వైఎస్సార్‌తో వైవీయుకు విశ్వఖ్యాతి..

14 Mar, 2019 10:06 IST|Sakshi
వైవీయూ పరిపాలన భవనం

సాక్షి, వైఎస్సార్‌ : కరువు సీమలోని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలన్న తలంపుతో ఏర్పాటైన యోగివేమన విశ్వవిద్యాలయం విశ్వఖ్యాతిని చాటి చెబుతోంది. 2006 మార్చి 9న పీజీ కేంద్రం నుంచి విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెంది నేడు 29 కోర్సులతో విలసిల్లుతోంది. దాదాపు 1500 మందికి పైగా విద్యార్థులు 115 మంది అధ్యాపక బృందం, 150 మంది పైగా పరిశోధక విద్యార్థులతో ప్రగతి పథంలో దూసుకువెళ్తోంది. 1977 నవంబర్‌ 20న తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం కడప నగరానికి సమీపంలో పీజీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.

డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2006లో 652 ఎకరాల్లో విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంది. వైఎస్‌ఆర్‌ హయాంలో విశ్వవిద్యాలయానికి 100 కోట్లకు పైగా నిధుల వరద పారింది. ఇందులో భాగంగా 2008లో ప్రొద్దుటూరులో వైఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటైంది. అనంతరం వైవీయూకు 12బీ, నాక్‌ బి గ్రేడ్, ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ నేషనల్‌ ర్యాంకింగ్‌ వంటి గుర్తింపుతోపాటు పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, యంగ్‌ సైంటిస్టు అవార్డులను విశ్వవిద్యాలయ అధ్యాపక బృందం సొంతం చేసుకున్నారు.

ఆయన స్వహస్తాలతో ప్రారంభించిన విశ్వవిద్యాలయం నేడు ఎందరికో ఉన్నతవిద్య, ఉపాధిని కల్పిస్తూ రాష్ట్రంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది. కాగా వైఎస్‌ఆర్‌ మరణానంతరం పాలకులు విశ్వవిద్యాలయం పట్ల వివక్షతను చూపడంతో విశ్వవిద్యాలయంలో నిలిచిన నిర్మాణాలు నేటికీ అదే విధంగా మొండిగోడలతో దర్శనమిస్తున్నాయి. రానున్న రోజుల్లో.. రాజన్న తనయుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలో విశ్వవిద్యాలయం మరింత ప్రగతి సాధిస్తుందని.. ఆ సువర్ణకాలం మరికొన్ని రోజుల్లోనే తిరిగి వస్తుందని పలువురు విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


పరిశోధనలు చేసే అవకాశం లభించింది
కడపలో యోగివేమన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం వల్లనే ఇక్కడికి వచ్చి పరిశోధనలు చేసే అవకాశం లభిస్తోంది. వైఎస్‌ఆర్‌ ఇక్కడ వైవీయూ ఏర్పాటు చేయకపోయి ఉంటే పొరుగు జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఆయన చలువతో నేడు వైవీయూలో పరిశోధనలు చేయగలుగుతున్నాం.
– పి.రోజారాణి, మైక్రోబయాలజీ విద్యార్థిని


కరువు ప్రాంతంలో కల్పవృక్షం వైవీయూ
కరువు ప్రాంతమైన కడప గడపలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడమే ఒక గొప్ప విషయం. ఈ విశ్వవిద్యాలయం రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వవిద్యాలయాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిందంటే.. అది ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ తీసుకున్న చొరవే కారణం.
 – డాక్టర్‌ కె.శృతి, వైవీయూ పరిశోధకురాలు


గొప్ప అవకాశం లభించింది
జిల్లాలో ప్రసిద్ధ తత్వవేత్త వేమన పేరుతో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం జిల్లా వాసులుగా మనందరి అదృష్టం. వైఎస్‌ఆర్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం వల్లే.. ప్రస్తుతం ఉన్నత విద్యను చదవడంతోపాటు పరిశోధనలు చేసే అవకాశం లభించింది.
 – ఎం. పావని, రాజంపేట, ఫిజిక్స్‌ స్కాలర్, వైవీయూ 

మరిన్ని వార్తలు