కొండ దిగొచ్చినా... దక్కని ఫలితం..!

29 Jan, 2020 11:36 IST|Sakshi
కోమాలోకి వెళ్లిన నాగరాజు, నాగరాజును డోలీలో కొండ దిగువకు మోసుకొస్తున్న గిరిజనులు

మలేరియాతో గిరిజన యువకుడి మృతి

డోలీలో  ఎస్‌.కోట ఆస్పత్రికి తరలింపు

విజయనగరం మహరాజా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి 

ఆ యువకుడు సంక్రాంతి పండగకని ఊరొచ్చాడు. అంతలోనే మలేరియా, పచ్చకామెర్ల వ్యాధి బారిన పడ్డాడు. గిరిజన గ్రామం కావడం, సకాలంలో వైద్యం అందక పరిస్థితి విషమించింది. ఇక చనిపోతాడని భావించిన తల్లిదండ్రులు చివరి ప్రయత్నంగా డోలీలో పట్టణానికి తీసుకొచ్చారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించింది. ప్రాణం పోయింది. ఆ యువకుడు పల్లపుదుంగాడ గిరిజన గ్రామానికి చెందిన నాగరాజు. వివరాల్లోకి వెళ్తే...

విజయనగరం,శృంగవరపుకోట రూరల్‌: మండలంలోని దారపర్తి గిరిశిఖర పంచాయతీ పల్లపుదుంగాడ గిరిజన గ్రామానికి చెందిన జరత నాగరాజు(22) మలేరియా, పచ్చకామెర్ల వ్యాధితో కోమాలోకి వెళ్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. బంధువులు, గిరిజనులు తెలిపిన వివరాలు..  పచ్చకామెర్లు, మలేరియాతో బాధపడుతున్న నాగరాజు ఇక బతకడని భావించిన తల్లిదండ్రులు వారి బంధువులకు మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఫోన్లలో సమాచారం ఇచ్చారు. నాగరాజు పరిస్థితి తెలుసుకున్న పెదనాన్న కుమారుడు, గిరిజన సంఘం నేత జె.గౌరీష్‌ వెంటనే డోలీ కట్టి తీసుకువస్తే ఆస్పత్రిలో చేర్పించి చివరి ప్రయత్నం చేద్దామని గట్టిగా చెప్పాడు. వెంటనే తల్లిదండ్రులు బీమయ్య, పెంటయ్యతో పాటు ఇతర బంధువులు డోలీ సాయంతో నాగరాజును మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు(సుమారు పది కిలోమీటర్లు నడిచి) ఉదయం ఎనిమిది గంటలకు కొండ దిగువన దబ్బగుంట వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి అంబులెన్స్‌లో ఎస్‌.కోటలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి కోమాలో ఉన్న నాగరాజును తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పి విజయనగరం మహరాజా ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. విజయనగరంలో మూడు గంటల పాటు చికిత్స పొందిన నాగరాజు అంతలోనే మృతి చెందాడని అన్నయ్య గౌరీష్‌ రోదిస్తూ చెప్పాడు. నాగరాజు రాజమండ్రిలో ప్రైవేటుగా పని చేసే వాడని, సంక్రాంతి పండగకొచ్చిన కొద్ది రోజులకే రోగంతో మంచం పట్టాడని తెలిపాడు.    

రోడ్డు లేకనే ఇలా..
దారపర్తి గిరిశిఖర పంచాయతీ పరిధి గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకనే రోగాల బారిన పడిన గిరిజనులు మృత్యువాత పడే పరిస్థితులు తలెత్తుతున్నాయని గిరిజన సంఘం నాయకులు జె.గౌరీష్, ఆర్‌.శివ, మద్దిల రమణ తదితరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా కొండపైన గల గిరిజన గ్రామాలకు కనీస రహదారులు ఏర్పాటు చేసే ఆలోచనను గత ప్రభుత్వాలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వమైనా గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు.

మరిన్ని వార్తలు