అత్యుత్తమ వైద్యంతో కరోనాను జయించా..

12 Apr, 2020 08:59 IST|Sakshi
కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్తున్న యువకుడు (ఫైల్‌)

నా వల్ల ఏ ఒక్కరికీ వైరస్‌ సోకకపోవడం ఆనందంగా ఉంది 

కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ఒంగోలు జీజీహెచ్‌లో వైద్యం అందించారు 

క్వారంటైన్‌ కేంద్రాలకు వెళ్లడానికి భయపడాల్సిన పనిలేదు 

మన వల్ల మన కుటుంబం, సమాజం ఇబ్బందిపడకుండా పరీక్షలు చేయించుకోవాలి 

వైద్యులు, సమాజం నన్ను ఆదరించిన తీరు ఎంతో ఆనందాన్నిచ్చింది 

కరోనాను జయించిన ఒంగోలు యువకుని మనోగతం

సాక్షి, ఒంగోలు: నా వల్ల ఏ ఒక్కరికీ కరోనా వైరస్‌ సోకకపోవడం ఎంతో ఆనందంగా ఉంది. కరోనా లక్షణాలున్న ప్రతి ఒక్కరూ నాలాగే క్వారంటైన్‌ కేంద్రాలకు వెళ్లి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజానికి మంచి చేసిన వారవుతారనేది నా అభిప్రాయం. నాకు వ్యాధి లక్షణాలు కన్పించగానే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందడం వల్ల కరోనా బారి నుంచి నేను బయటపడటంతో పాటు నా కుటుంబ సభ్యులు, మిత్రులు ఎవ్వరూ దీని బారిన పడకుండా చూడగలిగాననే ఆత్మ సంతృప్తి నాకు కలిగిందంటూ ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి పాజిటివ్‌ వచ్చిన ఒంగోలు నగరానికి చెందిన 23 ఏళ్ల యువకుడు ‘సాక్షి’తో తన మనోగతాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఆయన మాటల్లోనే.. 

ప్ర: వ్యాధి లక్షణాలను మీరు ఏ విధంగా గుర్తించారు? 
స: నేను లండన్‌ నుంచి గత నెల 15వ తేదీన ఒంగోలుకు వచ్చాను. 17వ తేదీన నాకు జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపించడంతో వెంటనే జిల్లా అధికారులకు సమాచారం అందించి ఒంగోలు జీజీహెచ్‌లోని ఐసోలేషన్‌ వార్డులో చేరాను. 18వ తేదీన నాకు కరోనా పాజిటివ్‌ అని వైద్యులు నిర్ధారించారు. మొదట్లో కొంత భయాందోళనకు గురయ్యాను. అయితే నా కుటుంబ సభ్యులు, స్నేహితులకు నెగిటివ్‌గా రిపోర్టులు రావడంతో ఊపిరి పీల్చుకున్నాను.  చదవండి: జిల్లాలో మరో 5కేసులు; లాక్‌డౌన్‌ కట్టుదిట్టం 

ప్ర: జీజీహెచ్‌లో వైద్యం ఎలా ఉంది? 
స: ఒంగోలు జీజీహెచ్‌లో వైద్యులు ఎంతో సహనంతో వైద్య సేవలందిస్తున్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా వైద్య చికిత్స అందిస్తూనే ప్రతిరోజూ మానసిక వైద్యులు సైతం నాకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తూ డిప్రెషన్‌కు గురవ్వకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. మంచి పౌష్టికాహారం అందించారు. ఒకవేళ నేను లండన్‌లో ఆస్పత్రిలో చేరివుంటే ఈ స్థాయిలో వైద్యసేవలు ఉండేవి కావు.  

ప్ర: కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎలా ఉన్నాయి ? 
స: లాక్‌డౌన్‌ ప్రకటించి ప్రజలంతా భౌతిక దూరం పాటించేలా చూడటం, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి కరోనా అనుమానితులను క్వారంటైన్‌లకు తరలిస్తూ పరీక్షలు నిర్వహించేలా చేయడంలో ప్రభుత్వం సఫలీకృతమవుతోంది. క్వారంటైన్, ఐసోలేషన్‌ వార్డుల్లో సౌకర్యాలు చాలా బాగున్నాయి. ప్రభుత్వ వైద్యులు స్పందిస్తున్న తీరు చాలా బాగుంది. అధికారులు, వైద్యులు నిరంతరం శ్రమిస్తున్నారు. 

ప్ర: కరోనా లక్షణాలుండి ఆస్పత్రిలో చేరేందుకు భయపడే వారికి మీరిచ్చే సూచనలు ఏంటి? 
స: కరోనా లక్షణాలున్న వారు ఎటువంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. మీ దగ్గరలో ఉన్న క్వారంటైన్‌ కేంద్రంలో చేరి వైద్య పరీక్షలు చేయించుకుంటే మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో పాటు సమాజానికి మేలు చేసిన వారవుతారు.  
 
ప్ర: అధికారులు, వైద్యులు మీ పట్ల ఏ విధంగా వ్యవహరించారు? 
స: నాకు కరోనా పాజిటివ్‌ అని తెలియగానే కలెక్టర్‌ పోలా భాస్కర్‌ నేను ఎవరెవరిని కలిశాను అనే వివరాలను పూర్తిగా తెలుసుకుని వారందరినీ క్వారంటైన్‌కు తరలించడంతో పాటు నాకు మనోధైర్యాన్ని కల్పించారు. నేను జీజీహెచ్‌లో ఉన్నన్ని రోజులు వైద్యులు నా పట్ల ఎంతో శ్రద్ధ చూపారు. నేను కరోనాను జయించి డిశ్చార్జ్‌ అయ్యే సమయంలో సైతం చప్పట్లు కొడుతూ వారు నన్ను సాగనంపిన తీరు ఎప్పటికీ మరువలేను. చదవండి: బయటకొచ్చినందునే బతికిపోయారు

మరిన్ని వార్తలు