పంపడంలో కొంత మేర జాప్యం జరిగింది. వయసు నిర్ధారణ తర్వాత రూపొందించిన జాబితాలను కలెక్టర్ అనుమతి కోసం పంపారు. కలెక్టర్ అనుమతి లభించిన అనంతరం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మళ్లీ అవి పెండింగ్‌లో పడ్డారుు.

 నేతల పెత్తనం..
 ఎన్నికలు అయిపోయి రాష్ట్రంలో కొత్తగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కలెక్టర్ అప్రూవల్ చేసిన దరఖాస్తులను గ్రామీణ, మున్సిపల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫించన్ కమిటీలు స్క్రూట్నీ చేయూలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 535ను జారీచేసింది. ఆ మేరకు ఎస్సీ, ఎస్సీ కార్పొరేషన్లలోని దరఖాస్తులను తిరిగి పింఛన్‌ల కమిటీ పరిశీలనకు పంపుతారు.

ఈ గ్రామ కమిటీల్లో సర్పంచు, ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శి, ఇద్దరు స్వయం సహాయక సంఘాల లీడర్లు, ఇద్దరు సామాజిక కార్యకర్తలు ఉంటారు. మున్సిపల్ ప్రాంతాల్లో కార్పొరేటర్, ఇద్దరు స్వయం సహాయక సంఘాల లీడర్లు, ముగ్గురు సామాజిక కార్యకర్తలు, ఒక బిల్ కలెక్టర్ సభ్యులుగా ఉంటారు. వీరు విచారించి సిఫారసు చేసిన దరఖాస్తులను ఉన్నతాధికారి కార్యాలయానికి అప్‌లోడ్ చేయనున్నారు. ఇక్కడే వారు రాజకీయం చేస్తున్నారు. తమ వారి దరఖాస్తులను మాత్రమే సిఫార్సు చేస్తున్నారు.

అర్హులైనా చాలామంది దరఖాస్తులను పక్కన పడేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2027 దరఖాస్తులను ఆయా కార్యాలయాలకు పంపగా 676 దరఖాస్తులను మాత్రమే సిఫారసు చేశారు. ఎస్‌టీ కార్పొరేషన్ కూడా 527 దరఖాస్తులను ఆయా కార్యాలయాలకు విచారణకు పంపేందుకు చర్యలు చేపట్టింది.

>
మరిన్ని వార్తలు