ఇస్తారా.. ఇవ్వరా?

21 Jan, 2015 02:43 IST|Sakshi
ఇస్తారా.. ఇవ్వరా?

రాయదుర్గం : రెండేళ్లుగా బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా రుణాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తుండటాన్ని నిరసిస్తూ పొదుపు సంఘాల మహిళలు  స్టేట్ బ్యాంకును ముట్టడించారు. గుమ్మఘట్ట మండలం గలగల, గొల్లపల్లి, జాలివంక, 75 వీరాపురం, సిరిగేదొడ్డి, రాయదుర్గం మండలం రాయంపల్లి, బీఎన్ హళ్లికి చెందిన పొదుపు సంఘాల మహిళలు సుమారు 200 మంది మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుండి 2.30 వరకు బ్యాంకు ప్రధాన ద్వారానికి తాళం వేసి బైఠారుుంచారు. తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లించినా, తిరిగి కొత్త రుణాలు ఇవ్వలేదని సంఘాల లీడర్లు శాంతి, అంబిక, శారద ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొత్త రుణాల కోసం రెండేళ్లుగా తిప్పుకుంటున్నారని మండిపడ్డారు. కొంత సొమ్ము నిల్వ వుంటే రుణాలిస్తామనడంతో అప్పులు చేసి, మరికొంత మంది మంగళ సూత్రాలు తాకట్టు పెట్టి రూ.50 వేల వరకు ఖాతాలో వేశామన్నారు. అలా వేసి సంవత్సరం దాటినా రుణాలు ఇవ్వకుండా వేధించడమేంటని ప్రశ్నించారు. ఫీల్డ్ ఆఫీసర్ అంజాద్ ఖాన్‌కు మహిళలంటే గౌరవం లేదని ఆరోపించారు. ఈ విషయాన్ని బ్యాంకు మేనేజర్ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కొంత సేపటి తర్వాత మేనేజర్ ప్రసాద్.. వెలుగు సిబ్బంది, ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. ఫీల్డ్ ఆఫీసర్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, రుణాల కోసం ఇచ్చిన 45 డాక్యుమెంట్లను బుట్టదాఖలు చేశారని వెలుగు సిబ్బంది సైతం మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. బ్యాంకర్ల నిర్లక్ష్యం వల్ల మహిళలు రూ.1.50 కోట్లు నష్టపోయారన్నారు. సక్రమంగా రుణాలు చెల్లించిన సంఘాల జాబితా సిద్ధం చేసి ఇస్తే రుణాలిస్తామని మేనేజర్ హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.           

>
మరిన్ని వార్తలు