పెళ్లైన ఆనందం తీరక ముందే..

6 Sep, 2018 14:46 IST|Sakshi
వివాహ సమయంలో భర్తతో గౌతమి , గణేష్‌(ఫైల్‌ఫొటో)

యువకుడ్ని బలిగొన్న డెంగీ మహమ్మారి

విధి వంచనకు గురైన గౌతమి

శ్రీకాకుళం, నరసన్నపేట: పెళ్లైన ఆనందం తీరకముందే ఓ యువకుడ్ని డెంగీ మహమ్మారి బలితీసుకుంది. కట్టుకున్న యువతిని కన్నీరు పాల్జేసింది. వివరాల్లోకి వెళితే.. రేగిడి ఆమదాలవలస మండలం పుర్లికి చెందిన బూరాడ గణేష్‌ (26) నరసన్నపేట గాంధీనగర్‌లో నివసిస్తున్నాడు. అతనికి ఈ ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన లుకలాం గ్రామానికి చెందిన గౌతమితో వివాహం అయింది. ప్రస్తుతం గౌతమి గర్భిణి. గడిచిన వారం రోజులుగా గణేష్‌ జ్వరంతో బాధపడుతూ స్థానిక వైద్యుల వద్ద చికిత్స పొందాడు.

అయితే జ్వరం తగ్గక పోగా ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని విశాఖలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించాడు. ఈ సమాచారం తెలుసుకున్న కుటంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఎంతో భవిష్యత్తు ఉన్న గణేష్‌ తన వైవాహిక జీవతంపై ఎన్నో కలలు కన్నాడు. పుట్టిన పిల్లలను బాగా చదివించాలని, ఆదర్శంగా పెంచాలని భార్యతో అంటుండేవాడు. గణేష్‌ది వ్యవసాయక కుటుంబం. స్వశక్తితో జీవనం సాగించాలనే ఆశయంతో వెల్డింగ్‌ పనులు చేస్తూ తల్లిదండ్రులకు కొంత డబ్బు పంపిస్తూ తన  భార్యను అపురూపంగా చూసుకొంటూ వస్తున్నాడు. ఈ దశలో అతన్ని డెంగీ వ్యాధి బలితీసుకుంది. భర్త ఆకస్మిక మృతితో భార్య గౌతమి కన్నీరు మున్నీరవుతోంది.  

విధివంచితురాలు..
కాగా పదేళ్ల క్రితం విద్యుత్‌ షాక్‌తో గౌతమి తండ్రి రామారావు మృతి చెందారు. వివాహానికి కొద్దిరోజుల ముందు తల్లి రాజేశ్వరి కిడ్నీ వ్యాధితో మరణించింది. తాజాగా భర్త గణేష్‌ మృతితో  గౌతమి తీవ్ర విషాదంలో ఉంది.

మరిన్ని వార్తలు