యువతి మౌన పోరాటం

17 Mar, 2015 03:35 IST|Sakshi
యువతి మౌన పోరాటం

పల్లివూరు (వజ్రపుకొత్తూరు): 8 ఏళ్లు ప్రేమయాణం సాగించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. తీరా వివాహం చేసుకోవాలని కోరితే మా ఇంటిలో వాళ్లు ఒప్పుకోరు పొమ్మంటున్నాడు అని ఆరోపిస్తూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. ప్రియుడితో తనకు పెళ్లి జరిపించాలని ఆమె డిమాండ్ చేసింది. పోలీసులు.. బాధితురాలి తెలిపిన వివరాల ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండల పల్లివూరుకు చెందిన దున్న శారద (24) అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరావు (28) ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దవాళ్లను ఒప్పించి వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఈ 8 ఏళ్ల కాలంలో శ్రీనివాసరావు దుబాయ్, మస్కట్ వెళ్లి అక్కడ కొంతకాలం పని చేసి వస్తున్నాడు. ఈ ఏడాది గ్రామానికి వచ్చిన శ్రీనివాసరావుని శారద పెళ్ల్లి చేసుకోవాలని కోరింది. ప్రియుడు నిరాకరించాడు.
 
 దీంతో ఆమె ఈ నెల 5న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సకాలంలో ఆమెకు వైద్య సేవలు అందించడంతో కోలుకుంది. ఈ విషయం గ్రామ పెద్దల పంచాయితీ వరకూ వెళ్లింది. పెద్దలు శ్రీనివాసరావును పిలిచి పెళ్లి చేసుకోవాలని, ఆడపిల్లకు అన్యాయం చేయవద్దను నచ్చజెప్పారు. అయినా అతగాడు వినకపోవడంతో సోమవారం శారద ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. కాగా శ్రీనివాసరావు ముందస్తుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శారద నన్ను వేధిస్తోందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. శారద కూడా పోలీసులకు శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేసింది. 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం తమకు పెళ్లి చేయాలని కోరింది. ఇద్దరి ఫిర్యాదులు స్వీకరించిన వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ కె.రవికిషోర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

మరిన్ని వార్తలు