కొలువు తీరేదెన్నడు

15 Jun, 2014 02:02 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లా పరిషత్ చైర్మన్‌తో పాటు వివిధ మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక వ్యవహారంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ అనిశ్చితిని అడ్డం పెట్టుకుని అడ్డదారుల్లో  జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది.
 
* మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు, ఏప్రిల్ మొదటి,  రెండో వారాల్లో జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. అయితే మే 7న సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో మున్సిపల్, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ నెలరోజులకు పైగా వాయిదా పడింది.
* సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాక ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జిల్లా పరిషత్, మండల పరిషత్, పురపాలక సంఘాల ఎన్నికలకు సంబంధించి  ప్రక్రియ పూర్తి చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం గతంలో ప్రకటించింది.
ఫలితాలు వచ్చి నెలరోజులు దాటినా స్థానిక సంస్థల్లో బాధ్యతలు చేపట్టే ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలలో ఎక్స్‌అఫిషియో సభ్యునిగా ఓటు హక్కు కలిగి ఉంటారు. ఇక్కడ అసెంబ్లీ సమావేశాల తేదీపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.
శాసనసభ సమావేశం జరిగి సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మూడు నాలుగు రోజుల్లో వారు ఏ స్థానిక సంస్థలో సభ్యులుగా చేరాలనుకుంటున్నారో రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుంది.
* ఈ లెక్కన ఎన్నికలు జరగడానికి మరో 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.
* రాష్ట్రం రెండు ముక్కలైన తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా విడదీయాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ పూర్తి కాలేదు.
* పస్తుతం విధుల్లో ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తాము ఏ రాష్ట్రానికి చెందుతామో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. దీనిపై వివరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. అక్కడి నుంచి వివరణ వస్తేగాని జిల్లాపరిషత్ ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలియదు.
* ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందని జిల్లా పరిషత్ సభ్యులుగా ఎన్నికైనవారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
 
తెలుగుదేశం మైండ్‌గేమ్..
ప్రకాశం జిల్లాలో రెండు మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో రెండింటిని వైఎస్సార్ సీపీ గెలుచుకోగా, నాలుగింటిలో తెలుగుదేశం గెలుపొందింది.

* జిల్లా పరిషత్ విషయానికి వస్తే మొత్తం 56 స్థానాలకు 31 స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకోగా 25 స్థానాలను తెలుగుదేశం గెలుచుకుంది.
* రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో అడ్డదారులు తొక్కి అయినా జెడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
* దీని కోసం ఒక పథకం ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన జెడ్పీ సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు గోబెల్స్ ప్రచారం ప్రారంభించింది. దీనికి ఆ పార్టీ అనుకూల మీడియా కూడా వంతపాడుతోంది.
* వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు పొందడంతో విప్ జారీ చేసే అవకాశం కలిగింది. విప్‌ను ధిక్కరించి ఓటు వేస్తే అనర్హత వేటు పడుతుందని అందరికీ తెలుసు. అయినా వారు పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున జెడ్పీ అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అయిన డాక్టర్ నూకసాని బాలాజీని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.  
* బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి జిల్లా పరిషత్ పీఠంపై కూర్చోవడం ఇష్టం లేని తెలుగుదేశం నాయకులు ఎలాగైనా ఈ పీఠం దక్కించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
* అయితే వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఏ జెడ్పీటీసీ కూడా పార్టీ వీడేందుకు సిద్ధంగా లేకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు