అనుమంచిపల్లిలో వ్యక్తి దారుణ హత్య

1 Jul, 2018 06:54 IST|Sakshi

బండరాయితో కొట్టి చంపిన దుండగులు

ఉలిక్కిపడ్డ గ్రామం  

పోలీసు జాగిలంతో గాలింపు

అనుమంచిపల్లి (జగ్గయ్యపేట) : ఓ వ్యక్తిని బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన గ్రామంలో శుక్రవారం అర్దరాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పసుపులేటి బ్రహ్మయ్య (38) వ్యవసాయ కూలీ రైతు. గ్రామంలో ప్రతి ఒక్కరికి సుపరిచితుడు. ఈ క్రమంలో రాత్రి గ్రామంలో బ్రహ్మం గారి జెండా ఊరేగింపు ఉంది. దీంతో ఊరేగింపునకు కావాల్సిన పూజా సామాగ్రి కొనుగోలు చేసి ఇంట్లోని కుటుంబ సభ్యులకు ఇచ్చి బయటకు వెళ్లి వస్తానని చెప్పి రాత్రి 8 గంటల సమయంలో వెళ్లిపోయాడు. 12 గంటలు దాటినా భర్త ఇంటికి రాలేదని భార్య సుజాత అత్తమామలు, మరిదిలకు చెప్పటంతో వారు కూడా గ్రామంలో గాలించారు. అతని ఫోన్‌ కూడా స్విచ్‌ఆఫ్‌ చేసి ఉండటంతో ఆందోళన చెందిన వారు గ్రామ పెద్దలకు తెలిపారు. రాత్రి కావటంతో ఉదయం ఆచూకీ తెలుసుకుందామని చెప్పటంతో కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు.

పంట పొలాల్లో శవంగా..
శుక్రవారం రాత్రి వెళ్లిన బ్రహ్మయ్య 65వ నెంబర్‌ జాతీయ రహదారి పక్కనున్న 24 గంటల కాటా సమీపంలోని పంట పొలాల్లో రక్తపు మడుగులో శవంగా కనిపించాడు. ఉదయం అటుగా వెళ్తున్న రైతులు గమనించి గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చిల్లకల్లు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ ఘటనా స్థలానికి వచ్చి పరిసరాలను పరిశీలించారు. హత్యకు ముందు మృతుడు బ్రహ్మయ్యతో పాటు మరి కొంత మంది మద్యం సేవించినట్లు, ఆ తర్వాతే హత్య జరిగిందని ఆ ప్రాంతంలోని మద్యం సీసాలను బట్టీ నిర్దారించారు.

 మృతుడిని పెద్ద బండరాయితో తలపై మోదటంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. హత్య వార్త దావానలంగా వ్యాపించడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలికి చేరుకున్నారు. సీఐ జయకుమార్‌ వచ్చి హత్య జరిగిన తీరును, మృతుడి భార్య, కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హత్య కేసుగా నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని వైఎస్సార్‌ సీపీ యువజన నాయకుడు సామినేని ప్రశాంత్‌ సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. 

పోలీసు జాగిలంతో గాలింపు..
మచిలీపట్నం నుంచి పోలీసు జాగిలం (రాజా) మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకుంది. అనంతరం మాస్టర్‌ రవి పర్యవేక్షణలో హత్య జరిగిన ప్రదేశం నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల మేర గ్రామంలోని మూడు గృహాల వద్దకు వెళ్లి తారసలాడి మళ్లీ హత్య జరిగిన ప్రదేశానికి వచ్చింది. దీంతో పోలీసులు గ్రామంలోనే కొందరు హత్యకు ప్రేరేపించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా అక్రమ సంబంధం నేపథ్యంలో హత్య చేశారా, లేక చేతబడి చేయిస్తున్నాడనే వదంతుల కారణంగా చంపేశారా అన్న అనుమానాలను గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు