త్వరలోనే సౌరశక్తి రైలింజన్‌ కూత

20 Feb, 2020 12:52 IST|Sakshi
ఎర్రగుంట్ల–నంద్యాల రైలుమార్గం

ఎర్రగుంట్ల–నంద్యాల మార్గంలో విద్యుద్దీకరణకు శంకుస్థాపన..

ఇక ఊపందుకోనున్న పనులు

ప్రస్తుతం డీజిల్‌ లోకోలకే పరిమితం

ఇప్పటికే పూర్తయిన సర్వే

పనులు పూర్తయితే రెండు జిల్లాలకు ప్రయోజనం

ఈ మార్గాన్ని తొలి సౌరశక్తివినియోగ సెక్షనుగాప్రకటించిన రైల్వేశాఖ

రాజంపేట/జమ్మలమడుగు:  జిల్లాలో రెండో రైలుమార్గంలో విద్యుద్దీకరణ పనులకు ఎట్టకేలకు రైల్వేశాఖ పచ్చజెండా ఊపింది.  ఎర్రగుంట్ల–నంద్యాల రైల్వేలైన్‌ విద్యుద్దీకరణ (ట్రాక్షన్‌) పనులు ఇక ఊపందుకోనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే కేంద్రం పరిధిలోని సికింద్రాబాద్‌ స్టేషన్‌లో రైల్వేమంత్రి పియూష్‌ గోయల్‌ మంగళవారం ఈ పనులకు శంకుస్థాపన చేయడంతో జిల్లా ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తోంది. దీర్ఘకాలిక స్వప్నం నెరవేరనుందని ఆశాభావంతో ఉంది. శంకుస్థాపన చేస్తూ తొలిసారిగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సౌరవిద్యుత్‌ సెక్షనుగా ఈ మార్గాన్ని ప్రకటించారు. ఇప్పటివరకూ ఈమార్గంలో డీజిల్‌ లోకో రైళ్లు నడుస్తున్నాయి. డీఎంయూ (డీజల్‌ మల్టిపుల్‌ యూనిట్‌) ప్యాసింజర్‌ రైలు ఒకటి నడుస్తోంది. అదొక్కటే ఉపయోగకరంగా ఉంది.  ధర్నవరం నుంచి అమరావతికి వారంలో రెండురోజులు ఈ ప్యాసింజర్‌ రైలును నడిపిస్తున్నారు.  డీజల్‌ లోకో(రైలింజన్‌)తో గూడ్స్‌ రైళ్ల రాకపోకలను కొనసాగిస్తున్నారు. త్వరలోనే సౌరవిద్యుత్‌ సహాయంలో రైళ్లను నడపాలని రైల్వే అధికారులు సంకల్పిస్తున్నారు.  

రైలుమార్గం తీరు ఇలా..
కర్నూలు, కడప జిల్లాలను రాజధాని అమరావతికి అనుసంధానం చేసే ఈ రైలు మార్గం (ఎర్రగుంట్ల–నంద్యాల) 123 కిలోమీటర్ల విస్తరించి ఉంది.  ఈ రూటులో ఇప్పటికే రూ.967కోట్లు వివిధ పనులకు వెచ్చించారు. 780హెక్టార్లు భూమిని ఈ మార్గం కోసం సేకరించారు. 139 ఆర్‌యూబీలు,  కాపలా ఉన్నవి 5, లేనివి 15 ఎల్‌సీ గేట్లు ఉన్నాయి. 36 పెద్దవంతెనలు, 469 చిన్న వంతెనలున్నాయి. ఈ మార్గంలో ప్రొద్దుటూరు,జమ్మలమడుగు, ఉప్పలపాడు, నొస్సం, సంజమల, కోయిలకుంట్ల, బనగానపల్లె, మద్దూరు స్టేషన్లు కవరవుతాయి. ఎర్రగుంట్ల–నంద్యాల రైల్వేలైన్‌ ట్రాక్షన్‌ పనులు గతేడాది జనవరిలో ప్రారంభిస్తారని భావించారు. బడ్జెట్‌లో నిధులు మంజూరయినా పనులను ప్రారంభించలేదు. రేణిగుంట–గుంతకల్‌ రైలుమార్గం విద్యుద్ధీకరణ అయినందున ఎర్రగుంట్ల నుంచి నంద్యాల రైల్వేలైన్‌ కూడా విద్యుద్దీకరణ పూర్తయితే ఎలక్ట్రికల్‌ ఇంజన్లతో రైళ్లు నడుస్తాయి. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే కడప..కర్నూలు జిల్లా ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరం. దక్షిణ మధ్య రైల్వేలో తొలి సౌర విద్యుత్‌ వినియోగ సెక్షనుగా దీనిని రైల్వే శాఖ ప్రకటించింది. ఇప్పటివరకూ దక్షిణ మధ్య రైల్వేపరిధిలో సౌర విద్యుత్‌ సహాయంతో నడిచే రైలింజన్లు లేవు. అనుకున్న సమయంలో ఈ పనులు పూర్తి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.  

నిధులు స్వల్పమే..
ఎర్రగుంట్ల–నంద్యాల రైల్వేలైన్‌ విద్యుద్దీకరణకు కేంద్రం గత బడ్జెట్‌లో రూ.111.48 కోట్లు కేటాయించింది. ట్రాక్షన్‌ సర్వే పనులు కూడా నిర్వహించింది. ట్రాక్షన్‌ పనులను ఆర్‌వీఎన్‌ఎల్‌(రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌) సంస్థ చేపట్టనుంది. ఈఏడాది బడ్జెట్‌లో రూ.18కోట్లు కేటాయించింది. ఈమార్గం 123 కిలోమీటర్ల మేర రైలుమార్గంలో విద్యుద్దీకరణకు రూ.135 కోట్లు ఖర్చవుతుందని అంచనా. కానీ కేంద్రం కేటాయించిన నిధులు స్వల్ప మేననే ఆవేదన వ్యక్తమవుతోంది. ఉత్త మాటలు కాకుండా నిధుల విడుదలలో కేంద్రం మరింత చొరవ చూపిస్తే ఈ మార్గంలో సౌరశక్తి సహాయంతో రైళ్ల కూత వినే అవకాశం ప్రయాణికులకు కలుగుతుంది.

మరిన్ని వార్తలు