వైద్యుల నిర్లక్ష్యంతో యువకుడి మృతి! 

18 Oct, 2019 09:07 IST|Sakshi
మృతి చెందిన చక్రవర్తి వద్ద విలపిస్తున్న కుటుంబసభ్యులు   

సాక్షి, కర్నూలు: ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటీలో వైద్యుల నిర్లక్ష్యానికి మరో యువకుడు మృతి చెందాడు. వారం రోజుల క్రితం సరైన వ్యాధి నిర్ధారణ జరగక, సకాలంలో వైద్యం అందక ఒకరు మృతి చెందిన విషయం విదితమే. తాజాగా మరో యువకుడు సరైన చికిత్స అందక తనువు చాలించాడు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన కేశాలు, రూతమ్మలకు ఇద్దరు కుమారులు. వీరిది వ్యవసాయ కుటుంబం. పెద్ద కుమారుడైన చక్రవర్తి(20) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ వ్యవసాయం చేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం వ్యక్తిగత కారణాలతో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కుటుంబసభ్యులు వెంటనే అతన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అనంతరం పరిస్థితి విషమిస్తుండటంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రెఫర్‌ చేశారు.

గురువారం ఉదయం 6 గంటలకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చిన అతనికి వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి మేల్‌ మెడికల్‌(ఎంఎం)–7 వార్డులో అడ్మిట్‌ చేశారు. వాస్తవంగా ఇలా క్రిమిసంహారక మందు తాగిన వారిని వార్డులో గాకుండా ముందుగా ఏఎంసీ విభాగానికి తరలిస్తారు. కానీ వైద్యులు వార్డుకు తరలించడంతో అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించింది. వెంటనే క్యాజువాలిటీకి తీసుకురాగా అప్పటికే అతను మృతి చెందాడు. దీంతో క్యాజువాలిటీలో కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. వార్డుకు గాకుండా ఏఎంసీ విభాగానికి తీసుకెళ్లి అత్యవసర వైద్యం అందించి ఉంటే తమ కుమారుడు బతికేవాడని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యమే తన కుమారుని మృతికి కారణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి అవుట్‌ పోస్టు పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.   

మరిన్ని వార్తలు