అమిత్‌షావన్నీ మాయమాటలు

8 Mar, 2016 01:35 IST|Sakshi
అమిత్‌షావన్నీ మాయమాటలు

యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అవినాష్ విమర్శ

విజయవాడ సెంట్రల్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మరోమారు రాష్ట్ర ప్రజల్ని మాయ చేసే విధంగా హామీలు గుప్పించారని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. ఆంధ్రరత్న భవన్‌లో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్‌షా మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు రూ.1.40 లక్షల కోట్లు ఇస్తున్నట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఇవ్వడంలో విఫలమైన బీజేపీ, బడ్జెట్‌లోనూ సక్రమంగా నిధులు మంజూరు చేయలేదని మండిపడ్డారురు.

రూ.30 వేల కోట్ల రూపాయలు అవసరమయ్యే పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.100 కోట్లు మంజూరు చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. విభజన చట్టంలో హామీల ప్రస్తావన సభలో చేయలేదని, నిరుద్యోగ భృతి, ఉపాధి అవకాశాల కల్పనపై ఎలాంటి హామీ ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 12లో ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అదే రోజు ఆంధ్రరత్న భవన్‌లో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయాన్ని పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు, యువజన కాంగ్రెస్ నాయకులు కిషోర్, చైతన్య పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు