దారుణం: రసాయనం మందు వాసన వస్తుండటంతో..

1 Apr, 2020 10:56 IST|Sakshi
మృతిచెందిన నవీన్‌మూర్తి రాజు (ఫైల్‌) - చికిత్స పొందుతున్న వీరేష్, వెంకటేష్‌ 

‘ఐసో ప్రొపిల్‌ ఆల్కహాల్‌’ తాగిన ఆరుగురు మిత్రులు 

ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

జిల్లాలో కలకలం

పశ్చిమ గోదావరి, తణుకు: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వైన్‌ షాపులు బంద్‌ కావడంతో మద్యానికి బానిసలైన కొందరు యువకులు శానిటైజర్‌లో వినియోగించే ఐసో ప్రొపిల్‌ ఆల్కహాల్‌ తాగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అసలేం జరిగిందంటే.. తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన ధర్నాల నవీన్‌ మూర్తిరాజు (22), అదే గ్రామానికి చెందిన అల్లాడి వెంకటేష్, ఇరగవరం మండలం కావలిపురం గ్రామానికి చెందిన పండూరి వీరేష్, ఇరగవరం మండలం కావలిపురం గ్రామానికి చెందిన తణుకు దుర్గారావు, విప్పర్తి శ్యాంసుందర్, ఉండ్రాజవరం మండలం చివటం గ్రామానికి చెందిన కావలిపురపు వెంకటదుర్గాప్రసాద్‌ మిత్రులు.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కొద్ది రోజులుగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా మద్యం షాపులు మూతపడడంతో వీరు ప్రత్యామ్నాయం వెతుక్కున్నారు. పండూరి వీరేష్‌ తణుకు మండలం పైడిపర్రులో అంబికా కెమికల్స్‌లో పని చేస్తున్నాడు. ఈనెల 29వ తేదీ ఆదివారం ఏలూరు నుంచి సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణం లోడ్‌ వచ్చింది. టిన్నులు దించడానికి వీరేష్‌ను యజమాని తమ్మయ్యనాయుడు పిలిపించారు. ఆదివారం ఉదయం లోడ్‌ దించిన తర్వాత అక్కడే శానిటైజర్‌లో ముడిపదార్థంగా ఉపయోగించే ఐసో ప్రొపిల్‌ ఆల్కహాల్‌ను 400 మిల్లీలీటర్లు బాటిల్‌లో వీరేష్‌ పట్టుకెళ్లాడు.

అదే రోజు మధ్యాహ్నం తన మిత్రులకు ఫోన్‌ చేసి శానిటైజర్‌ తయారు చేసుకుందాం... ఇందుకు సంబంధించి ఐసో ప్రొపిల్‌ ఆల్కహాల్‌ను తీసుకువచ్చానని చెప్పాడు. దీంతో ధర్నాల నవీన్‌ మూర్తిరాజు, అల్లాడి వెంకటేష్, తణుకు దుర్గారావు, విప్పర్తి శ్యాంసుందర్, కావలిపురపు వెంకటదుర్గాప్రసాద్‌ వీరేష్‌ను కలిశారు. వీరంతా కావలిపురం చెరువు దగ్గర కలుసుకుని మాట్లాడుకున్నారు. మద్యం దొరక్కపోవడంతోపాటు తీసుకువచ్చిన రసాయనం మందు వాసన వస్తుండటంతో వీరంతా కలిసి స్ప్రైట్‌లో కలుపుకుని తాగారు. వీరిలో ధర్నాల నవీన్‌బాబు, వెంకటేష్, వీరేష్‌ ఎక్కువ మోతాదులో తాగారు. దుర్గారావు, దుర్గాప్రసాద్, శ్యాంసుందర్‌ భయంతో తక్కువ మోతాదులో తీసుకున్నారు.

వీరంతా ఇంటికి వెళ్లిపోయాక మరుసటి రోజు నవీన్‌మూర్తిరాజు పరిస్థితి విషమిచండంతో తణుకులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందడంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఖననం చేశారు. వెంకటేష్‌ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో తణుకులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి నుంచి పోలీసులకు సమాచారం చేరడంతో విషయం ఆలస్యంగా బయట పడింది. వీరేష్‌ పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో తణుకు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.  బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ అధికారులు దర్యాపు చేపట్టారు. ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ వి.అనసూయదేవి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి వివరాలు సేకరించారు.

మరిన్ని వార్తలు