పుష్కర ఘాట్‌లో యువకుడి దుర్మరణం

18 Jul, 2015 00:40 IST|Sakshi

ఉమ్మిడివారిపాలెం (పెరవలి) : పుష్కర స్నానం ఆచరించేందుకు వెళ్లిన యువకుడు నీటమునిగి మరణించాడు. పెరవలి మండలం ఉమ్మిడివారిపాలెం తాత్కాలిక పుష్కర ఘాట్ వద్ద అదే గ్రామానికి చెందిన యువకుడు నడపన మురళీకృష్ణ(27) పుష్కర స్నానం చేసేందుకు ఉదయం సుమారు 9.30 గంటలకు స్నేహితులతోపాటు మేనత్త కుమారుడు ఉమ్మిడి పూర్ణయ్యతో కలిసి గోదావరిలో స్నానానికి దిగాడు. మురళీకృష్ణ ఊబిలోకి దిగబడి నీట మునిగాడు. పూర్ణయ్య కాపాడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అనంతరం అతను అధికారులకు తెలపడంతో వారు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి వెతుకులాట ప్రారంభించారు. 10.40 గంటలకు  మునిగిపోయిన మురళీ కృష్ణ 11.30 గంటల ప్రాంతంలో విగతజీవిగా లభ్యమయ్యాడు. పడవపై మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి తండ్రి, తల్లి, చెల్లెలు ఉన్నారు.
 
 నువ్వైనా బతుకు బావా..
 నువ్వయినా బతుకు బావా అంటూ తనను నెట్టేశాడని పూర్ణయ్య విలపిస్తూ చెప్పాడు. మురళీకృష్ణ  నీటమునగడం గమనించి అతడిని కొంతమేర లాక్కువచ్చానని తెలిపారు. నీటి ప్రవాహం వేగంగా ఉండడంతో కష్టమైందన్నాడు. ప్రవాహ వేగానికి మరింత ముందుకు వెళ్లిపోతున్నాడని చెప్పాడు. తాను అలసిపోతున్నానని గమనించిన మురళీకృష్ణ  నేనెలాగూ చనిపోతాను నువ్వు కూడా ఎందుకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటావు బావా నన్ను వదిలేయమని చెప్పి ముందుకు నెట్టివేశాడని బోరున విలపించాడు. మురళీకృష్ణ పూర్తిగా మునిగిపోవడంతో తాను వెంటనే ఒడ్డుకు  అధికారులను రక్షించమని వేడుకున్నానని చెప్పాడు.
 చావు కోసమే వచ్చావా నాన్నా...
 
 కుమారుడు మృతి చెందాడన్న వార్త తెలుసుకున్న అతని తండ్రి నర్సయ్య ఘటనా స్థలానికి పరుగున వచ్చాడు. చావు కోసమే బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చావా నాన్నా అంటూ కుమారుడి మృతదేహంపై పడి విలపిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. కొడుకు ఎంటెక్ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా బెంగళూరులోని మహీంద్రా టెక్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని, పుష్కరాల కోసం రెండు రోజుల క్రితమే వచ్చాడని నర్సయ్య వాపోయాడు. తన  కొడుకు చేతికి అందొచ్చి ఇంటి బాధ్యతలు మోస్తూ గోదావరిలో మునిగిపోయాడని విలపించాడు.
 
 ఘాట్ వద్ద రక్షణ లేదు
 పుష్కర ఘాట్ వద్ద పోలీస్, రెవెన్యూ యంత్రాంగం ఎవరినీ ఏర్పాటుచేయకపోవడంతో గ్రామస్తులే ఇక్కడ రేయింబవళ్లూ భక్తులకు అండగా ఉంటున్నారు. ఘాట్ అధికారిని నియమించారేకానీ ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని పలువురు ఆరోపిస్తున్నారు. పుష్కర ఘాట్‌కు అనుమతిస్తే పోలీసులు, ఇతర అధికారులను నియమించాల్సి ఉంది. ఓ నర్సు, పారిశుధ్య సిబ్బందిని మాత్రమే నియమించారని గ్రామస్తులే తెలిపారు. గ్రామస్తులే అన్నీ తామై ఇక్కడ ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది.
 

>
మరిన్ని వార్తలు