యువకుడి ఆత్మహత్యాయత్నం

14 Aug, 2018 13:36 IST|Sakshi
తహసీల్దార్‌తో వాగ్వాదం చేస్తున్న బాధితులు

తహసీల్దార్‌ కార్యాలయంలో ఘటన

భూ సమస్య పరిష్కారం కాలేదని మనస్తాపం

గుంతకల్లు రూరల్‌: భూ సమస్యను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మనస్తాపానికి గురైన యువకుడు తహసీల్దార్‌ కార్యాలయంలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడి కథనం మేరకు.. అమీన్‌పల్లికి చెందిన హరిజన హనుమంతు గతంలో ప్రభుత్వం నుంచి రెండెకరాల  భూమి పొందాడు. అతడి తదనంతరం ఇద్దరు కుమారులైన గురుస్వామి, లాలూస్వామిలకు చెరో ఎకరా చొప్పున పంచాడు. కాగా రెండో కుమారుడైన లాలూస్వామి 1999లో తన ఎకరా పొలాన్ని అదే గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, చెన్నయ్యలకు చెరి అర్ధ ఎకరా చొప్పున  విక్రయించాడు. అయితే మద్యం మత్తులో ఉన్నపుడు బెదిరించి పొలాన్ని రాయించుకున్నారని, వెంటనే తమ పొలాన్ని తమకు అప్పగించాలని కోరుతూ లాలుస్వామి భార్య లక్ష్మీదేవి, వారి కుమారుడు లాలుస్వామిలు తహసీల్దార్‌ కార్యాలయంలో అర్జీ ఇచ్చారు.

ఆ తరువాత  సమస్య పరిష్కారం కోసం కొద్ది రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం లాలూస్వామి భార్య, కుమారుడితో కలిసి వచ్చిన లాలూస్వామి సోదరుడి కుమారుడు రామాంజనేయులు తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సమస్యను పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంట తెచ్చుకున్న పెట్రోలును ఒక్కసారిగా రామాంజనేయులు తనమీద పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అక్కడున్న ఇతర అధికారులు, కార్యాలయ సిబ్బంది అతడిని వారించి బయటకు నెట్టుకొచ్చారు. ఆ తరువాత అక్కడికి చేరుకున్న పోలీసులు, ఇతరులు సర్ధిచెప్పడంతో బాధితులు శాంతించారు. తమకు 15 రోజుల క్రితమే భూ సమస్యపై అర్జీ ఇచ్చారని, విచారణ చేసి న్యాయం చేస్తామని చెప్పినా వినకుండా ఇలా ఆత్మహత్యాయత్నం చేశాడని తహసీల్దార్‌ హరిప్రసాద్‌ తెలిపారు. ప్రతి ఒక్కరూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడితే ఉద్యోగం ఎలా చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు