ఎట్లస్తరో చూస్తం

30 Dec, 2013 04:32 IST|Sakshi

గోదావరిఖని/రామగుండంరూరల్, న్యూస్‌లైన్: తలాపునే గోదావరినది పారుతున్నా రామగుండం నియోజకవర్గ ప్రజలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి తాగు, సాగునీరు ఎందుకివ్వరని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్, ఉపనేత టి.హరీష్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చకుండా ఎల్లంపల్లి ప్రాజెక్టును సీఎం ఎలా ప్రారంభిస్తారో చూస్తామని సవాల్ చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా రామగుండం మండల ప్రజలకు తాగు, సాగునీటిని అందించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రాజెక్టు వద్ద టీఆర్‌ఎస్ మహాధర్నా నిర్వహించింది.
 
 ముఖ్య అతిథిగా హాజరైన ఈటెల రాజేందర్, హరీష్‌రావు మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణానది పారుతున్నా ఆ జిల్లాకు నీరందించకపోవడం వల్ల ప్రజలు బతుకుదెరువు లేక వలసపోతున్నారని అన్నారు. నల్లగొండ జిల్లాకు నీటిని కేటాయించకపోవడంతో ఫ్లోరైడ్ సమస్యతో బతుకులు ఆగమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రామగుండం మండలంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించి ఈ ప్రాంత ప్రజలకు తాగు, సాగునీరు ఇవ్వకుండా దగా చేస్తున్నారని ధ్వజమెత్తారు. రామగుండంప్రాంతంలోని బొగ్గుగనులు, నీటివనరులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఇంధనంగా నడిపిస్తున్నా.. ఇక్కడి ప్రజలనే ఇబ్బందులకు గురిచేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు.
 
 ప్రాజెక్టు నిర్మాణానికి భూములు జాగలు త్యాగం చేసిన నిర్వాసితులకే జలవనరులపై పూర్తి హక్కులుంటాయనే విషయాన్ని మరువరాదన్నారు. సీపీడబ్ల్యూ పథకంలో నిధుల కేటాయింపునకు సంబంధించిన డిజైన్ (ఫీజుబిలిటీ రిపోర్టు) రూపొందించి ప్రభుత్వానికి ఖర్చు తగ్గించే పని చేసినప్పటికీ దానిని మంత్రి శ్రీధర్‌బాబు పరిగణనలోకి తీసుకోకపోవడం దారుణమన్నారు. అధికారం శాశ్వతం కాదని, మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, అభివృద్దిని అడ్డుకుంటే రామగుండం నియోజకవర్గ ప్రజల దృష్టిలో మంత్రి శాశ్వతంగా శత్రువుగా మారుతారని, అనవసరంగా అధికారులపై ఒత్తిడి తేవద్దని వారు సూచించారు.
 
 ఇప్పటికే సింగూరు జలాలను మెదక్‌కు కాకుండా హైదరాబాద్ మీదుగా ఆంధ్రకు తరలించుకు పోయారని, ప్రస్తుతం ఎల్లంపల్లి జలాలను రూ.4,500 కోట్లతో సుజల స్రవంతి పేరుతో హైదరాబాద్‌కు తరలించుకుపోయేందుకు యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ ప్రాంత ప్రజల గోడు పట్టించుకోకుండా నీటిని తరలిస్తామంటే ఊరుకునేది లేదన్నారు. పెద్దపల్లి జి.వివేక్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునే కుట్రలో భాగంగా సీమాంధ్ర మంత్రులు రూ.165 వేల కోట్ల ప్రాజెక్టులు మంజూరు చేయించుకున్నట్లు జీఓఎంలో ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో జిల్లాలోని ఆరు గ్రామాలు పూర్తిగా ముంపునకు గురికాగా అందులో ఏడు వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉందన్నారు. రూ.63 కోట్లతో 20వేల ఎకరాలకు సాగునీరు, రూ.10లక్షలతో ఎల్కలపల్లిలో వాల్వ్ ద్వారా మరో 3వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. పాక్షికంగా ముంపునకు గురయ్యే కుక్కలగూడూర్‌ను కూడా ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
 
 కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్ మీదుగా బొట్టు నీటిని హైదరాబాద్‌కు పోనివ్వమని, పైపులు పగులకొట్టి మానేరు డ్యాం నింపుకుంటామని అన్నారు. రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ మహాధర్నాలో సిర్పూర్(టి) ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, పాతూరి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, పార్టీ నేతలు కోరుకంటి చందర్, బుడిగె శోభ, మాడ నారాయణరెడ్డి, గుంపుల ఓదెలు, సోమారపు అరుణ్‌కుమార్, దీటి బాలరాజు, పెద్దంపేట శంకర్‌తోపాటు వివిధ గ్రామాల ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మహాధర్నా కొనసాగింది.
 

మరిన్ని వార్తలు