వార్షిక పరీక్ష

14 Dec, 2013 06:33 IST|Sakshi

ఉట్నూర్, న్యూస్‌లైన్ : డీఎడ్ విద్యార్థులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. మొదటి సంవత్సరం పరీక్షలు నవంబర్‌లో నిర్వహించాల్సి ఉండగా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. రెండో సంవత్సరం పాఠాలు ప్రారంభం అయ్యాయి. పరీక్షలు నిర్వహిస్తే ఏమి రాయాలో తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వార్షిక పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు ఆందోళన చేసినా ప్రభుత్వం స్పందించడం లేదు. 2012-14 అకాడమిక్ సంవత్సరానికి గాను జిల్లావ్యాప్తంగా 350 మంది విద్యార్థులు ఉపాధ్యాయ శిక్షణ తీసుకుంటున్నారు. సిలబస్ కూడా పూర్తయింది. ప్రభుత్వం నవంబర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు నిర్వహించాలి. పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పరీక్షలు నిర్వహించినా ఫలితాలు 60 రోజులలోపు వెలువడే అవకాశం ఉంది. అయినా కొన్ని నెలలు విద్యాసంవత్సరం కోల్పోవాల్సి వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు. నిబంధనల ప్రకారం రెండో సంవత్సరం సిలబస్ ప్రారంభించాలని ఎస్‌సీఈఆర్‌టీ స్పష్టం చేయడంతో తరగతులు ప్రారంభమయ్యాయి.
 
 కౌన్సెలింగ్‌ను సాకుగా చూపిస్తూ..
 2013-15 విద్యా సంవత్సరానికి సంబంధించిన డీఎడ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ను నవంబర్ 11 నుంచి డిసెంబర్ 30 నిర్వహిస్తున్నట్లు ప్రకటించి కౌన్సెలింగ్ ప్రారంభించింది. కౌన్సెలింగ్ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ డైట్ కళాశాలల్లో నిర్వహించడం వల్ల సిబ్బంది బిజీగా ఉండటంతో పరీక్షలు నిర్వహించలేదని సర్కారు పేర్కొంటుంది. డీఎడ్ సిలబస్ 180 రోజుల్లో పూర్తి చేయాలి. కాని, తెలంగాణ ప్రక్రియ వేగవంతం అవడం, సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడటంతో సిలబస్ పూర్తికాలేదు.
 
 దీంతో 60 వరకు పనిదినాలు ప్రభుత్వం సర్దుబాటు చేస్తూ సిలబస్ పూర్తికాగానే పరీక్షలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు డీఎడ్ కళాశాలల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. అయితే ప్రభుత్వం ఉద్యమాన్ని కప్పిపుచ్చి కౌన్సెలింగ్ ప్రక్రియను   సాకుగా చూపుతుందనే ఆరోపణలు ఉన్నాయి. సకాలంలో ప్రభుత్వం డీఎడ్ కళాశాలలకు అనుమతులు ఇవ్వక పోవడం కూడా ప్రవేశ కౌన్సెలింగ్ అలస్యం అవ్వడానికి కారణం అంటున్నారు. ప్రభుత్వం మొదటి సంవత్సరం వార్షిక పరీక్షల టైం టేబుల్ ప్రకటించి విద్యార్థులు నష్టపోకుండా చూడాల్సిన అవసరం ఉంది.
 
 పరీక్షలు ఏలా రాయాలో తెలియడం లేదు..
 మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు నవంబర్‌లో నిర్వహించాల్సి ఉన్న ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇటు రెండో సంవత్సరం సిలబస్ ప్రారంభమైంది. ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తే ఏం రాయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు పరీక్షల టైం టేబుల్ వచ్చిన ప్రిపెర్ అవ్వడానికి అవకాశం లేకుండా ఉంది.
 - సంధ్య, డీఎడ్ మొదటి సంవత్సరం, ఉట్నూర్

మరిన్ని వార్తలు