-

సైనికుడై వస్తాడనుకుంటే..

9 Jul, 2015 00:49 IST|Sakshi

 ఆర్మీ రిక్రూట్ మెంట్‌లో అపశ్రుతి  
 పరుగు పందెంలో మొదటి స్థానంలో నిలిచిన యువకుడు
 అనంతరం అస్వస్థతతో
 అపస్మారకస్థితికి చేరుకున్న వైనం
 విశాఖపట్నం కేర్‌లో
 చికిత్స పొందుతూ మృతి
 తూడిలో విషాదఛాయలు

 
 దేశసేవలో తరించాలనుకున్నాడు... భరతమాత ముద్దుబిడ్డగా ఎదగాలనుకున్నాడు... ఆర్మీజవానుగా మారి... శత్రు సైన్యాన్ని తుదముట్టించాలనుకున్నాడు... చిన్ననాటి కలలను సాకారం చేసుకోవాలనుకున్నాడు... విధి ఆ యువకుడిని చిన్నచూపు చూసింది... పట్టుదలతో పరుగులో మొదటిస్థానంలో నిలిచినా.. బతుకు పరుగులో విగతుడయ్యాడు... పాపం! కన్నవారికి కడుపుకోత మిగిల్చాడు.
 
 తూడి(వీరఘట్టం):ఆర్మీ జవాన్‌గా దేశసేవ చేయాలన్నది ఆ యువకుడి ఆశ. అదే సంకల్పంతో ఇప్పటికి రెండు సార్లు యత్నించి విఫలమయ్యాడు. మూడోసారి ఎంపికలకు కుటుంబ సభ్యులు వద్దనా పట్టుదలగా వెళ్లాడు. పరుగులో విజేతగా నిలిచాడు. కానీ విధివశాత్తూ అస్వస్థతకు లోనై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఇదీ తూడి గ్రామానికి చెందిన నీలబాబు(21) విషాద గాథ. వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నంలో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం రెండు రోజుల క్రితం తూడి గ్రామానికి చెందిన పొన్నాడ నీలబాబు తన మిత్రులతో కలిసి వెళ్ళాడు. బుధవారం నిర్వహించిన పరుగు పందెంలో అందరికంటే వేగంగా దూసుకువచ్చి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అనంతరం తీవ్ర అస్వస్థతకు లోనై అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆర్మీ సిబ్బంది కేజీహెచ్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యంకోసం కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. దురదృష్టవశాత్తూ కేర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నీలబాబు ఊపిరితిత్తులు పూర్తిగా పాడవడంతో ఈ పరిస్థితి వచ్చిందని కేర్ వైద్యులు ధ్రువీకరించారు.
 
 కన్నీరుమున్నీరైన కన్నవారు
 తమ ఏకైక కుమారుడు ఆర్మీ జవాన్‌గా వస్తాడని ఎదురుచూసిన తల్లిదండ్రులకు తనయుడు విగతజీవుడయ్యాడనే వార్త తెలియగానే హతాసులయ్యారు. కన్నతల్లి గంగమ్మ, పెంచిన తల్లి గౌరీశ్వరి, తండ్రి పెద్ద గౌరినాయుడు ఒక్క సారిగా కుప్పకూలిపోయారు. తరువాత తేరుకుని కొడుకును చూసేందుకు విశాఖపట్నం తరలి వెళ్ళారు. నీలబాబుకు డిగ్రీ చదువుతున్న చెల్లెలు సంధ్యారాణి ఉన్నారు. నీలబాబు మరణవార్త గ్రామమంతా పాకడంతో వారంతా నిర్ఘాంతపోయారు. మొత్తమ్మీద తూడి గ్రామమంతా విషాదఛాయలు అలముకున్నాయి.
 

మరిన్ని వార్తలు