మీ బాండ్లను ‘ఫైనాన్స్‌కు’ ఇవ్వండి

13 Apr, 2015 03:16 IST|Sakshi
మీ బాండ్లను ‘ఫైనాన్స్‌కు’ ఇవ్వండి
  • రైతులకు చెప్పిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు
  • సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రుణాల మాఫీ విషయంలో రైతులను నిండా ముంచిన ప్రభుత్వం ఇప్పుడు బాండ్ల పేరుతో వింత నాటకానికి తెరతీస్తోంది. ప్రభుత్వం ఇచ్చే బాండ్లను రైతులు పెద్ద ఫైనాన్స్ కంపెనీలకు ఇచ్చేలాగా ప్రోత్సహిస్తోంది. తద్వారా ఫైనాన్స్ కంపెనీల వ్యాపారాభివృద్ధికి తోడ్పాటు అందిస్తోంది. ఈ విషయంలో కూడా రైతు పది వేల రూపాయల వరకు నష్టపోతున్నాడు. ప్రభుత్వం బాండ్లపై ఇచ్చే పది శాతం వడ్డీ ఫైనాన్స్ కంపెనీలకు ముట్టచెప్పాలనే ఎత్తుగడకు తెరతీస్తోంది.

    అదెలాగంటే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఇటీవల తనను కలసిన రైతులకు వివరించారు. రుణమాఫీలో భాగంగా ఒక్కో రైతుకు లక్షన్నర రూపాయల లోపు రుణాలనే ప్రభుత్వం మాఫీ చేస్తోందని, అందులో తొలి విడతలో రూ.30 వేలు ఇచ్చామని చెప్పారు. మిగతా రూ.1.20 లక్షలకు త్వరలో ప్రభుత్వం బాండ్లు ఇస్తుందని తెలిపారు. బాండ్లు ఇచ్చిన తరువాత పెద్ద బ్యాంకులు, సుందరం వంటి పెద్ద ఫైనాన్స్ కంపెనీలతో మాట్లాడతామని చెప్పారు.

    బాండ్లు తీసుకున్న వారు ఆ సంస్థలో బాండ్లు ఇచ్చేస్తే డబ్బులు ఇస్తారని తెలిపారు. రూ.1.20 లక్షల బాండ్లు ఇస్తే ఫైనాన్స్ కంపెనీ రూ.1.10 లక్షలే ఇస్తుందని చెప్పారు. ఫైనాన్స్ కంపెనీలు వ్యాపారం చేస్తున్నందున పన్ను చెల్లించాల్సి ఉంటుందని, ఆ పన్ను, వడ్డీ కింద రూ.10 వేలను మినహాయించుకుంటాయన్నారు. ప్రభుత్వ వెంచర్లు, బాండ్లు రూ.100 విలువుంటే కంపెనీలు 98 లేదా 92 లేదా 93 రూపాయల చొప్పున మాత్రమే ఇస్తాయని చెప్పారు. ఇదే జరిగితే రైతు పదివేల రూపాయలు నష్టపోవాల్సిందే.

>
మరిన్ని వార్తలు