పెళ్లి ఇష్టంలేక యువతి ఆత్మహత్య

13 Jun, 2018 10:36 IST|Sakshi

సాక్షి, విశాఖ క్రైం : పెళ్లి ఇష్టం లేని యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. గురుద్వార కూడలి శాంతిపురం అరుణ అపార్టుమెంట్‌లో సత్తరు అప్పన్న, నారాయణమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె సత్తరు రేవతి (20), కుమారుడు చైతన్య ఉన్నారు. అప్పన్న నెల్లూరులో మెకానిక్‌గా పనిచేస్తున్నారు. కుమార్తె రేవతి డిగ్రీ పరీక్షలు రాసింది. రేవతికి బావతో పెళ్లి కుదిర్చారు. ఈనెల 22న వివాహం నిర్ణయించారు. ఈ క్రమంలో పెళ్లి పనుల్లో భాగంగా సోమవారం పెళ్లి కార్డుల పంపిణీకి రేవతి కుటుంబ సభ్యులు వెళ్లారు.

ఈ నేపథ్యంలో  రేవతి సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్‌ హుక్‌కు చున్నితో ఉరి వేసుకొని అత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం ఇంటికి  వచ్చిన రేవతి తల్లి, కుటుంబ సభ్యులు తలుపులు ఎంత కొట్టినా తీయకపోవడంతో గట్టిగా తోసి లోపలకు ప్రవేశించారు. ఇంటిలో సిలింగ్‌ హుక్కుకు వేలాడుతున్న రేవతిని చూశారు. వెంటనే ఆమెను కిందకు దించి కేర్‌ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రేవతి తల్లి నారాయణమ్మ ద్వారకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన హెడ్‌ కానిస్టేబుల్‌ తులసీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం రేవతి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. చదువుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న రేవతి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసు విచారణలో వెల్లడైనట్టు తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా