ప్రాణం తీసిన అతివేగం

1 May, 2015 02:34 IST|Sakshi
ప్రాణం తీసిన అతివేగం

కనకదుర్గమ్మ వారధి వద్ద యువకుడి సజీవదహనం
 
రేపోమాపో పెళ్లికావాల్సిన కుర్రాళ్లు.. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తూ అదుపుతప్పి పడిపోయిన ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కొత్తగా వేస్తున్న రోడ్డుపై జీబ్రా చారలు వేస్తుండగా పెయింట్ డబ్బాలను ఢీకొనడంతో మంటలు చెలరేగి సజీవదహనమయ్యాడు. కనకదుర్గమ్మ వారధిపై గురువారం ఉదయం ఈ సంఘటన సినీఫక్కీలో జరిగింది.
 
తాడేపల్లి రూరల్(గుంటూరు జిల్లా) :  అతివేగం మరో రెండు నెలల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఓ యువకుడిని బలితీసుకుంది. పెయింట్ డబ్బాల రూపంలో మృత్యువు వెంటాడగా, పెట్రోల్ రూపంలో సజీవ దహనం చేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని కనకదుర్గ వారధిపై గురువారం అందరూ చూస్తుండగా అచ్చం సినిమా సన్నివేశంలా జరిగిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
 గుంటూరుకు చెందిన వెలగల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు సీతారామరాజు (23)కు చిలకలూరిపేట సమీపంలోని మెట్టపల్లి గ్రామానికి చెందిన మిత్రుడు మందా నారాయణస్వామితో కలిసి రిలయన్స్ 4జి కంపెనీలో విధులు నిర్వహిస్తుంటారు. వీరిద్దరూ నిత్యం గుంటూరు నుంచి పల్సర్ ద్విచక్రవాహనంపై విజయవాడ బెంజ్ సర్కిల్ వరకు ప్రయాణం చేస్తూ ఉంటారు. సీతారామరాజుకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. మరో రెండు నెలల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సి ఉంది. రోజూ మాదిరిగానే గురువారం మిత్రుడితో కలిసి విజయవాడ బయలుదేరిన వీరు కనకదుర్గ వారధిపై అతి వేగంగా వెళ్తూ రోడ్డుపై జీబ్రా లైన్లు వేస్తున్న పెయింట్ డబ్బాలను ఢీకొట్టారు.
 
అచ్చం సినిమా సన్నివేశంలా..

బైక్ వేగానికి పెయింట్ డబ్బాలతో పాటు అందులో కలిపే టిన్నర్ సైతం ఎగిరి వీరి ఒంటి నిండా పడింది. అప్పటికే ఆ డబ్బాలలో కొంత కిరోసిన్ కలిపి ఉండడం, అది వీరి ఒంటిపై పడడంతో కంగారు పడ్డ వీరు దిచక్రవాహనాన్ని నియంత్రించలేకపోయారు.
 వారధిపై 8-9 ఖానాల నడుమ బండి అదుపుతప్పి కిందపడి దూసుకు వెళుతుండడంతో బండిలోని పెట్రోల్ ఒలికి రోడ్డుపై పడింది. బైక్‌పై ఉన్న ఇద్దరినీ తడిపేసింది. ఆ సమయంలోనే పల్సర్ వాహనం ఒత్తిడికి రోడ్డుపై నిప్పు రవ్వలు రేగి, ఆ మంట వీరికి అంటుకోవడం క్షణాల్లో జరిగిపోయాయి.

బాధితుల కేకలు విని సమీపంలోని వాహనదారులు, పెయింట్ వేస్తున్న వారు మంటలు ఆర్పేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఎంతకీ మంటలు అదుపుకాలేదు. ఒంటిపై మంటల ధాటికి ఆర్తనాదాలు చేసిన బాధితులు ఒకానొక తరుణంలో కృష్ణానదిలో దూకేందుకు ప్రయత్నించగా, స్థానికులు నిలువరించారు. అటుగా వెళ్లే ప్రయాణికులు కార్లలో ఉన్న టవళ్లతో మంటలను అదుపు చేశారు.
 అప్పటికే సీతారామరాజు శరీరం 90 శాతం కాలిపోగా, నారాయణ స్వామికి కొంతమేర గాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో బాధితులను ఆసుపత్రికి తరలించారు. మార్గంమధ్యలోనే సీతారామరాజు మృతి చెందగా, నారాయణ స్వామి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మరో రెండు నెలల్లో వివాహం కావాల్సిన కుమారుడు అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. కేసు నమోదు చేసిన తాడేపల్లి ఎస్‌ఐ వినోద్‌కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని నార్త్ జోన్ డీఎస్పీ రామకృష్ణ, తాడేపల్లి సీఐ చిట్టెం కోటేశ్వరరావు సందర్శించి వివరాలు సేకరించారు.

>
మరిన్ని వార్తలు