అమెరికాలో జలపాతంలో జారిపడి పొదిలి యువకుడి మృతి

28 May, 2014 05:49 IST|Sakshi
అమెరికాలో జలపాతంలో జారిపడి పొదిలి యువకుడి మృతి

పొదిలి, న్యూస్‌లైన్: వేసవి సెలవులను సరదాగా గడిపేందుకు వెళ్లిన ఓ యువకుడు జలపాతంలో జారిపడి మృతిచెందాడు. ఈ ఘటన అమెరికాలోని డెలావేర్ స్టేట్ విల్‌మిల్టన్ సిటీలో భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు.. ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన నారాయణరెడ్డి, సుజాతలు ఉద్యోగరీత్యా ఒమన్ దేశంలో నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు, చికాగోలో ఎమ్‌ఎస్ చేస్తున్న సందీప్‌రెడ్డి(22) వీకెండ్ సెలవులు గడిపేందుకు అతని బాబాయి  శ్రీనివాసులరెడ్డి నివాసం ఉంటున్న డెలావేర్ స్టేట్‌లోని విల్‌మిల్టన్ సిటీకి వెళ్లాడు.
 
  సెలవుల్లో శ్రీనివాసరెడ్డి, అతని మిత్రులు, కుటుంబ సభ్యులతో కలసి సందీప్‌రెడ్డి  ఆదివారం సాయంత్రం జలపాతం దగ్గరకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు జలపాతంలో జారిపడిన సందీప్‌రెడ్డిని రక్షించేందుకు శ్రీనివాసరెడ్డి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కోమాలోకి వెళ్లిన సందీప్‌రెడ్డిని అక్కడి వైద్యశాలలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సందీప్‌రెడ్డి విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ చేసి ఎంఎస్ కోసం అమెరికా వెళ్లాడు.

>
మరిన్ని వార్తలు