ఏలేరు.. కానరాని జోరు!

7 Nov, 2015 02:47 IST|Sakshi

 ఆధునికీకరణపై ప్రభుత్వం నాన్చుడు ధోరణి
 వైఎస్ హయాంలో శంకుస్థాపన
 మొదటి విడతగా రూ.138 కోట్ల కేటాయింపు
 ఆయన మరణానంతరం నిధులివ్వని సీఎంలు
 మొక్కుబడిగా తొలిదశ పనులు
 {పతిపాదనలకే పరిమితమైన రెండో దశ

 
 జగ్గంపేట : జిల్లాలోని మెట్టప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడంలో కీలక భూమిక పోషిస్తున్న ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణలో ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. 24 టీఎంసీల సామర్థ్యమున్న ఏలేరు జలాశయం కింద ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం నియోజకర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో 67 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నుంచి శివారు ఆయకట్టుకు సక్రమంగా నీరందడం లేదు. దీంతో నీటి ఎద్దడి సమయంలో శివారు రైతులు నష్టపోతున్నారు. ఇదే సమయంలో వరదలు వచ్చినప్పుడు ముంపు బారిన పడి నష్టం చవిచూస్తున్నారు. వాస్తవానికి ఏలేరు కింద ప్రస్తుతం 53 వేల ఎకరాలే సాగవుతోంది. వీరవరం, వేలంక, సింహద్రిపురం, జగపతినగరం తదితర గ్రామాల్లో శివారు ప్రాంతాలకు నీరందడం లేదు. దీంతో శివారు ఆయకట్టు రైతులు బోర్లపై ఆధారపడుతున్నారు. పూడుకుపోయిన కాలువలు, ఎత్తుపల్లాలు, దెబ్బతిన్న స్లూయిజ్‌లు, బెడ్ రెగ్యులేటర్లవంటివాటితో ఏలేరు నీటిపారుదల వ్యవస్థ దెబ్బ తింది. దీంతో ఆధునికీకరణ అంశం తెరపైకి వచ్చింది.
 
 ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి ఈ ప్రాంత రైతులు ఏలేరు ఆధునికీకరణ అంశాన్ని తీసుకువచ్చారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత ఏలేరు ఆధునికీరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. 2009 ఫిబ్రవరిలో ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద రూ.138 కోట్లతో ఏలేరు ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన రెండోసారి అధికారంలోకి రావడంతో ఏలేరు పనులు పూర్తవుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
 
 అయితే ఆయన హఠాన్మరణం చెందడంతో.. తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఏలేరు ఆధునికీకరణకు నిధుల విడుదలలో జాప్యం చేస్తువచ్చారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, పెండెం దొరబాబు, తోట సుబ్బారావునాయుడు, చలమలశెట్టి సునీల్ తదితరులు ఏలేశ్వరం నుంచి పిఠాపురం వరకూ పాదయాత్ర చేయడంతో నిధులు మంజూరయ్యాయి. వైఎస్ ఇచ్చిన జీఓ ప్రకారం రూ.138 కోట్లు కేటాయించగా.. వీటిలో ప్రాజెక్టు హెడ్‌వర్‌‌క్సకు రూ.7 కోట్లు, తిమ్మరాజుచెరువుకు రూ.3 కోట్లు కేటాయించారు. మిగిలిన రూ.127.54 కోట్లలో భూసేకరణకు సుమారు రూ.20 కోట్లు, వ్యాట్, సెస్‌వంటివాటికి రూ.10 కోట్లు పోను మిగిలిన రూ.97 కోట్లతో తొలి దశ పనులు చేపట్టాల్సి ఉంది. తొలిదశ కాంట్రాక్టును హైదరాబాద్‌కు చెందిన గాయత్రీ ప్రాజెక్టు సంస్థ పొందింది.
 
 తొలిదశ ప్రతిపాదిత పనులివే..
 తొలిదశలో ఏలేరు ఇరిగేషన్ కాలువకు 16 బెడ్ రెగ్యులేటర్ల నిర్మాణం, డబ్బకాల్వ, యర్రకాల్వ, గొర్రిఖండి, వీరవరం కాల్వలు వెడల్పు చేసి ఆధునికీకరించడం చేపట్టాల్సి ఉంది. ఇందుకు 182 ఎకరాల భూము లు సేకరించాలి. ఈ ప్రతిపాదనలను ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే కలెక్టర్‌కు పంపారు. భూసేకరణ పూర్తయితేనే పనులు జరుగుతాయి. అలాగే ఎస్.తిమ్మాపురం వద్ద బెడ్ రెగ్యులేటర్ నిర్మించాల్సి ఉంది. దివిలివద్ద బెడ్ రెగ్యులేటర్ పనులు మాత్రం మొక్కుబడిగా చేపట్టారు.
 
 రెండో దశలో రూ.167 కోట్లతో ప్రతిపాదనలు
 ఏలేరు రెండో విడత ఆధునికీకరణకు ఇరిగేషన్ అధికారులు రూ.167 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. సుమారు 75 వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలో కలిసేలా ఎస్.తిమ్మాపురంవద్ద బెడ్ రెగ్యులేటర్ నుంచి గొర్రిఖండి, సుద్దగెడ్డ మీదుగా యు.కొత్తపల్లి వరకూ ఒకవైపు, కాండ్రకోటవైపు దబ్బ కాలువ, నగరం ఖండిల మీదుగా రెండోవైపు కాలువలను ఆధునికీకరించాలని నిర్ణయించారు.
 ప్రాజెక్టు కమిటీకి సవాల్‌గా మారిన ఆధునికీకరణ
 ఏలేరుకు తొలిసారిగా ప్రాజెక్టు కమిటీని నియమించారు. దానిముందు ఆధునికీకరణ అంశం సవాల్‌గా ఉంది. సర్కారు నాన్చుడు ధోరణి నేపథ్యంలో ఈ కమిటీ ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే. ప్రాజెక్టులో రబీకి సరిపడే నీరు లేనందున పనులు చేపట్టే ఆలోచనలో ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. అయితే రబీకి నీరవ్వకపోతే నష్టపోతామని రైతులు అంటున్నారు. దీనిపై కమిటీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
 

మరిన్ని వార్తలు