రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

3 Oct, 2013 00:49 IST|Sakshi

బైకును ఢీకొన్న గుర్తుతెలియని వాహనం
మరో వ్యక్తికి తీవ్ర గాయాలు  
మృతుడి కుటుంబీకుల రోదనలతో దద్దరిల్లిన సాగర్ రోడ్డు

 
 యాచారం,న్యూస్‌లైన్: బీటెక్ చదివిన ఓ యువకుడు సొంతకాళ్లపై నిలబడాలనుకున్నాడు. ఇంటి వద్దే ఉంటూ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆరు నెలల క్రితం వివాహం చేసుకొని ఉన్నంతలో ఆనందంగా ఉంటున్నాడు. అతడిని చూసి విధి ఓర్వలేకపోయినట్టుంది. రోడ్డు ప్రమాదం రూపంలో బలితీసుకొని కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ఈ విషాదకర సంఘటన సాగర్ రోడ్డుపై బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచాల మండల పరిధిలోని ఎల్లమ్మ తండాకు చెందిన సభావట్ రమేష్(26) బీటెక్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఇంటి వద్దే కిరాణ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు.
 
 ఇటీవల మహేశ్వరం తండాకు చెందిన చిట్టిని వివాహం చేసుకున్నాడు. ఉన్నంతలో కుటుంబం సంతోషంగా ఉంది. బుధవారం రాత్రి 7: 30 గంటల సమయంలో రమేష్ అదే తండాకు చెందిన చిన్నాతో కలిసి బైకుపై పని నిమిత్తం యాచారం వచ్చాడు. ఇబ్రహీంపట్నంలో బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో అక్కడి నుంచి బయలుదేరారు. సాగర్ రోడ్డులో మార్గంమధ్యలో గునుగల్ రిజర్వాయర్ సమీపంలోని మలుపులో వీరి బైకును గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో రమేష్ తలపగిలి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. చిన్నాకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శ్రీధర్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. చిన్నాను 108 వాహనంలో నగరంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా చిన్నా ఇబ్రహీంపట్నం సమీపంలోని ఓ కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 మిన్నంటిన రోదనలు
 గంట ముందే ఇంట్లోంచి బయలుదేరిన రమేష్ అంతలోనే మృత్యువాత పడడంతో కుటుంబీకులు జీర్ణించుకోలేకపోయారు. అతడి మృతదేహంపై పడి రోదించిన తీరు పలువురికి కంటతడి పెట్టించింది. మృతుడి బంధువులు భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి రోదనలతో సాగర్ రోడ్డు మిన్నంటింది. వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఎస్‌ఐ శ్రీధర్ కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం మార్చురీకి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.

మరిన్ని వార్తలు