నవ వరుడి అనుమానాస్పద మృతి

26 Apr, 2015 02:39 IST|Sakshi

 పాతవెలగలపాలెం (రాజవొమ్మంగి) :పెళ్లయిన తర్వాత సాంప్రదాయం ప్రకారం అత్తవారింట్లో మూడు రోజులు గడిపేందుకు వచ్చిన వరుడు అనుకోని రీతిలో మూడోరోజు మంచంపై శవమై కనిపించాడు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన శనివారం ఉదయం రాజవొమ్మంగి మండలం పాత వెలగలపాలెం గ్రామంలో చోటు చేసుకొంది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం గోకవరం మండలం కామరాజుపేట పంచాయతీ శివరామపట్నం గ్రామానికి చెందిన సోముల రాజు(23) వెలగలపాలెం గ్రామానికి చెందిన లక్ష్మిని ఈ నెల 22 న తన స్వగ్రామంలో వివాహం చేసుకున్నాడు.
 
 మర్నాడు రాజు తన భార్య లక్ష్మి, అక్క, బావలతో అత్తవారి ఇంటికి వచ్చాడు. 24తేదీ ఉదయం రాజు మంచంపై అచేతనంగా పడివుండటాన్ని కుటుంబీకులు కనుగొన్నారు. ఈ సంఘటన జరిగే సమయానికి పెండ్లి కుమారుని కుటుంబీకులు కూడా అదే ఇంట్లోవున్నా ఈ ఘోరం ఎలా జరిగిందనే విషయాన్ని అంచనా వేయలేకపోతున్నారు. దీంతో మృతుడి అక్క అర్జమ్మ వెంటనే జడ్డంగి పోలీసులకు ఫిర్యాదు చేయగా స్థానిక సీఐ కేఎన్ మోహనరెడ్డి, ఎస్సై నల్లమల లక్ష్మణబాబులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి మర్మావయాలపై, మెడ, ఎడమ భుజంపై ఇనుప సూదులతో పొడిచినట్టు 50 నుంచి 60 వరకు గాయాలు ఉన్నట్టు సీఐ, ఎస్సైల పరిశీలనలో తేలింది. స్థానిక వీఆర్వో హంస తులసి, స్థానిక పెద్దల సమక్షంలో పంచనామా అనంతరం మృతదేహాన్ని అడ్డతీగల ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు.
 
 మా కుమారుడిని పథకం ప్రకారమే హత్య చేశారు..
 మా కుమారుడు లక్ష్మిని ఇష్టపడి వివాహం చేసుకున్నాడని, ఇరు కుటుంబాల వారి ఇష్టప్రకారమే పెళ్లి చేశామని మృతుడి తల్లిదండ్రులు పాడి రాంబాబు, గంగ స్థానిక విలేకరులకు తెలిపారు. కుమారుడి మరణవార్త తెలిసిన వెంటనే గోకవరం నుంచి వెలగలపాలెం వచ్చారు. తమ కుమారుడిని లక్ష్మి కుటుంబీకులే పథకం ప్రకారం మట్టుపెట్టారని, సమగ్ర దర్యాప్తు చేసి నిగ్గుతేల్చాలని కోరారు.
 

మరిన్ని వార్తలు