ఏదీ న్యాయం.!

31 Mar, 2016 03:51 IST|Sakshi
ఏదీ న్యాయం.!

గిరిజన యువతిని మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న యువకుడు
న్యాయం కోసం పోలీస్ సేషన్ల చుట్టూ కాళ్లరిగేలా
 తిరుగుతున్న బాధితురాలు
 

సాక్షి, విశాఖపట్నం : ‘పట్టుకుంటామమ్మా... తొందరపడితే ఎలా... వాడు పారిపోయాడు... నీకేమైనా వాడి ఆచూకీ తెలిస్తే చెప్పు వెళ్లి తీసుకు వస్తాం...’ ఇవీ ఒక యువకుడి చేతిలో ప్రేమ పేరుతో మోసపోయిన గిరిజన యువతితో బాధ్యత గల పోలీసులు అంటున్న మాటలు. నేను అనాథనని, తనకు ఎవరూ తోడు లేరని, మిమ్మల్నే నమ్ముకున్నానని ఆ యువతి ఎంతగా ప్రాధేయపడుతున్నా ఖాకీల్లో కదలిక రావడం లేదు. వివరాల్లోకి వెళ్తే... విశాఖ ఏజెన్సీ నర్సీపట్నం ప్రాంతం నుంచి నగరానికి వచ్చి హాస్టల్‌లో ఉంటూ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న మధులత అనే యువతి తనతో పాటు పనిచేసే నారాయణరావు తనను ప్రేమించి వంచించాడని కొద్ది రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

అయితే ఇప్పటికే ఆమె పోలీసులను ఆశ్రయించి పదిహేను రోజులు కావస్తున్నా ఇంత వరకూ నిందితుడిని పట్టుకోలేదు సరి కదా కనీసం ఆ అభాగ్యురాలికి భరోసా కూడా ఇవ్వలేకపోతున్నారు. అనాథ గిరిజన యువతికి ఇలాంటి కష్టం వచ్చిందని తెలిసినా ఇంత వరకూ ఏ మహిళా సంఘాలూ ఆమె తరఫున నిలబడి న్యాయం కోసం పోరాడేందుకు ముందుకు రాలేదు. గిరిజన సంఘాల నేతలు వచ్చి ఒకటి రెండు సార్లు పోలీసు అధికారులను కలవడం తప్ప ఇంత వరకూ పెద్దగా ఉద్యమించింది లేదు.

ఈ పరిస్థితుల్లో తనకు న్యాయం జరగదని, విసిగి వేసారిపోయిన బాధితురాలు ఆత్మహత్యే శరణ్యమంటూ రోధిస్తోంది. ఈ విషయాన్ని ఏసీపీ బి.మోహన్‌రావు వద్ద ప్రస్తావించగా గిరిజన యువతి మధులత కేసులో విచారణ పూర్తయిందని తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని తండ్రిని విచారించామని చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేయాల్సి ఉందని తెలిపారు.
 
 ఆత్మహత్యే శరణ్యం
 ‘‘పోలీసులంటే ఎంతో నమ్మకం. వాళ్ల దగ్గరకు వెళ్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అనుకున్నాను. కానీ ఇన్ని రోజులైనా ఆ దుర్మార్గుడిని పట్టుకోలేదు. ఇప్పటికే చాలా సార్లు ఏసీపీ సర్‌ని కలిశాను. వైద్య పరీక్షల కోసం మూడు రోజులు కేజీహెచ్‌లో ఉంచారు. రోజూ నన్ను స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు తప్ప అతనిపై చర్యలు తీసుకోవడం లేదు. అడిగితే పారిపోయాడంటున్నారు. నీకు టచ్‌లోకి వస్తే మాకు చెప్పు అంటున్నారు. నన్ను మోసం చేసి పోయిన వ్యక్తిని ఎవరూ లేని నేను ఎలా వెతికి తేగలను. ఇప్పటికే జరిగిన అనర్థానికి కుమిలిపోతున్నాను. న్యాయయం జరగకపోతే చచ్చిపోతాను.’- మధులత, బాధితురాలు

మరిన్ని వార్తలు