సెల్ఫోన్ ఉంది - మరుగుదొడ్డిలేదు: చంద్రబాబు

9 Aug, 2014 17:38 IST|Sakshi
నక్కపల్లి సభలో చంద్రబాబు నాయుడు

విశాఖపట్నం: డ్వాక్రా మహిళల వద్ద సెల్ఫోన్లు ఉన్నాయిగానీ, వారి ఇళ్లలో మరుగు దొడ్లు మాత్రం లేవని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విస్మయం వ్యక్తం చేశారు. జిల్లాలోని నక్కపల్లిలో జరిగిన డ్వాక్రా మహిళల సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెల్ఫోన్లు ఉన్నవారు చేతులు ఎత్తాలని అడిగారు.  చాలా మంది చేతులు ఎత్తారు. కొద్ది మంది మాత్రం చేతులు ఎత్తలేదు. దాంతో సెల్ఫోన్లు లేని డ్వాక్రా మహిళలకు త్వరలో సెల్ఫోన్లు ఇస్తామని చెప్పారు. ఆ తరువాత తమ ఇళ్లలో మరుగుదొడ్లు ఉన్నవారు చేతులెత్తాలని అడిగారు. చాలా తక్కువ మంది మాత్రమే చేతులు ఎత్తారు. దాంతో సెల్ఫోన్లు ఉన్నాయి గానీ, మరుగుదొడ్లు మాత్రం లేవన్నారు. వచ్చే అయిదేళ్లలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కట్టిస్తామని చెప్పారు.

రాష్ట్రాభివృద్ధిలో మహిళల పాత్ర ఉండాలన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటే అభివృద్ధి సాధ్యం అని చెప్పారు. మహిళా శక్తి తలచుకుంటే ఏదైనా సాధ్యమేనన్నారు.

అభివృద్ధిలో కేసిఆర్తో పోటీపడటానికి సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు తెలిపారు. గతంలో చాలా మంది తనతో పోటీపడటానికి ప్రయత్నించారని చెప్పారు. అయితే ఎవరూ పోటీపడలేకపోయారన్నారు. హైదరాబాద్ను తానే అభివృద్ధి చేశానని, దాంతో  ఆదాయం పెరిగిందని చెప్పారు. అభివృద్ధిలో పోటీపడటం మంచిదేనన్నారు.

మరిన్ని వార్తలు