వెలుగు తీగల్లో సమ్మె రాగం

12 Sep, 2013 03:36 IST|Sakshi

కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: విద్యుత్ శాఖలో సమ్మె సైరన్ మోగింది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ అధికారులు, ఉద్యోగులు విధుల బహిష్కరణకు సిద్ధమయ్యారు. ఈనెల 11వ తేదీ అర్ధరాత్రి నుంచి 72 గంటల పాటు(మూడు రోజులు) మెరుపు సమ్మె చేపడుతున్నట్లు ఆ శాఖ జేఏసీ స్పష్టం చేసింది. బుధవారం మధ్యాహ్నం సంస్థ అందజేసిన సెల్‌ఫోన్ సిమ్ కార్డులను ఉన్నతాధికారులకు అప్పగించారు. ఈ కారణంగా సిబ్బంది సెల్‌ఫోన్లు మూగబోయాయి. సమైక్యాంధ్ర పరిరక్షణకు సీమాంధ్రలోని 13 జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో విద్యుత్ సౌధ, ఇతర చోట్ల పనిచేస్తున్న అన్ని ఇంజినీరింగ్, కార్మిక, ఉద్యోగ సంఘాలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడం తెలిసిందే. ఈక్రమంలో ఆగస్టు 16వ తేదీన సెంట్రల్ జేఏసీ సమ్మె నోటీసు అందజేసింది. అదే రోజు నుంచి స్థానిక విద్యుత్ భవన్ వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూనే.. వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఈ నెల 2 నుంచే సమ్మెలోకి వెళ్లాల్సి ఉం డగా.. విభజనపై కేంద్ర వెనక్కి తగ్గే అవకాశం ఉందని ప్రజాప్రతినిధులు ఇచ్చిన భరోసాతో 10 రోజులు వాయి దా వేసుకున్నారు. అయినప్పటికీ స్ప ష్టత రాకపోవడంతో బుధవారం అర్ధరాత్రి నుంచి 72 గంటల పాటు సమెలో వెళ్లారు. ‘మెరుపు సమ్మె’తో విధులను బహిష్కరించి సమైక్యపోరాటాలు చేపడతామని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్, కర్నూలు డివిజినల్ ఇంజినీర్ ఎం.ఉమాపతి తెలిపారు.
 
 సెల్‌డౌన్: జిల్లా వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు సంస్థ అందజేసిన సిమ్ కార్డులను సెల్‌ఫోన్ల నుంచి తొలగించి స్థానిక విద్యుత్ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డీఈఈలు, ఇంజినీర్లు, సబ్ ఇంజినీర్లు, రెవెన్యూ, ఇతర టెక్నికల్ అధికారలు సిమ్ కార్డులను జేఏసీ చైర్మన్ ఉమాపతికి అందజేశారు. ఆయన ఎస్‌ఈ టి.బసయ్య, శ్రీరాములకు అప్పజెప్పారు. ఇటు శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో పనిచేస్తున్న జెన్‌కో అధికారులు, సిబ్బంది కూడా సమ్మెబాట పట్టారు. కర్నూలులోని విద్యుత్ శాఖ అతిథి గృహంలో బుధవారం రాత్రి జేఏసీ నాయకులు సమావేశమయ్యారు.
 
 ఈ సందర్భంగా చైర్మన్ ఉమాపతి మాట్లాడుతూ సమైక్యాంధ్ర పరిరక్షణకు చేపట్టిన సమ్మెకు జిల్లాలోని వినియోగదారులు, రైతులు సహకరించాలని కోరారు. మూడు రోజుల్లో కేవలం అత్యవసర విభాగాలైన ప్రభుత్వాసుపత్రులు, వాటర్ వర్క్స్, రైల్వే శాఖలకు అందించే సరఫరాలో అంతరాయం ఏర్పడితేనే పరిష్కరిస్తామన్నారు. తాము విద్యుత్ సరఫరా నిలిపివేయడం లేదని.. వర్షాలు, గాలులు, ఇతర కారణాలతో బ్రేక్‌డౌన్, ట్రాన్స్‌ఫార్మర్, సబ్‌స్టేషన్, ఫ్యూజు పోయినా, ఫీడర్ ట్రిప్పింగ్ జరిగి సరఫరా ఆగిపోయినా, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయిన మరమ్మతులు చేపట్టబోమని స్పష్టం చేశారు. విద్యుత్ కష్టాలకు ప్రభుత్వమే పూర్తి బా ధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
 

>
మరిన్ని వార్తలు