ఓటుకు ఆధార్‌ లింక్‌ చేస్తామంటూ..

9 Nov, 2018 12:25 IST|Sakshi
ఓటర్ల జాబితాల పరిశీలనకు వచ్చిన యువకులు

అక్కపాలెం గ్రామస్తులను మభ్యపెట్టేందుకు యత్నించిన యువకులు

ఎవరు పంపారని నిలదీసి,     అనుమానంతో పోలీసులకు అప్పగింత

కృష్ణాజిల్లా, అక్కపాలెం (తిరువూరు రూరల్‌) : ఓటర్ల జాబితా పరిశీలన నిమిత్తం వచ్చామంటూ కొందరు యువకులు మండలంలోని అక్కపాలెంలో రెండు రోజులుగా హడావుడి చేస్తున్నారు. తాము రెవెన్యూ కార్యాలయం నుంచి వచ్చామని, ఓటరు గుర్తింపు కార్డులు పరిశీలించి ఓటు హక్కు కొనసాగింపునకు సిఫారసు చేస్తామని చెబుతుండటంతో స్థానికులు అనుమానించి తహసీల్దార్‌ కార్యాలయ అధికారుల్ని సంప్రదించారు. తాము ఓటర్ల జాబితా పరిశీలన విధులకు ఎవరినీ పంపలేదని, మోసపూరిత వ్యక్తుల్ని నమ్మవద్దని అధికారులు చెప్పారు. గ్రామ రెవెన్యూ అధికారి లేదా బీఎల్‌వోగా వ్యవహరించే అంగన్‌వాడీ కార్యకర్త మాత్రమే ఓటరు దరఖాస్తుల పరిశీలనకు వస్తారని రెవెన్యూ కార్యాలయ అధికారులు చెప్పడంతో గ్రామస్తులు ఆ యువకుల్ని నిలదీశారు. వారిని తిరువూరు పోలీసు స్టేషన్లో అప్పగించినట్లు అక్కపాలెం గ్రామస్తులు తెలిపారు.

మందలించి పంపేశాం..
దీనిపై ఎస్‌ఐ మోహనరావును వివరణ కోరగా గ్రామస్తుల నుంచి సమాచారం అందడంతో వెళ్లి సంబంధిత యువకులను స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించామని చెప్పారు. ఓటుకు ఆధార్, సెల్‌ఫోన్‌ లింక్‌ చేయించాలంటూ తమను అధికార పార్టీ బూత్‌ కమిటీ పంపిందని వారు చెప్పారని తెలిపారు. అయితే, గ్రామస్తుల అంగీకారం లేకుండా అలాంటి పనులు చేయకూడదని మందలించి పంపించేశామని చెప్పారు. 

మరిన్ని వార్తలు