గుంటూరు జిల్లాకు పాకిన గన్ కల్చర్

10 Nov, 2014 10:43 IST|Sakshi
గుంటూరు జిల్లాకు పాకిన గన్ కల్చర్

గుంటూరు : గన్ కల్చర్ గుంటూరు జిల్లాకు పాకింది. ప్రత్యర్థులను హతమార్చేందుకు హేమంత్ అనే యువకుడు తుపాకీని కొనుగోలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. విజయవాడ పోలీసులు హేమంత్ను అదుపులోకి తీసుకున్నారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో అతడిని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే....గుంటూరు జిల్లా నాదెండ్ల మండలానికి చెందిన ఇంజినీర్ హేమంత్ కుమార్ మూడు రోజుల కిందట బీహార్ నుంచి దేశవాళీ పిస్టల్ తీసుకొస్తుండగా రైల్వేస్టేషన్ సమీపంలో టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హేమంత్ స్వగ్రామం అమీన్ సాహెబ్ పాలెంలో రెండు వర్గాల మధ్య గొడవలు ఉన్నాయి. వినాయక చవితి పండుగ అనంతరం నిమజ్జనం సందర్భంగా గొడవలు రేగి ప్రత్యర్థి వర్గం హేమంత్ మేనమామపై దాడి చేసింది. అప్పటి నుంచి రెండు వర్గాలు పరస్పరం దాడులు జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్లో ఓ నిర్మాణ కంపెనీలో సైట్ ఇంజినీర్గా చేరిన హేమంత్ విధుల నిర్వహణలో భాగంగా బీహార్ వెళ్లాడు. మేనమామ వర్గీయుల కోరిక మేరకు అక్కడ దేశవాళీ పిస్టల్ కొనుగోలు చేశాడు.

దానిని తనవారికి ఇచ్చేందుకు మూడు రోజుల కిందట రైల్లో విజయవాడ చేరుకున్నాడు. అక్కడ నుంచి బయటకు వచ్చి బస్టాండ్కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు హేమంత్ను అదుపులోకి తీసుకుని పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. కక్షల నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకునేందుకు పిస్టల్ తీసుకొస్తున్నాడా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని వార్తలు