స్వచ్ఛ కర్నూలే లక్ష్యం!

30 Nov, 2014 03:52 IST|Sakshi

సుందర నగరంగా కర్నూలును తీర్చిదిద్దారాయన. నగరంలోని ప్రధాన కూడళ్లలో వాటర్ ఫౌంటేన్‌లు, రహదారుల మధ్యలో డివైడర్లు, వాటి మధ్య అందమైన పూల మొక్కలు, గోడలకు అందమైన బొమ్మలు.. ఇలా నగరానికి ఓ సరికొత్త రూపును తీసుకొచ్చారు. పరిపాలనలో పారదర్శకత.. ఆధునిక సాంకేతిక వినియోగంతో నగరాభివృద్ధికి కృషి చేశారు.

పాలనలో సంస్కరణలు చేపట్టి కార్పొరేషన్‌కు ఆదాయాన్ని సమకూర్చిపెట్టారు. తన కార్యాలయం నుంచే విద్యుత్ పొదుపుకు శ్రీకారం చుట్టారు. రూ. 12 కోట్ల ఆధునిక టాయిలెట్లు, పీపీపీ విధానంలో సులభ్ కాంప్లెక్స్‌లు నిర్మించారు. నగరంలో 8 చోట్ల బయో టాయిలెట్లను ఏర్పాటు చేశారు.

రూ. 40 లక్షలు వెచ్చించి 10 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపట్టారు. అలాగే మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను చూడలేక కోటి రూపాయలు వెచ్చించి మున్సిపల్ పాఠశాలల్లో బెంచీలు ఏర్పాటు చేసి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారు.

ఎస్‌ఎస్‌ఏ సహకారంతో 100 అదనపు తరగతుల నిర్మాణం, ఉన్నత పాఠశాలల్లో టాయ్‌లెట్లు, బాత్‌రూమ్‌ల నిర్మాణం చేశారు. కార్పొరేషన్‌కు సంబంధించిన ఖాళీ స్థలాలను గుర్తించి అవి అన్యాక్రాంతం గాకుండా పక్కాగా జాగ్రత్తలు తీసుకున్నారు. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌ల అద్దె చెల్లింపులకు ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. చెత్తను తీసుకెళ్లే వాహనాల పర్యవేక్షణకు వెహికల్ ట్రాకింగ్ విదానం ప్రవేశపెట్టి ఖర్చును తగ్గించారు.

ట్రాఫిక్ నియంత్రణకు సెంట్రల్ లైటింగ్‌తో కూడిన డివైడర్ల ఏర్పాటు, మద్యం తాగి డ్రైవింగ్ చేసే వారి ఆటకట్టించే బ్రీత్ అనలైజర్లను కొనుగోలు చేసి పోలీసుల శాఖకు అందజేశారు. కర్నూలు కమిషనర్‌గా ఇటీవల మూడేళ్లు పూర్తి చేసుకున్న పీవీవీఎస్ మూర్తి నగరంలోని మున్సిపల్ పాఠశాలల్లో సమస్యలను తెలుసుకునేందుకు ‘సాక్షి’ తరపున వీఐపీ రిపోర్టర్‌గా మారారు.

ఇందిరాగాంధీ స్మారక నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలకు వెళ్లి విద్యార్థులు, ఉపాధ్యాయులు, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. వారు వెల్లడించిన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నగరాన్ని స్వచ్ఛ కర్నూలుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానన్నారు.

 కమిషనర్ : నమస్కారమండీ.. నా పేరు పీవీవీఎస్ మూర్తి. కర్నూలు కార్పొరేషన్ కమిషనర్‌ను. నగరపాలక సంస్థ పాఠశాలల స్థితిగతులు తెలుసుకోవడానికి వచ్చాను. హెచ్‌ఎం గారూ... మీ పాఠశాల ఎలా ఉంది. మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారు, మీ పాఠశాలలో ఏవైనా సమస్యలున్నాయా..?
 హెచ్‌ఎం : మా పాఠశాలలో ప్రైమరీ, హైస్కూల్ కలిపి దాదాపు 1600 మంది విద్యార్థులు చదువుతున్నారు. మున్సిపల్ స్కూళ్లల్లో ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాల ఇదే. ఈ పాఠశాలలో సమస్యలు కూడా చాలానే ఉండేవి. అయితే కార్పొరేషన్ అధికారుల చొరవతో ఒక్కో సమస్య పరిష్కారమైంది. పాఠశాలలో విద్యార్థులకు టాయ్‌లెట్స్, తాగు నీరు కల్పించారు.

ఆడుకోవడానికి వీలుగా మైదానాన్ని చదును చేయించారు. పాఠశాలలో పచ్చదనం పెంపొందించేందుకు డాక్టర్ తిరుపాల్‌రెడ్డి సహకారంతో మొక్కలు కూడా పెంచడంతో పాఠశాల ఆహ్లాదంగా ఉంది. మున్సిపల్ గ్రాంట్స్‌ను సక్రమంగా ఉపయోగించుకుంటూ మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. పిల్లలకు టీవీలో డాక్యుమెంటరీ కూడా చూపిస్తున్నాం.

అర్హులైన ఉపాధ్యాయులుండటం, సమిష్టిగా అందరూ పనిచేయడం వల్ల 80 శాతం పైగా ఫలితాలు సాధిస్తున్నాం. చుట్టుపక్కల ఉన్న చిన్నచిన్న ప్రైవేటు పాఠశాలల్లో మానేసి మా బడికి విద్యార్థులు వస్తున్నారు. పాఠశాలల వేళలు పెంచాలి. అప్పుడు మరిన్ని విజయాలు సాధించి తీరుతాము.

 కమిషనర్ : ఓకే.. మీరు మీ పాఠశాల గురించి బాగా చెబుతున్నారు. అది నిజమో కాదో మీ విద్యార్థులను అడిగి తెలుసుకుందాం.. ఏమ్మా(10వ తరగతి విద్యార్థినితో) మీ పాఠశాల ఎలా ఉంది. రెండేళ్ల నుంచి ఏమైనా మార్పులు వచ్చాయా..?
 విద్యార్థిని : సార్ నేను బి సెక్షన్‌లో చదువుతున్నా. క్లాసులు బాగా నడుస్తున్నాయి. సారు వాళ్లు బాగా వస్తున్నారు. చదువు బాగా చెబుతున్నారు. పాఠశాలలో మొక్కలు పెంచడం వల్ల పచ్చదనం కారణంగా ప్రశాంత వాతావరణం ఉంది.
 కమిషనర్ : పాఠశాలలో ఆడపిల్లలకు సౌకర్యాలు ఎలా ఉన్నాయి?
 విద్యార్థిని : గతంలో ఈ పాఠశాలలో విద్యార్థినిలకు బాత్‌రూంలు సరిగ్గా ఉండేవి కావు. బాత్‌రూంలు శుభ్రం చేసేవారు కాదు. దీనికితోడు నీళ్లు కూడా సరిగ్గా వచ్చేవి కాదు. ఇప్పుడు ఆ సమస్య తీరింది. తాగడానికి ఇక్కడే మంచినీరు లభిస్తోంది.
 కమిషనర్ : మరో విద్యార్థినితో.. ఏమ్మా నీ పేరేమిటి?
 విద్యార్థిని : నా పేరు సుంకులమ్మ సార్.
 కమిషనర్ : మీ పాఠశాలలో చదువెలా చెబుతున్నారు?
 సుంకులమ్మ : సారు వాళ్లు బాగా చెబుతున్నారు. ట్యూషన్స్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే సాయంత్రం పూట స్టడీ అవర్స్ చెబుతున్నారు. సాయంత్రం వేళ చీకటి లేకుండా లైట్లు, ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేశారు.
 కమిషనర్ : పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఎలా ఉంది, మెనూ ఏం ఇస్తున్నారు..?
 విద్యార్థిని : భోజనం బాగుంది. రోజూ అన్నం, సాంబారు, కర్రీ వడ్డిస్తున్నారు. మంగళ, శుక్రవారాల్లో గుడ్డు, పండు ఇస్తున్నారు.
 (మధ్యలో ఓ విద్యార్థిని కల్పించుకుంటూ...)
 విద్యార్థిని : సార్! పాఠశాలలో స్పీపర్ లేకపోవడం వల్ల ఇబ్బంది ఉంది. ఒక్కోసారి మేమే క్లాస్‌రూమ్‌లు శుభ్రం చేసుకోవాల్సి వస్తోంది. స్వీపర్‌ను నియమిస్తే బాగుంటుంది.
 హెచ్‌ఎం : సార్ మేమే ఒక స్వీపర్‌ను కాంట్రిబ్యూషన్ కింద నియమించుకున్నాం. ఆమె ఒక్కసారి వచ్చి ఊడ్చి వెళుతుంది. ఇంత పెద్ద పాఠశాలకు ఒకరు సరిపోరు.
 కమిషనర్ : నిజమే.. ఈ సమస్య అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో  ఉంది. మధ్యాహ్న భోజనం గురించి పిల్లలు బాగా చెబుతున్నారు. వారు చెబుతున్నది నిజమా కాదా.. వెళ్లి పరిశీలిద్దాం (మధ్యాహ్న భోజనం వండే ప్రాంతానికి వెళ్తూ)
 కమిషనర్ : ఏమ్మా ఇక్కడ ఎవరు వంట ఏజెన్సీ వారు. ఈ రోజు ఏఏ వంటలు వండుతున్నారు. పిల్లలకు ఏమి భోజనం పెడుతున్నారు?
 ఏజెన్సీ నిర్వాహకురాలు : సార్ ఈ రోజు అన్నం, పప్పు, కర్రి వండుతున్నాం. భోజనం ఎలాగుందో రోజూ సారోళ్లు వచ్చి చెక్ చేసి వెళుతున్నారు.
 కమిషనర్ : కట్టెల పొయ్యిలో వండుతున్నారే. మీకు గ్యాస్ కనెక్షన్ లేదా? పైగా తడకలతో షెడ్డు వేసుకున్నట్లు ఉన్నారు. షెడ్డు కట్టించలేదా?
 ఏజెన్సీ నిర్వాహకురాలు : అవును సార్. తడకలతో మేమే మా డబ్బులతో షెడ్డు ఏర్పాటు చేసుకున్నాము. గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తే వంట దానిపైనే చేస్తాం.
 (పాఠశాల టీచర్ల వద్దకు మున్సిపల్ కమిషనర్ వెళ్తూ...)
 కమిషనర్ : మీ పాఠశాల ఎలా ఉంది. ఏమైనా సమస్యలున్నాయా? పిల్లలకు ఎలా బోధిస్తున్నారు?
 ఉపాధ్యాయులు : మున్సిపల్ పాఠశాలలో పిల్లలు బెంచీలపై కూర్చుంటారనే విషయం ఊహకందని విషయం. కానీ కమిషనర్ ఆ భాగ్యం కల్పించారు. పాఠశాలలోని అన్ని సెక్షన్లకూ బెంచీలు వేయించారు. వసతులు, సౌకర్యాలు బాగుండటంతో మేము కూడా అంతే ఉత్సాహంగా పిల్లలకు బోధిస్తున్నాము. అన్ని సబ్జక్టుల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. దాతలు ఇచ్చే స్టడీ మెటీరియల్ కూడా విద్యార్థులకు బాగా ఉపయోగపడుతోంది. అయితే పాఠశాలలో స్వీపర్, నైట్ వాచ్‌మెన్, అటెండర్లను నియమిస్తే బాగుంటుంది.
 కమిషనర్ : పిల్లలు ఎలా చదువుతున్నారో వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకుందాం. ఏమయ్యా నీ పేరేంటి.. మీ పిల్లలు ఎలా చదువుతున్నారు.
 విద్యార్థిని తండ్రి : సార్.. నా పేరు దాసు, నాకు నలుగురు కూతుళ్లు. అందరూ ఇదే పాఠశాలలో చదివారు. ఒకమ్మాయి డిగ్రీ కూడా పూర్తి చేసింది. గతంలో కంటే ఇప్పుడు మంచి సౌకర్యాలు ఉన్నాయి. ట్యూషన్ అవసరం లేకుండా సాయంత్రం 7 గంటల వరకు టీచర్లు బోధిస్తున్నారు.
 కమిషనర్ : చదువుతో పాటు ఇక్కడ ఆటలు కూడా ఆడిస్తున్నట్లున్నారు. ఏమండీ పీఈటీ గారూ.. విద్యార్థులకు ఏఏ ఆటలు ఆడిస్తున్నారు?
 పీఈటీ : సార్.. నా పేరు కమాల్‌బాషా, మా పాఠశాలలో విద్యార్థులకు హ్యాండ్‌బాల్, టెన్నికాయిట్, కబడ్డీ ఆటలు ఆడిస్తున్నాము. ఇటీవల జోనల్ క్రీడల్లో బాల్‌బాడ్మింటన్ , హ్యాండ్‌బాల్‌లో మా విద్యార్థులు విజేతలుగా నిలిచారు. బాస్కెట్‌బాల్‌లో రన్నర్స్‌గా వచ్చారు. గతంలో జరిగిన జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లోనూ విజయం సాధించారు.
 కమిషనర్ : క్రీడలు చాలా నేర్పిస్తున్నామని చెబుతున్నారు. నిజమో కాదో విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. ఏమ్మా మీ పాఠశాలలో సారు వాళ్లు మీకు ఆటలు నేర్పిస్తున్నారా.. లేక మీరే నేర్చుకుంటున్నారా?
 విద్యార్థిని : లేదు సార్.. సార్ వాళ్లే మాకు క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. నేను కంభంలో జరిగిన హ్యాండ్‌బాల్ పోటీలకు వెళ్లి థర్డ్ ప్లేస్ సాధించాను. రెండు సంవత్సరాలుగా క్రీడాకారులకు మెటీరియల్, డ్రస్సులు కూడా అందిస్తున్నారు.
 కమిషనర్ : ఇక్కడే పారిశుద్ధ్య సిబ్బంది కనిపిస్తున్నారు. వారితో మాట్లాడదాం. ఏమ్మా మీరు ఏ సమయంలో పనిచేస్తున్నారు. ఎలా పనిచేస్తున్నారు. మీకేమైనా సమస్యలున్నాయా?
 పారిశుద్ధ్య కార్మికులు : సార్.. మేము ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచి 10.30 గంటల వరకు నగరాన్ని శుభ్రం చేస్తున్నాము. అయితే మాకు మూడు నెలలుగా జీతాలు రావడం లేదు. పొరకలు, గంపలు, పారలు, బండ్లు సమకూరిస్తే బాగుంటుంది.
 (అనంతరం పాఠశాలలో టాయ్‌లెట్స్, తాగునీటి సరఫరాను కమిషనర్ పరిశీలించారు.)
 అనంతరం సాయంత్రం చిల్డ్రన్స్ పార్కులో..
 కమిషనర్ : నేను సాక్షి వీఐపీ రిపోర్టర్‌గా మీ సమస్యలు తెలుసుకునేందుకు వచ్చాను. ఇక్కడ పార్కులో ఏమైనా సమస్యలున్నాయా? మున్సిపల్ పార్కులు ఎలా ఉన్నాయి? ఏవిధమైన అభివృద్ధి జరగాలా?
 యోగా శిక్షకులు : సార్.. యోగాభ్యాసం నేర్చుకునే వారికి అవసరమైన ల్యాన్(పచ్చగడ్డి) ఏర్పాటు చేశారు. అయితే నేల ఎగుడుదిగుడుగా ఉండడం వల్ల పూర్తిస్థాయిలో యోగా చేయలేకపోతున్నాం. నగరంలోని మున్సిపల్ ఖాళీ స్థలాల్ని ఇదే విధంగా పార్కులుగా అభివృద్ధి చేయాలి.
 అక్కడే ఉన్న సీనియర్ సిటీజన్ల వద్దకు వెళుతూ..
 కమిషనర్ : ఏం సార్.. ఎలా ఉంది? సాయంత్రం వేళలో ఎలా గడుపుతున్నారు? పార్కులో ఏమైనా సమస్యలున్నాయా?
 సీనియర్ సిటిజన్ : సార్, మా లాంటి సీనియర్ సిటిజన్లకు ఈ పార్కు ఎంతో అనుకూలంగా ఉంది. అయితే కింద కూర్చోవాలంటే మోకాళ్ల నొప్పుల కారణంగా ఇబ్బందిగా ఉంది. సిమెంటు కుర్చీలు మరికొన్ని వేయిస్తే బాగుంటుంది. (అప్పటికప్పుడు స్పందించిన కమిషనర్.. పార్కులో మూలన ఉన్న సిమెంటు కుర్చీలను తెప్పించి సీనియర్ సిటిజన్స్ కూర్చునే చోట వేయించారు)
 కమిషనర్ : మహిళలకు, పిల్లలకు పార్కు అనుకూలంగా ఉందా?
 మహిళలు : సార్, మా ఎదురుగా ఉండే మా స్కూలు పిల్లలు రోజూ ఇక్కడే వచ్చి ఆడుకుంటున్నారు. అయితే పార్కుకు వచ్చే మహిళలకు టాయిలెట్ సౌకర్యం లేదు.

మరిన్ని వార్తలు