కరుణిస్తే.. అరుణోదయం

7 Jul, 2020 12:23 IST|Sakshi
చికిత్స పొందుతున్న అరుణ్‌కుమార్‌తో తల్లి లక్ష్మీనరసమ్మ

చిన్న కుటుంబం వారిది.. నిరుపేద కుటుంబమైనా తల్లిదండ్రులు, కుమారుడు ఎంతో సంతోషంగా ఉండేవారు.. తమ రెక్కల కష్టంతోఒక్కగానొక్క బిడ్డ అరుణ్‌కుమార్‌ను చదివిస్తున్నారు..  అతడు డిగ్రీలో చేరడంతో ఇక  కష్టాలు తీరడానికి ఎంతో కాలం పట్టదని భావించారు.భవిష్యత్తు బాగుంటుందని, కుమారుడు ప్రయోజకుడవుతాడనే ధైర్యంతో శక్తికి మించి కష్టపడుతున్నారు. అయితే కష్టాలన్నీ కట్టకట్టుకొనిఒక్కసారిగా వచ్చినట్లు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. కుమారుడికి సంబంధించిన గుండె పగిలే విషయం ఒకటి తల్లిదండ్రులకు తెలిసింది.కుమారుడికి రెండు కిడ్నీలు చెడిపోయాయని తెలియడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

ప్రొద్దుటూరు :జమ్మలమడుగులోని ఈడిగెపేటకు చెందిన లక్ష్మీనరసమ్మ, చక్రవర్తిల ఒక్కగానొక్క కుమారుడు అరుణ్‌కుమార్‌. అతను పట్టణంలోని శ్రీనివాస డిగ్రీ కాలేజీలో రెండో సంవత్సరం డిగ్రీ చదుతున్నాడు.  డిగ్రీ పూర్తి అయితే ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకుంటాననే ధైర్యం అతనిలో ఉండేది.  కుమారుడికి ఉద్యోగం వస్తే కష్టాలన్నీ గట్టెక్కుతాయని తల్లిదండ్రులు భావించారు. 

సంతోషం ఆవిరైన రోజు..
 మరో రెండు, మూడు రోజుల్లో లాక్‌డౌన్‌ విధిస్తారు. అప్పుడే తెలిసింది అరుణ్‌కుమార్‌కు రెండు కిడ్నీలు చెడిపోయాయని. సంతోషంగా ఉన్న ఆ కుటంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది.  కడప పెద్దాసుపత్రికి తీసుకెళ్లగా కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయని, వెంటనే ఆపరేషన్‌ నిర్వహించి డయాలసిస్‌ చేయాలని చెప్పారు. ఆపరేషన్‌కు సుమారు రూ. 4 లక్షలు దాకా ఖర్చు అవుతాయన్నారు. 

ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్‌ చేయిద్దామనుకుంటే..
 ఆపరేషన్‌ చేయించేందుకు కావలసిన ఆధార్, రేషన్‌కార్డు చూసుకోగా రెండింట్లో పేర్లు వేర్వేరుగా ఉన్నాయి. తెలిసిన వాళ్లకు చూపిస్తే రెండింట్లోనూ పేర్లు ఒకేలా ఉండాలని, వేర్వేరుగా ఉంటే ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పారు. పేరు సరిచేసుకుందామని ప్రయత్నం చేయగా లాక్‌డౌన్‌ కారణంగా మీ సేవా కేంద్రాలన్నీ మూత పడ్డాయి.   బిడ్డను బతికించుకునేందుకు బంధువులు, తెలిసిన వాళ్ల వద్ద అప్పు అడిగాడు. అరుణ్‌కుమార్‌ ధీనస్థితి చూసిన కొందరు డబ్బులిచ్చారు. అపరేషన్‌కు ఇంకొంత డబ్బు తక్కువ రావడంతో తన ఆటోను తాకట్టు పెట్టాడు. మార్చి 31 ఆపరేషన్‌ అయితే చేయించగలిగారు కానీ అంతటితో వారి కష్టాలు తీరలేదు. అరుణ్‌కుమార్‌కు ఆపరేషన్‌ చేసినా కిడ్నీలు పనికి రాలేదు. ఇక కిడ్నీలను మార్చడం ఒక్కటే మార్గమని వైద్యులు చెప్పారు. 

తల్లిదండ్రుల కిడ్నీలు సరిపోవని చెప్పారు
తల్లిదండ్రుల్లో ఒకరి కిడ్నీ అమర్చితే అరుణ్‌కుమార్‌ మామూలు మనిషి అవుతాడని వైద్యులు చెప్పారు.  తండ్రి చక్రవర్తికి గుండె జబ్బు, షుగర్‌ ఉండటం, తల్లి లక్ష్మినరసమ్మకు థైరాయిడ్‌ ఉండటంతో సరిపోవన్నారు. దీంతో వేరొకరి కిడ్నీపై ఆధార పడాల్సిన అగత్యం ఏర్పడింది. కిడ్నీ మార్పిడికి సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు.

ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు
కుమారుడికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేయించేందుకు చక్రవర్తి దంపతులు దేవుడిపైనే భారం వేశారు. దయార్ద్ర హృదయులు సాయం చేస్తే కుమారుడ్ని బతికించుకుంటామని వారు అంటున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న అరుణ్‌కుమార్‌ ఆపరేషన్‌కు ఆపన్న హస్తం అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. సాయం చేయాల్సిన వారు 7670859470, 9912944697  సెల్‌ నంబర్లకు ఫోన్‌ చేయాలన్నారు.

మరిన్ని వార్తలు