రోడ్డు ప్రమాదం చిదిమేసింది!

20 Jan, 2020 07:50 IST|Sakshi
భరత్‌సింహారెడ్డితో అతని తల్లిదండ్రులు, దరఖాస్తును అంగీకరించినట్లు వచ్చిన మెసేజ్‌

ఇంజినీర్‌ అవుతాడనుకుంటే ప్రమాదంతో ఇంటికే పరిమితమయ్యాడు

మెసేజ్‌ పంపి సాయమందించని టీడీపీ ప్రభుత్వం

కుమారుడి ఆపరేషన్‌కు దాతల సాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు

అతడు చదువుల్లోనే కాదు..ఆటల్లోనూ ఫస్టే. అయితే  రోడ్డు ప్రమాదం అతడి జీవితాన్ని కకావికలం చేసింది. ఇంజినీర్‌ కావాలన్న అతడి కలలను చిదిమేసింది. తల్లిదండ్రులు అతడి చికిత్స కోసం శక్తికి మించి ఖర్చు చేశారు. మరికొన్ని ఆపరేషన్ల కోసం సాయం చేసే దాతల కోసం ఎదురుచూస్తున్నారు.

చిత్తూరు, మదనపల్లె : పెద్దమండ్యం మండలం గురివిరెడ్డిగారిపల్లెకు చెందిన కృష్ణారెడ్డికి తన కుమారుడు భరత్‌సింహారెడ్డి చదువుకోసం ఉన్న ఊరిని వదిలి మదనపల్లెకు చేరుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట చిన్న దుకాణం పెట్టుకుని కుటుంబా న్ని పోషిస్తున్నారు. పదోతరగతిలో 9.0 పాయింట్లతో ఉత్తీర్ణుడైన భరత్‌సింహారెడ్డి ఇంటర్మీడియెట్‌ ఏపీఆర్‌జేసీ గ్యారంపల్లెలో సీటు పొందా డు. 2016లో జిల్లాస్థాయి క్రికెట్‌ పోటీల్లో పాల్గొని విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలకు హాజరై రంజీ ట్రోఫీకి సెలెక్ట్‌ అయ్యాడు. ఇంటర్‌ పూర్తిచేశాక పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా గూడూరులో ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో చేరాడు. 2017నవంబర్‌ 5న స్నేహితుడు ఇంటికి వెళ్లి పుస్తకాలు తీసుకువస్తున్న భరత్‌నసింహారెడ్డిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో స్నేహితుడు అక్కడికక్కడే మరణించగా, భరత్‌సింహారెడ్డికి ఎడమకాలు నుజ్జు నుజ్జైంది, చేయి, భుజం పూర్తిగా దెబ్బతినడంతోపాటు మతిస్థిమితం కోల్పోయాడు.

గ్రామంలోని నాలుగెకరాల వ్యవసాయభూమిని విక్రయించి ఆ సొమ్ముతో భరత్‌సింహారెడ్డికి అతడి తల్లిదండ్రులు చికిత్స చేయించారు. మరికొన్ని ఆపరేషన్లు చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పడంతో చేసేదిలేక అప్పట్లో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం  త్వరలోనే చెక్కును పంపనున్నట్లు కృష్ణారెడ్డి సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ పంపింది. అయితే ఆ సాయం అందలేదు. చివరకు స్నేహితులు, దాతలు, బంధువులు చేసిన సాయం మూలాన చేయించిన చికిత్సతో భరత్‌ కొంతవరకు కోలుకున్నాడు. అతడికి నరాలకు సంబంధించిన ఆపరేషన్లు చేస్తే నడిచే అవకాశం ఉందని, రూ.3.5 లక్షల నుంచి 5లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో కుమిలిపోతున్నారు. దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఆపన్నహస్తం అందించదలిస్తే 9676520586, 9493871077 నంబర్లలో సంప్రదించాలని కోరుతున్నారు. ఎస్‌బీఐ, ఎన్‌టీఆర్‌ సర్కిల్‌ అకౌంట్‌ నంబర్‌ 30757452216, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌..ఎస్‌బీఐఎన్‌0012727కు సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు