ఎల్లో మాయ.. అదో ఫూల్స్‌ ప్యారడైజ్‌

9 Nov, 2017 00:52 IST|Sakshi

     పాదయాత్ర ఆరంభంనాడే ఎల్లో కథనాల విజృంభణ

     ప్యారడైజ్‌ పత్రాలంటూ పతాక శీర్షికల్లో వై.ఎస్‌. జగన్‌ ఫొటో

     నిజానికి ఆ పత్రాల్లో ఉన్నది హెటెరో డ్రగ్స్‌ అనుబంధ సంస్థ

     అది చట్టబద్ధ సంస్థేనని, యూరప్‌ కార్యకలాపాల కోసమని చెప్పిన హెటెరో

     ‘సాక్షి’లో హెటెరో పెట్టుబడులున్నాయి కనక... అది జగన్‌ కేసు అట

     కేసును ప్రస్తావిస్తూ జగన్‌ ఫొటో వేసి విషం ఫొక్కిన ఎల్లో మీడియా

(సాక్షి  ప్రత్యేక ప్రతినిధి): నిజం! ఎల్లో మీడియాకిది అలవాటే!!. వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల మధ్యలోకి వెళ్లే కార్యక్రమం ఏదైనా ఆరంభిస్తే... దానికొచ్చే జన స్పందనకు భయపడో లేక జనం దృష్టిని దాన్నుంచి మళ్లించటానికో.. కారణం ఏదైతేనేం..!! ఎల్లో మీడియా ఆ రోజు జగన్‌కు వ్యతిరేకంగా పతాక శీర్షికల్లో ఏదో ఒక కథనాన్ని వండి వారుస్తుంది. తాజాగా ప్యారడైజ్‌ పేపర్స్‌ లీకులంటూ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటో ప్రచురించిన తీరు కూడా ఇలాంటిదే. కావాలంటే మీరే చూడండి...

ప్యారడైజ్‌ పత్రాలుగా పిలుస్తున్న బెర్ముడా పత్రాల్లో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి  పేరు ఎక్కడా ప్రస్తావనే లేదు. ఆయన పేరుగానీ, ఆయనకు సంబంధించిన కంపెనీల పేరు గానీ బెర్ముడా పత్రాల్లో అణుమాత్రమైనా లేదు. మరి ఆయన పేరు, ఫొటోను ఎల్లో మీడియా సహా కొన్ని పత్రికలు, చానళ్లు ఎందుకు ప్రసారం చేస్తున్నాయి?

నిజానికి ఈ పత్రాల్లో తెలుగు రాష్ట్రాలకు  చెందిన హెటెరో గ్రూపు ప్రమోటర్ల పేర్లున్నాయి. హెటెరో డ్రగ్స్‌ సంస్థ ‘హెటెరో మాల్టా’ పేరిట అక్కడో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. దాన్లో డైరెక్టర్లుగా హెటెరో ప్రమోటర్లు ఎ.నరసారెడ్డి, బి.పార్థసారథి రెడ్డి పేర్లున్నాయి. దీనిపై వారిద్దరూ వివరణ కూడా ఇచ్చారు. ఆ కంపెనీ ఉన్న మాట నిజమేనని, అది తమ వ్యక్తిగతం కాదని, హెటెరోకు అనుబంధ సంస్థ అని, యూరప్‌ కార్యకలాపాల కోసం ఆ కంపెనీని తమ సంస్థే ఏర్పాటు చేసిందని, ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌తో సహా వివిధ రెగ్యులేటరీ సంస్థలకు తెలియజేస్తూనే ఉన్నామని స్పష్టం చేసింది. ఈ వివరణను కూడా ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ పత్రిక ప్రచురించింది. అంటే! దీన్లో ఎలాంటి అక్రమాలకూ తావులేదనే అనుకోవాలి. పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ సైతం తన విదేశీ కంపెనీలకు సంబంధించి సమస్త సమాచారాన్నీ దర్యాప్తు, నియంత్రణ సంస్థలకు అందజేసినట్లు గతంలోనే చెప్పారు.

మరి జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోను ఎందుకు ప్రచురించినట్లు?
ప్యారడైజ్‌ పత్రాల్ని ఐసీఐజే బయటపెట్టింది. ఐసీఐజేకు ఇండియాలో భాగస్వామి అయిన ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ పత్రిక ఈ వివరాలను ప్రచురించింది. వివిధ కేసులతో సంబంధం ఉన్న సంస్థలు, వ్యక్తుల పేర్లు ఈ రికార్డుల్లో ఉన్నాయని పేర్కొంటూ.... సన్‌ టీవీ– మ్యాక్సిస్‌ కేసు; ఎస్సార్‌ –లూప్‌ 2జీ కేసు; ఎస్‌ఎన్‌సీ – లావాలిన్‌ కేసు (ఈ కేసులో కేరళ సీఎం విజయన్‌ పేరుంది కానీ తరవాత క్లీన్‌చిట్‌ ఇచ్చారు); రాజస్తాన్‌ అంబులెన్స్‌ స్కామ్‌ (ఈ స్కామును ఇటీవలే సీబీఐకి అప్పగించారు. దీన్లో జిక్విస్టా హెల్త్‌కేర్‌ అనే కంపెనీ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ కంపెనీలో తొలినాళ్లలో సచిన్‌ పైలట్, కార్తీ చిదంబరం ఇండిపెండెంట్‌ డైరెక్టర్లుగా ఉన్నారు); వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ దాఖలు చేసిన కేసు..’’ అంటూ కేసుల్ని ఉదహరించింది. అదీ జగన్‌ పేరు ప్రస్తావనకు వచ్చిన తీరు. 

ఇప్పటికైనా అర్థమయిందా?
అసలు జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ కేసు... అంటే ఏంటి? అది ‘సాక్షి మీడియా’లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారం. ‘సాక్షి’లో ఇండియా సిమెంట్స్, అరబిందో ఫార్మా, రాంకీ వంటి లిస్టెడ్‌ సంస్థలే కాక... హెటెరో వంటి అన్‌లిస్టెడ్‌ సంస్థలు, నిమ్మగడ్డ ప్రసాద్‌ వంటి పారిశ్రామికవేత్తలూ పెట్టుబడులు పెట్టాయి. దీనికి సంబంధించి హెటెరోపై, నిమ్మగడ్డ ప్రసాద్‌పై చార్జిషీట్లు కూడా దాఖలయ్యాయి. అంటే... జగన్‌మోహన్‌రెడ్డి కేసుతో సంబంధం ఉన్న హెటెరో సంస్థకు బెర్ముడాలో కంపెనీ ఉన్నదనేది ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ప్రచురించిన వార్త తాత్పర్యం. 

మరి దాన్ని ఎల్లో మీడియా ఎలా తీసుకుంది?
జగన్‌కే బెర్ముడాలో కంపెనీలున్నట్లుగా... భూమి బద్దలైపోయిందా అన్న రీతిలో పతాక శీర్షికల్లో ఆయన ఫొటోను ప్రచురించేశారు. కొన్ని గంటల పాటు ఎల్లో చానళ్లలో కథనాలు నడిపించారు. ఇంతా చూస్తే... మొదటి పేజీలో ఆయన ఫొటో తప్ప బెర్ముడా పేపర్లలో ఆయన పేరు ఎక్కడ ఉందో చెప్పిన కథనం ఒక్కటీ లేదు. దీనర్థమల్లా ఒక్కటే!! వారికి కావాల్సింది సెన్సేషన్‌! ఆ సెన్సేషన్లో జగన్‌మోహన్‌రెడ్డి ఏదో చేసేశారన్నట్లుగా జనానికి చూపించటం. కానీ జనాలు ఆ మాత్రం నిజాలు తెలుసుకోలేరా? నిజానికి విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే ప్రతి కంపెనీకీ అక్కడ అనుబంధ సంస్థలుండటమనేది సహజం. అంతర్జాతీయ దిగ్గజం గూగుల్‌తో మొదలెడితే దేశీ ఐటీ అగ్రగాములు ఇన్ఫోసిస్, టీసీఎస్‌ సహా దాదాపు ప్రతి కంపెనీకీ విదేశాల్లో అనుబంధ సంస్థలుంటాయి. వాటి వార్షిక నివేదికల్లో అవన్నీ బయటపెడతాయి కూడా!!.

‘మోటపర్తి’ – చంద్రబాబు లింకుల్ని ఏం చేశారు?
ఇదే ఐసీఐజే ఇంతకుముందు ‘పనామా’ పత్రాల పేరిట పనామాలో రిజిస్టరయిన ఆఫ్‌షోర్‌ కంపెనీల పేర్లు, వ్యక్తుల చరిత్రలు బయటపెట్టింది. ఆ వ్యవహారంతో కొన్ని దేశాల్లో అధ్యక్షులు కూడా రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. ఆ పత్రాల్లో రాష్ట్రానికి చెందిన మోటపర్తి శివరామ కృష్ణ ప్రసాద్‌ పేరు స్పష్టంగా బయటపడింది. ఆయనకు బోలెడన్ని కంపెనీలున్నట్లు వెల్లడైంది. నిజానికి ఆయనెవరో కాదు. సాక్షాత్తూ చంద్రబాబు నాయుడు వ్యవస్థాపకు డిగా ఏర్పాటు చేసిన ఆయన కుటుంబ సంస్థ హెరిటేజ్‌ ఫుడ్స్‌లో డైరెక్టర్‌. ఈ ఆరోపణలు వచ్చిన వెంటనే ఆయన చేత హెరిటేజ్‌ ఫుడ్స్‌ రాజీనామా చేయించేసింది. చిత్రమేంటంటే ఆ రోజున ఏ ఎల్లో పత్రిక, చానల్‌ కూడా చంద్రబాబు నాయుడి పేరును ప్రస్తావించింది లేదు. కనీసం హెరిటేజ్‌ ఫుడ్స్‌ పేరునూ ప్రస్తావించలేదు. 

ఇక్కడ గమనించాల్సిందొక్కటే. బాబుతో నేరు గా సంబంధాలున్న... బినామీగా ఉండి పలు దేశాల్లో వ్యాపారాలు నడిపిస్తున్నారన్న ఆరోపణలెదుర్కొంటున్న  ఎంవీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ పేరు పనామా పత్రాల్లో వస్తే ఏ ఎల్లో మీడియా కూడా ప్రచురించ లేదు. అదే ప్యారడైజ్‌ పత్రాల్లో హెటెరో డ్రగ్స్‌ అనుబంధ కంపెనీ పేరొస్తే... అది చట్టబద్ధమైనదే అని తెలిసీ జగన్‌ ఫొటో ప్రచురించారు. అదీ ఎల్లో మాయ!!

ప్యారడైజ్‌ పత్రాలంటే...
పన్నులు తక్కువగా ఉండే బెర్ముడాలో పలువురు సంపన్నులు, అంతర్జాతీయ కంపె నీలు తమ అనుబంధ సంస్థల్ని రిజిస్టరు చేసుకు న్నారు. ఆయా కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్లు కూడా చేశారు. ఇవన్నీ యాపిల్‌బై అనే రిజిస్ట్రా్టర్‌ ద్వారా జరిగాయి. ఆ యాపిల్‌బై తాలూకు పత్రాల్ని ఐసీఐజే సంపాదించింది. అవే ప్యారడైజ్‌ పేపర్స్‌.

విదేశాల్లో కంపెనీలు, ఖాతాలు ఉండటం తప్పేమీ కాదని, అవన్నీ అక్రమమని చెప్పలేమని కూడా ఐసీఐజే తన కథనంలో ముందే చెప్పింది. కాకపోతే కొన్ని అక్రమమైనవి కూడా ఉండి ఉండొచ్చని... వాటిపై దర్యాప్తు చేయాల్సింది ఆయా దేశాల సంస్థలేనని కూడా ఐసీఐజే స్పష్టంచేసింది.

మరిన్ని వార్తలు