యువ సారథులు; అందరూ 35 ఏళ్లలోపు వారే

2 Jun, 2020 09:01 IST|Sakshi

జిల్లాలో యువ అధికారులు 

పాలనలో తమదైన శైలితో రాణిస్తున్న వైనం 

జిల్లా సమగ్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

సాక్షి, అనంతపురం‌: నలుగురు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్, ఒక ఐఎఫ్‌ఎస్‌.. అందరూ 35 ఏళ్ల లోపు వయసున్న వారే. కేవలం జీతం కోసం కాకుండా వృత్తిధర్మాన్ని చాటేలా తమ విధులను నిర్వర్తిస్తూ.. జిల్లాను అభివృద్ధి పథంలో పరుగులు తీయించేందుకు వీరంతా శ్రమిస్తున్నారు. కలెక్టర్‌గా గంధం చంద్రుడు.. జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా.. పాలనలో తనదైన ప్రత్యేకత కనిపించేలా విధులు నిర్వర్తిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు... రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన దిశగా జాయింట్‌ కలెక్టర్‌ నిశాంతకుమార్,  సచివాలయ సేవలు ప్రజల ముంగిటకే చేర్చే దిశగా మరో జాయింట్‌ కలెక్టర్‌ ఎ.సిరి, అటవీ సంరక్షణ, అటవీ భూముల పరిరక్షణ లక్ష్యంగా డీఎఫ్‌ఓ జగన్నాథ్‌ సింగ్,  పెనుకొండ రెవెన్యూ డివిజన్‌ను అభివృద్ధి పథంలో నడిపించడమే ధ్యేయంగా సబ్‌ కలెక్టర్‌ నిషాంతి.. ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వీరి బృహత్‌ చర్యల వల్ల రాష్ట్రంలోనే ‘అనంత’ జిల్లా ప్రత్యేకతను చాటుకుంటోంది.  

అభివృద్ధి.. సంక్షేమం రెండు కళ్లు  
ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా జిల్లాను అభివృద్ధి బాటలో నడిపించే దిశగా కలెక్టర్‌ గంధం చంద్రుడు తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.  
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా తన విధులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. 
అంశాల వారీగా అధికారులతో సమీక్షిస్తూ.. తగిన కార్యాచరణతో జిల్లాను అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు.  
ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పనులు కల్పించడంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు.  
జిల్లాలో 5 లక్షల మంది కూలీలకు పనులు కల్పించడాన్ని లక్ష్యంగా నిర్ధేశించుకుని, ఇప్పటి వరకూ 3.77 లక్షల మందికి ఉపాధి పనులు కల్పించారు. ఈ నెలాఖరులోగా లక్ష్యం పూర్తి చేసే దిశగా సంబంధిత అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు.  
సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు మెరుగుపరచడం, సచివాలయ వ్యవస్థ ద్వారా సేవలు ప్రజలకు అందించడం లక్ష్యంగా అధికారులను నడిపించడం... ప్రతి సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా ప్రజలకు చేరువ చేయడంలో కలెక్టర్‌ వ్యవహరిస్తున్న తీరుపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

శాంతిభద్రతలే ఊపిరిగా..  -సత్యయేసుబాబు, ఎస్పీ 
శాంతి భద్రతల అదుపులో ఉన్నపుడే ప్రజలకు సంపూర్ణ రక్షణ ఉంటుందని బలంగా విశ్వసించే పోలీస్‌ ఉన్నత స్థాయి అధికారి ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు.   
ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, రాజకీయ గొడవలు చోటు చేసుకోలేదు.  
విధుల పట్ల ఆయన తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉన్నా.. ప్రజల ధన, మాన, ప్రాణ సంరక్షణలో అవి ఎంతో కీలకంగా మారాయి.  
కేవలం ప్రజలే కాకుండా శాఖలోని ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా ఆలోచిస్తూ.. పోలీసు ఉద్యోగుల మంచీచెడులకు అధిక ప్రాధాన్యతనిస్తుంటారు.  
ప్రతి వారం గ్రీవెన్స్‌ ఏర్పాటు చేస్తూ, తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు తక్షణ పరిష్కారం చూపించారు.  
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు.  
జిల్లాలో మట్కాను కూకటివేళ్లతో పెకలించేందుకు కఠినంగా వ్యవహరించారు.  
పోలీసు శాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.  
కానిస్టేబుళ్ల బదిలీల విషయంలో విమర్శలకు తావివ్వకుండా కౌన్సిలింగ్‌ ద్వారా నిర్వహించారు. ఎస్‌ఐల బదిలీ విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరించారు.  

వ్యవస్థ ప్రక్షాళన దిశగా -నిశాంత్‌కుమార్, జేసీ
ప్రజలకు సత్వర మెరుగైన సేవలు అందించడం,  సమస్యలకు నాణ్యమైన పరిష్కారాన్ని చూపేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తా’ అంటూ పేర్కొనే నిశాంత్‌కుమార్‌... ఈ నెల 14న జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 
జిల్లాలో రైతు భరోసా, రెవెన్యూ (ఆర్‌బీ అండ్‌ ఆర్‌), ఇతర విభాగాలను ఆయనకు కేటాయించారు.  
నూతనంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జిల్లాలో అస్తవ్యస్తంగా ఉన్న రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా చర్యలు చేపట్టారు.  
రెవెన్యూ అంశాల్లోని లోపాలను సరిదిద్ది, సాంకేతిక పరిజ్ఞానం జోడించి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే దిశగా సాహసోపేత నిర్ణయాలతో ముందుకు పోతున్నారు.  
ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అందుకు తగినట్లుగా కార్యాచరణను రూపొందించుకుని అమలు చేస్తున్నారు.  
రెవెన్యూ ఒక్కటే కాకుండా.. తనకు అప్పగించిన గ్రామీణాభివృద్ధి, మహిళ శిశు సంక్షేమం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలు, పరిశ్రమలు, దేవాదాయ, నైపుణ్యాభివృద్ధి విభాగాలపైన కూడా ప్రత్యేక దృష్టి సారించారు.  

పారదర్శకతకు పెద్దపీట - ఎ.సిరి, జాయింట్‌ కలెక్టర్
‘ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల సంక్షేమ ఫలాలు చిట్టచివరి‡ అర్హుడికి చేరాలి. అప్పుడే ప్రభుత్వ ఉద్ధేశం నెరవేరుతుంది. సచివాలయాల ద్వారా ప్రభు త్వ సేవలు ప్రజల ముగింటకే అందించే దిశగా చర్యలు చేపట్టాం’ అపి అంటున్న అట్టాడ సిరి... జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా ఈ నెల 24న బాధ్యతలు స్వీకరించారు.  
గ్రామ/వార్డు సచివాలయలు, అభివృద్ధి (వీడబ్ల్యూఎస్‌డీ) విభాగాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.   
సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హుల దరిచేర్చడంలో పారదర్శకత ఉండేలా తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.  
గ్రామ, వార్డు సచివాలయల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలపై ఇప్పటికే జెడ్పీ సీఈఓ, డీపీఓ, మున్సిపల్‌ కమిషనర్లతో నివేదికలు తెప్పించుకుని, అందులో లోటుపాట్ల గుర్తింపు, వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. 
ప్రభుత్వ పథకాలను అర్హుల దరిచేర్చేందుకు ఎప్పటికప్పుడు సమీక్షలతో ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకుని ముందుకు పోతున్నారు.  
తనకు అప్పగించిన ఇతర బాధ్యతలపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు.  

రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు -టి.నిషాంతి, సబ్‌కలెక్టర్‌
‘ప్రజలకు మెరుగైన సేవలు సత్వరం అందించడం అందరి లక్ష్యం. మన పరిసరాలు పరిశుభ్రంగా ఆకట్టుకునేలా ఉండాలనే ఉద్ధేశంతో ప్రహరీలపై చిత్రాలు వేయించా. పిల్లల నవ్వుల ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు లలితకళల్లో శిక్షణ ఇప్పిస్తున్నాం. తురకలాపట్నం జెడ్పీ ఉన్నత పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను’ అని చెబుతున్న నిషాంతి... పెనుకొండ సబ్‌కలెక్టర్‌గా గత ఏడాది సెపె్టంబర్‌లో బాధ్యతలు చేపట్టారు.  
కార్యాలయంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిచ్చారు.
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ప్రజాసమస్యల దస్త్రాలను ఆగమేఘాలపై పరిష్కరించారు.  
నిషాంతి పనితీరు వల్ల ఫైల్‌ క్లియరెన్స్‌లో రాష్ట్రస్థాయిలో పెనుకొండ సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఉత్తమ అవార్డు అందుకుంది.  
 ప్రహరీలపై ప్రభుత్వ పథకాలను చిత్రీకరించడం ద్వారా ప్రజలను చైతన్య పరిచారు.  
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కియా పరిశ్రమ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. విద్యార్హతకు తగిన ఉద్యోగాలను నిరుద్యోగ యువతకు ఇప్పించారు.  
కరోనా ప్రభావిత హిందూపురంలో వైరస్‌ నియంత్రణకు రేయింబవళ్లూ శ్రమిస్తున్నారు.  

అటవీ సంపద రక్షణలో..  - జగన్నాథ్‌సింగ్, డీఎఫ్‌ఓ
‘పచ్చదనం కాపాడినప్పుడే మానవ మనుగడ ఉంటుంది. అటవీ భూముల పరిరక్షణ, అడవుల సంరక్షణ, వన్యప్రాణుల రక్షణపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం’ అని అంటున్న జిల్లా అటవీశాఖ అధికారి జగన్నాథ్‌సింగ్‌ ఆ దిశగా పయనిస్తున్నారు. 
అటవీ సంరక్షణ, అటవీ భూముల పరిరక్షణ లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోవడమే కాక, వాటిని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు.  
గార్లదిన్నె, మరుట్ల, పెనకచర్ల డ్యామ్‌  ప్రాంతాల్లో అన్యాక్రాంతమైన 310 ఎకరాల అటవీ భూములను తాను బాధ్యతలు స్వీకరించిన అతి కొద్ది రోజుల్లోనే స్వాధీనం చేసుకున్నారు.  
అక్రమణలకు గురైన మరో 400 ఎకరాలు అటవీ భూములను స్వాదీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టారు.  
అటవీ భూముల ఆక్రమణలను నియంత్రించే దిశగా కఠినంగా వ్యవహరిస్తూ జిల్లాలో పూర్తి స్థాయిలో పచ్చదనం నెలకొల్పేందుకు శ్రమిస్తున్నారు.  
వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోతున్నారు.  
అడవులు అగ్నికి ఆహుతి కాకుండా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా ఈ వేసవిలో అటవీ ప్రాంతాల్లో అగి్నప్రమాదాలు కట్టడి చేయగలిగారు.   

మరిన్ని వార్తలు